తినేటప్పుడు కబుర్లు చెబితే అమ్మకు నచ్చేది కాదు. ‘నోరు మూసుకుని తిను,’ అనేది. ఈ వాక్యం విన్నప్పుడెల్లా, నవ్వొచ్చేది. కానీ, నచ్చేది. వెంటనే ఈ వాక్యానికి పేరడీలు చేయాలనిపించేది. ‘కళ్ళు మూసుకుని చూడు’, ‘కాళ్ళు ముడుచుకుని పరుగెత్తు’ ‘చేతులు కట్టుకుని చప్పట్లు కొట్టు.’
అమ్మ వాక్యాన్ని అక్షరబధ్ధంగా అమలు చెయ్యటానికి నేనేమన్నా పార్థుణ్ణా? వొళ్ళు వంచి సంపాదించుకొచ్చినట్లు, విల్లు వంచి తెస్తాడు ద్రౌపదిని. ఆ విషయం శుధ్ధ వచనంలో చెప్పొచ్చు కదా! ‘అమ్మా! పండు తెచ్చానే’ అని కవిత్వం వెలగబెడతాడు. ఆమెకు మాత్రం అది వచనంలాగానే అనిపిస్తుంది. ‘అయిదుగురూ పంచుకోండి’ అంది. కొన్ని విషయాల్లో మాతృవాక్పరిపాలకులయిన పాండవులు, వాక్యాన్ని వాచ్యంగా తీసుకుని అమలు జరిపేశారు.