కడలికి నింగిని చేరాలనీ, నింగికి కడలిని చేరాలనీ కోరిక. కడలి రగిలి రగిలి ఆవిరయి వెండి మేఘంలాగా పైకి చేరిపోతే, నింగి పొగిలి పొగిలి ఏడ్చి వానగా కడలికి చేరుతుంది. గుండెకు గుండెను చేరాలనే కోరిక. దేహానికి మరో దేహంతో పెనవేసుకోవాలనే కోరిక. మనిషికి మనిషి చేరుకునే కోరికే లేకుంటే జీవితం పుట్టగానే ముగిసిపోతుంది.
Tag: satish chandar’s short poems
ప్రేమకు నిర్వచనాలు
ఇదే జీవితాన్ని ఇంతకు ముందు ఎంత మంది జీవించలేదు. కొత్తగా జీవించటానికి ఏమి వుంటుంది? ఇదే సముద్రం. ఎన్ని సార్లు చూడలేదు? కొత్తగా చూడటానికి ఏముంటుంది? ఇలా అనుకునేది జీవితమే కాదు. కడలి వొడ్డున మన కాళ్ళనే ఒక్క రీతిగా తడుపుతాయా అలలు? వెండి పట్టీలు తొడిగినట్లు ఒక మారూ, పడి వేడుకున్నట్టు ఇంకో మరూ, కాళ్ళకింది ఇసుకను తొలచి పట్టు తప్పిస్తున్నట్టు మరో మారూ- అలలు తాకిన ప్రతీ సారీ ఒక కొత్త అనుభూతి. ఒక్కతే చెలి. కానీ ప్రతీ ఆలింగనమూ ఒక కొత్త అనుభవం. అన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా నిర్వచించుకోవాల్సిందే.!
చీకటి వేట!
అంతా అయిపోయిందనుకుంటాం. అందరూ కుట్ర చేసి మనల్ని ముంచేసారనుకుంటాం. నమ్మకం మీద నమ్మకం పోయిందనీ, ఆశ మీదే ఆశ చచ్చిందనీ తెంపు చేసుకుని వుంటాం. ఎవరో ఊరూ, పేరు తెలీని వారొచ్చి, ఉత్తినే సాయం చేసి పోతారు. చిన్న పలకరింపు లాంటి మాట సాయమే కావచ్చు. మండువేసవిలో కరెంటులేని గదిలో ఊపిరాడనప్పుడు, కిటికీలోంచి పిల్లవాయివొచ్చి మోమును తాకి వెళ్ళినట్టుంటుంది కదూ..! అప్పుడు మళ్ళీ జన్మలోనే మరో జన్మ యెత్తినట్లుంటుంది
శత్రు సూక్తం
మిత్రుడేం చేస్తాడు? నా అభిప్రాయాన్ని వినకుండానే సమర్థించేస్తాడు, నా పనులకు అనాలోచితంగానే సహకరించేస్తాడు, నా ప్రవర్తన ఎలా వున్నా మురిసి పోతాడు. ఒక్క ముక్కలో అద్దం లో నా ప్రతిబింబం లాంటి వాడు. నాలాంటి నన్ను చూసి నేను నేర్చుకునేదేముంటుంది- నటన తప్ప. అదే శత్రువనుకో. నా అభిప్రాయాన్నివ్యతిరేకిస్తాడు. నన్ను రెచ్చగొడతాడు. నా లోని శక్తియుక్తుల్ని బయిటకు తీస్తాడు. నా లోపాలని నాకు పటం కట్టి ప్రజెంట్ చేస్తాడు. అందుకే నేను నా మిత్రుడి కన్నా, శత్రువుకే ఎక్కువ రుణపడతాను.
మనిషిలో మనిషి
నాలో నన్నూ, నీలో నిన్నూ, మనలో మనల్నీ వెతుక్కుంటూనే వుంటాం. ఒకరికి ఒకరు దొరుకుతాం కానీ, ఎవరికి వారు దొరకం. కానీ అప్పుడప్పుడూ దొరికి జారిపోతుంటాం. అలా దొరికినవి కొన్ని క్షణాలే కావచ్చు. అప్పుడు కల కూడా కవిత్వంలాగా వుంటుంది. జీవితం ప్రియురాలంత ఇష్టంగా వుంటుంది. పసిపిల్లంత ముద్దుగా వుంటుంది. నేను పుట్టిపెరిగిన ఇల్లంత గొప్పగా వుంటుంది. అందుకే నాలోకి నన్ను నెట్టేవాళ్ళ కోసం నిత్యం ఎదురు చూస్తూనే వుంటాను.
నిన్నకు ముందు
గతంలో బతికే భూత జీవులూ, రేపటికి వాయిదా వేసే దూరాశా జీవులూ ఏం చేస్తారో తెలియదు కానీ, ఆ పేరు మీదు వర్తమానాన్ని వదిలేసుకుంటారు. కళ్ళ ముందే బస్సులు వచ్చి వెళ్ళిపోతున్నా, ఎక్కకుండా చోద్యం చూస్తారు. రూపాయికే కాదు.క్షణానికి కూడా మారపు రేటు వుంటుంది. కేవలం వర్తమానంలో బతికే వాడికే ఆ రేటు పెరుగుతుంటుంది. మిగతా వాళ్ళకి దారుణంగా పడిపోతుంటుంది.
అనుకుని చూడు!
పిచ్చి కోరిక ఏదయినా సరే చచ్చేటంత భయపెడుతుంది. ఉత్తినే, కంటికి ఇంపుగా కనిపించే అమ్మాయి నీ పక్కన వుంటే బాగుంటుంది- అని అనిపించిందనుకో. గుండె అదురుతుంది. కాళ్ళు వణుకుతాయి. దు:ఖమే దు:ఖం. ఉత్తినే కాకుండా, నిజంగా అనుకుని చూడు. లేని తెగింపు వస్తుంది. ఆమె కోసం, ఏడు సముద్రాలు ఈదాలనిపిస్తుంది. అంతా అనుకోవటంలోనే వుంటుంది.
పగటి కల!
(భ్రమ కూడా వరమే. లేనిది వున్నట్లు, ఉన్నది లేనట్లు- ఈ కనికట్టు చాలు ఈ క్షణాన్ని దాటెయ్యటానికి. భ్రమ తేలిక పరుస్తుంది. తింటున్న పాప్ కార్న్ సాక్షిగా చూస్తున్నది సినిమా అని తెలుసు.. అయినా ఏమిటా కన్నీళ్ళు? భ్రమ. నీరు, నేలయినట్లూ, నేల నీరయినట్లూ.. అహో! ఏమిదీ..? మయుడి కల్పన. ఒక భ్రమ. పాంచాలిని పకపకా నవ్వించిన భ్రమ. ఏడిపించాలన్నే భ్రమే.నవ్వించాలన్నా భ్రమే. సుయోధనుణ్ణి కయ్యానికి కాలు దువ్వించాలన్నా భ్రమే. నా ప్రియురాలంటే నాకెందుకు అంత ఇష్టమో తెలుసా..? నాకు ఎప్పటికప్పుడు గుప్పెడు భ్రమనిచ్చి వెళ్ళిపోతుంది..)
అంతే దూరం!
(నీతులూ, విలువలూ, ప్రమాణాలు- మానవత్వం ముందు అల్పమయినవి. ఆకలిగొన్న వాడిముందూ , అవమానించబడ్డ వాడి ముందూ, గీతకారుడు కూడా చిన్నబోతాడు. భంగపడ్డ వాడి విశ్వరూపం అంత గొప్పది. మనిషినుంచి మనిషిని వేరు చేయటానికి స్మృతులూ, ధర్మాలూ అవసరం కానీ, మనిషిని పెట్టి మనిషిని గుణించటానికి ఒక్క మనసు చాలు. ఇలా అని అనుకుంటే చాలు… అలా జరిగిపోతుంది.)
Mismatch
మొలచిన కల
(ఏడ్చి ఏడ్చి ఊరుకున్న కళ్ళల్లోకి చూడండి. ఒక మెరుపు. ఒక ఆశ. ఒక ఇంధ్రధనువు. మాటా, మాటా అనుకున్న ప్రతీసారీ, ఈ అనుబంధం ఇలా ముగిసిపోతుందనే అనుకుంటాం. కానీ, మరుసటి రోజు ఇద్దరి కరస్పర్శతో ఓ కొత్త ఉదయం! అంత పెద్ద చెట్టు కూలి పోయిందనే భావిస్తాం. కానీ కాస్సేపు విత్తనం లో దాక్కొని విరాట పర్వానికి తీస్తుంది. చినుకు పడగానే విచ్చుకొని మెల్ల మెల్లగా విశ్వరూపం ధరిస్తుంది.)