వెలి అంటే- ఊరికి మాత్రమే వెలుపల కాదు, ఉత్పత్తికి కూడా వెలుపల వుంచటం . అంటరానితనమంటే, వొంటిని తాకనివ్వకపోవటం మాత్రమే కాదు, వృత్తిని తాకనివ్వక పోవటం కూడా. వ్యవసాయమే ఉత్పత్తి అయిన చోట, దానికి చెందిన ఏ వృత్తినీ అస్పృశ్యులకు మిగల్చలేదు. అందుకే వారు ఇతరులు చేయటానికి భయపడే (కాటికాపరి లాంటి) వృత్తులూ, చేయటానికి అసహ్యించుకునే(మృతకళేబరాలను తొలగించే) వృత్తులూ చేపట్టాల్సివచ్చింది. అందుకే గుడిలో ప్రవేశించటమే కాదు, మడి(చేను)లోకి చొరబడటమూ తిరుగుబాటే అయింది. ఈ పనిచేసినందుకు లక్ష్మీపేట దళితులను అక్కడి కాపు కులస్తులు నరికి చంపారు. వారి పోరాటస్పూర్తితో వచ్చిందే ‘భూగర్భశోకం’ కవిత.