Tag: yedyurappa

శత్రువే సంస్కర్త

శత్రువు మించిన గొప్ప సంస్కర్త ఉండడు. తెల్లని బియ్యంలో నల్లని రాళ్లను తీసినట్టు, ‘ఒప్పుల’

కుప్పలాంటి మన జీవితంలోంచి ‘తప్పుల’ను ఏరి ఇస్తాడు. ఈ పని మిత్రులవల్ల కాదు.
వ్యక్తి విషయంలోనే కాదు. సంస్థ విషయంలోనూ, ఒక పార్టీ విషయంలోనూ ఇదే నిజం.
ఏ రాజకీయ పార్టీ అయినా బాగుపడాలి అంటే, అది శత్రుపక్షం మీద ఆధారపడి ఉంటుంది. ఈ

మధ్యకాలంలో కొన్ని పార్టీలు అలా బాగుపడిపోతున్నాయి. ఒక పార్టీమీద శత్రుపక్షం ఇంత ప్రేమ

చూపిస్తుందంటే, నాటకం అనుకునే వాళ్లం. కానీ అది నాటకం కాదూ, ‘కర్ణాటకం’ అని

బోధపడిపోయింది.

యెడ్డి తగవుకు ‘షెట్టర్‌’ వేశారు!

‘కమలం’మీద ‘యెడ్డి’ పడ్డా, ‘యెడ్డి’ మీద కమలం పడ్డా, నలిగేది ‘కమలమే’. కర్ణాటకలో బీజేపీ నలిగి పోయింది. కారణం ‘బిఎస్‌’ యెడ్యూరప్ప.

ఇక్కడ యెడ్యూరప్పకూ, బీజేపీ మధ్య ఒక తగవు నడుస్తోంది. అది ‘చెట్టు ముందా? కాయ ముందా?’ లాంటి తగవు. ఈ తగవు మొదలయి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా తేల లేదు. 2008లో కర్ణాటకలో బీజేపి గెలిచింది. నమ్మడం కష్టం అయింది అందరికీ, బీజేపీ జాతీయ నేతలయితే ఒక సారి తమను తాము గిచ్చుకుని చూసుకున్నారు. నిజమే. కలకాదు. ‘గెలిచాం’ అనుకున్నారు.