పేరు :శివ ప్రసాద్
దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రిన్సిపాల్, ‘తెలుగు’ స్కూల్ ఆఫ్ డ్రామా, ఎన్టీఆర్ట్రస్ట్, హైదరాబాద్
ముద్దు పేర్లు : ‘పగటి’ వేషాద్! ( పూటకో వేషం) ‘శైశవ’ ప్రసాద్ ( కొందరికి నేను చేసేవి పిల్ల చేష్టల్లా అని పించవచ్చు.)
విద్యార్హతలు : ‘వైద్యో నారాయణో హరీ’ అన్నారని డాక్టర్ చదివాను. ఇలా అని అంటే, కొందరేమన్నారో తెలుసా- ‘అన్నా, నీ వైద్యానికి నారాయణుడు కూడా- హరీ- అన్నాడా?’ అంటారు. పది మందిని చంపితేనే కానీ డాక్టరు కాలేడంటారు. కానీ నేను నమ్మను. ఆ మాట కొస్తే, ఒక్క డాక్టరేమిటి? యాక్టర్ కూడా అంతే. ఓ వందమందిని చంపితేనే కానీ, ఒక యాక్టరు కాలేడు. నన్ను చూడండి. పార్లమెంటు ముందు నా పగటి వేషం చూసినప్పుడెల్లా చచ్చి ఊరుకుంటున్నారు.