రాజ్యం తర్వాత రాజ్యాన్ని కైవసం చేసుకుంటూ వెళ్ళే దండయాత్రలాగా, నరేంద్రమోడీ-అమిత్ షాలు రాష్ట్రాన్ని తర్వాత రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ వెళ్తున్నారు. మహారాష్ట్ర, హర్యానాలు ముగిసాయి; ఇప్పుడు జమ్మూ-కాశ్మీర్, జార్ఖండ్‌లు, వెను వెంటనే ఢిల్లీ. మహరాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 22 సీట్లు తక్కువ వచ్చినా, హర్యానాలో సంపూర్ణమైన మెజారిటీయే వీరి నేతృత్వంలో బీజేపీ సాధించింది. రెండు చోట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత నుంచీ ‘మోడీ-షా’లు రాజకీయంగా ఒక సందేశాన్ని దేశమంతటా పంపిస్తున్నారు: ‘సంకీర్ణయుగం ముగిసింది’. ఈ సందేశాన్ని ముందు వారు ‘మనోవాక్కాయ కర్మణా’ నమ్మాలి.