‘పగటి వేషా’ద్‌!

sivaprasadపేరు :శివ ప్రసాద్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రిన్సిపాల్‌, ‘తెలుగు’ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా, ఎన్టీఆర్‌ట్రస్ట్‌, హైదరాబాద్‌

ముద్దు పేర్లు : ‘పగటి’ వేషాద్‌! ( పూటకో వేషం) ‘శైశవ’ ప్రసాద్‌ ( కొందరికి నేను చేసేవి పిల్ల చేష్టల్లా అని పించవచ్చు.)

విద్యార్హతలు : ‘వైద్యో నారాయణో హరీ’ అన్నారని డాక్టర్‌ చదివాను. ఇలా అని అంటే, కొందరేమన్నారో తెలుసా- ‘అన్నా, నీ వైద్యానికి నారాయణుడు కూడా- హరీ- అన్నాడా?’ అంటారు. పది మందిని చంపితేనే కానీ డాక్టరు కాలేడంటారు. కానీ నేను నమ్మను. ఆ మాట కొస్తే, ఒక్క డాక్టరేమిటి? యాక్టర్‌ కూడా అంతే. ఓ వందమందిని చంపితేనే కానీ, ఒక యాక్టరు కాలేడు. నన్ను చూడండి. పార్లమెంటు ముందు నా పగటి వేషం చూసినప్పుడెల్లా చచ్చి ఊరుకుంటున్నారు.

హోదాలు : ఎం.పి. అంటే ‘మెంబర్‌ ఆఫ్‌ పార్లమెంటు’ అని అనుకుంటున్నారా? పొరపాటు. ‘మాస్టర్‌ ఆఫ్‌ ప్లేస్‌’ (నాటకాల్లో మనల్ని మించిన వాడు లేడు కదా) అదీ కాక నేను ‘పార్లమెంటునే ఓ పెద్ద నటనాలయం’ లా భావిస్తాను.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఎప్పుడూ సొంత ముఖంతో వుండను. ( ఎందుకంటే ఎప్పుడు ఏ వేషం వెయ్యాల్సి వస్తుందో తెలియదు కదా!

రెండు: ప్రచారం వస్తుందంటే ప్రాణాలయినా ఇచ్చేస్తాను.

సిధ్ధాంతం : మా నేత( చంద్రబాబు) కి ‘రెండు కళ్ళ సిధ్ధాంతం’, ‘రెండు చిప్పల సిధ్ధాంతం’ వున్నట్లు, నాకు ‘రెండు పాత్రల’ సిధ్ధాంతం వుంది. (పాత్ర అంటే చిప్ప అని కూడా అర్థం వుండటం వల్ల, మా నేత ఆ అర్థం తీసుకుని, నన్ను ప్రోత్సహిస్తున్నాడు)

వృత్తి : రెండు వృత్తులు. ఒకటి: రాజకీయాల్లో నటించటం; రెండు: నటనలో జీవించటం.

హబీలు :1. ప్రజాసేవ. అవును. నేనే కాదు. చాలా మంది రాజకీయ నాయకులకు అది హాబీ. వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను వృత్తులుగా చేసుకుని, తీరిక దొరికినప్పుడెల్లా, తమతమ నియోజక వర్గాలక వెళ్తుంటారు. నేను చేసేది వ్యాపారం కాదు. కళాపోషణ. అదే నా వృత్తి.

2. అందరూ ఎన్నికలలో గెలవటం కోసం ప్రచారం చేస్తారు. నేను మాత్రం ప్రచారం చేసుకునే అవకాశం వుంటుందని పోటీ చేస్తాను. ( మనకి ‘కలాపోసన’ ముఖ్యం కదా!)

అనుభవం : రాజకీయాల్లో ‘ప్రతి పక్ష'(అపోజిషన్‌) పాత్ర వేసి మెప్పించటం, సినిమాల్లో ‘ప్రతి నాయక'(విలన్‌) పాత్ర వేసి మెప్పించటం కష్టమైన పని. మా నేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పాత్రను గత తొమ్మిదన్నరేళ్ళుగా పోషించి విజయవంత మయ్యారు. లేకుంటే ఒకే ఎన్టీఆర్‌ ట్రస్ట్‌లో ఇటు తెలంగాణ తమ్ముళ్ళూ, అటు సీమాంధ్ర తమ్ముళ్ళూ, బయిట ప్రదర్శించటానికి రెండు ‘స్క్రిప్టు’లూ ఏక కాలంలో సిధ్ధం చెయ్యగల సత్తా ఆయనకు మాత్రమే వుంది. నేను కూడా ఎన్నో పాత్రలు వేసాను కానీ, నాకు ‘ప్రతి నాయక’ పాత్రకే అవార్డు వచ్చింది.

మిత్రులు : నా నటనను మెచ్చి, నాకు ‘నట భయంకర’ , ‘నట బీభత్స’ అని బిరుదులిచ్చి ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులే.

శత్రువులు : ‘యాచక యాచకో శత్రు:’ అంటారు. నటుడుకి నటుడే శత్రువు. బంగి అనంతయ్య వున్నాడే.. రాజకీయాల్లో నాకు మంచి మిత్రుడే. కానీ ‘పగటి వేషాల్లో’ నాకు పోటీకి వస్తాడు. నేను ‘వితంతువు’ పాత్ర వేస్తే, అతడు ‘పుణ్యస్త్రీ’ పాత్ర వేస్తాడు. ఇది ధర్మమా? చెప్పండి.

మిత్రశత్రువులు : ఎంత కాదన్నా, నేనూ, మా అనంతయ్యా, ముఖానికి రంగు పూసుకుని, విగ్గులు పెట్టుకుని, చీరలు కట్టుకుని వేషాలు వేస్తాం. కానీ, వామ్మో! అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనూ సహజనటులు వున్నారు. వారు ఇవేమీ లేకుండా, నవరసపోషణ చేసేస్తారు. వారే మా మిత్ర శత్రువులు.

వేదాంతం : రాజకీయమన్నది పౌరాణిక నాటక రంగం వంటిది. ఒకటో కృష్ణుడు పోతే, రెండో కృష్ణుడు వస్తాడు. అంటే, బక్క కృష్ణుడు పోతే, పొట్ట కృష్ణుడు వస్తాడు. నాటకం ఆగదు.

జీవిత ధ్యేయం : ఎప్పటికయినా నేను ‘సీమాంధ్ర ముఖ్యమంత్రి పాత్ర వేయాలన్నది ‘ ధ్యేయం. ( సారీ, పొరపాటున అనేశాను. నేను సమైక్యాంధ్ర వాదిని కదా! )

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 20-6ఢిశంబరు 2013 వ తేదీ సంచికలోప్రచురితం)

3 comments for “‘పగటి వేషా’ద్‌!

  1. శివప్రసాద్ వేషాలను మంచి నాటకీయంగా రక్తి కట్టించారు సార్..

Leave a Reply