ఇలావచ్చి అలా పోయేవి ఎక్కువ మురిపిస్తాయి. మెరుపూ, చినుకూ, కెరటం, మోహం- అన్నీ అంతే. శాశ్వతం- అనుకునేవి ఏవీ అంతటి ఆనందాన్ని ఇవ్వలేవు. జీవితం కూడా అంతే కదా. తుర్రున వచ్చి తుర్రున పోతుంది. అందుకే అంత ఆశపెడుతుంది. ప్రేమ,ప్రేమ అని ఊరేగుతాం, కానీ, మొత్తం ప్రేమాయణానికి గుర్తులుగా మిగిలేవి కొన్ని క్షణాలే. సాయింత్రంపూట కాలేజి బస్సు ఎక్కేముందు, కలిసి తిన్న పానీ పూరీలూ, ఎవరి కంటా పడకూడదని పక్క పక్క సీట్లలో కూర్చుని డొక్కు థియేటర్లో చూసిన పౌరాణిక చిత్రాలూ- ఇవే కదా ఎప్పటికీ మురిపించే విషయాలు!!
Tag: వెన్నెల
ముసుగు
పొద్దుకు మంచు మసుగు. పాలకు వెన్నముసుగు. సొంపుకు సిగ్గు ముసుగు. కన్నీటికి కవిత ముసుగు. మమతకూ మమతకూ మధ్యకూడా చిన్న తెరయినా వుండాలి. కానీ వాణిజ్యానికి తెరలుండవు. బంధువు ఇంటికి వచ్చీ రాగానే, ‘మరి వెళ్ళేదెప్పడూ?‘ అని అడిగేది వాణిజ్యమే. కాఫీ డేలో కాఫీ చల్లారే లోగా ‘ప్రేమించేస్కుంటే ఓపనయి పోద్దేమో ’అని ఇద్దరూ బిజినెస్ లైక్ గా లేచిపోతారు. సన్నటి తెరల్ని ఎవరో చించుకుంటూ వెళ్ళిపోతుంటే, మిగిలేది పచ్చితనమే.
వెన్నెల ముద్ద
ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుస్తున్నప్పడు చూశారా? గొప్ప్ర సన్నివేశం కదూ.వాన వెలిశాక హరివిల్లు విరిసినట్లుంటుంది. ఈ హరివిల్లేమో, ఈ కొండ నుంచి ఆ కొండకు విస్తరించినట్లువుంటుందా! ఓదార్పు కూడా అంతే, ఈ గుండెనుంచి ఆ గుండెవరకూ …హరివిల్లు వెళ్ళిపోతుంది. ఆ చిత్రం మనసులో నిలిచిపోతుంది.ఇలాంటిదే ఒక పదచిత్రం ’వెన్నెల ముద్ద’..