బాబా! బాబా! బ్లాక్‌ షీప్‌!!

ఎదగ వచ్చు.

ఎవ్వరు ఎలాగయినా ఎదగ వచ్చు. నిలువుగా ఎదగవచ్చు. అడ్డంగా ఎదగవచ్చు.

లేదూ ముందు అడ్డంగా ఎదిగి, తర్వాత నిలువుగా ఎదగ వచ్చు.

ఎదగటం- ముఖ్యమనుకుంటే చాలు.

పదోతరగతి తప్పిన కుర్రాడు బస్సెక్కుతాడు. అతని కళ్ళ ముందే ఒక పెద్దాయన తన స్టాపులో గబగబా దిగిపోతుంటాడు. పర్సుజారి కుర్రాడి కాళ్ళ మీద పడుతుంది. తీసి కళ్ళకద్దు కుంటాడు. ‘తిరిగి పెద్దాయనకు ఇచ్చే వాణ్ణే కానీ, దిగి వెళ్ళిపోయాడు కదా!’ తనకు తాను సంజాయిషీ ఇచ్చుకుంటాడు. పర్సులో వెయ్యి. తర్వాత ఇలాగే బస్సు ఎక్కుతుంటాడు. ఎవరూ అతని కోసం పర్సు పారేసుకోరు. ఈ సారి తనే ఎవరి పర్సో కొడతాడు. పని తేలికయి పోయింది. తర్వాత కొంపలు కొడతాడు. అలా దొంగ పర్మిట్లూ, దొంగ కాంట్రాక్టులూ కొట్టి శత కోటీశ్వరుడయి పోతాడు. ఇంత వరకూ ఎదిగింది నిలువుగా.

ఇప్పుడు అతను నిలువు ఎదగవచ్చు. ఒక అనాథ ఆశ్రమమో, వృధ్దాశ్రమమో పెట్టవచ్చు. సేవాతత్పరుడని మీడియా కొనియాడుతుంది. పైసలున్న సేవాతత్పరుడంటే, పార్టీలు అసెంబ్లీ సీటుకో, పార్లమెంటు సీటుకో టిక్కెట్లు ఇచ్చేస్తాయి. ఇలా కూడా పార్లమెంటుకో, అసెంబ్లీకో వెళ్ళ వచ్చు.

ఇలా కాకుండా. దివా రాత్రులూ కష్టపడి చదివి, అన్నింటా టాపర్‌ అవుతూ, ఆ తర్వాత డాక్టరయి, అదీ చాలక, సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసి, ఐయ్యేఎస్‌ అయి, కలెక్టరయి తర్వాత రాజీనామా చేసి, ప్రజలు ముందుకొచ్చి ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో ఎన్నిక కావచ్చు.

ఆది నుంచి అడ్డదారిలో ప్రయాణించి, చివరి దశలో నిలువుదారికి వచ్చిన వ్యక్తీ, ఇక్కడికే వచ్చాడు. ముందు నుంచీ చివరి వరకూ నిలువుదారిలో ప్రయాణించిన వారూ ఇక్కడి కే వస్తారు.

ఇప్పుడు ఏం చెబుతాం? చట్ట సభల్లో మొత్తం దొంగలే వున్నారంటమా? లేక నిజాయితీ పరులు కూడా వున్నారంటామా?

డిగ్రీ చదివి కూడా భర్త సేవలో తరించే ఇల్లాలు వుంటుంది. ముందు ఇంటిల్లిపాదికీ వంట చేస్తుంది. ఇంటాయన ఎమ్మెల్యే అవుతాడు. ఇంటికొచ్చే కాంట్రాక్టర్ల దగ్గరనుంచి ఆఫీసర్ల వరకూ దగ్గరుండి వంట చేయిస్తుంది. ఇంత మందిని మేపాక ఎమ్మెల్యే మంత్రి కాకుండా వుంటాడా? అయినా ఆవిడ పాత్ర మారదు.

సాయింత్రం పూట, ఏదో మురిపెంలో వున్నప్పుడు ‘నిన్ను కూడా ఎమ్మెల్యేను చేస్తాను లేవే?’ అంటాడాయన.

‘మీరుండగా నా కంత భాగ్యం కూడానా?’ అని అంతే గోముగా అంటుందావిడ, ఆయన పాదాలు వొత్తుతూ.

ఆవిడ మాట ఫలించో, లేక ప్రమాదం సంభవించో ఆయన పుటుక్కుమంటాడు. దాంతో ఆవిడకు సీటువస్తుంది.

ఇన్నాళ్ళూ ఆవిడ ముఖం కార్యకర్తలకు కూడా తెలీదు. అప్పటి వరకూ వండి, వార్చిందే తప్ప, వడ్డించి ఎరుగదు. కాబట్టి ఆవిణ్ని చూసే అవకాశమే లేదు. అయినా టిక్కెట్టిస్తారు. చట్ట సభకొస్తుంది.

అలా కాకుండా, చదువుకున్న రోజుల్లోనే విద్యార్థి సంఘంలో పనిచేసి, అక్షరాస్యతా ఉద్యమం పేరిట పల్లెటూళ్ళ కెళ్ళి అక్కడి ఆడవాళ్ళకి చదువు చెప్పి, సారా వ్యతిరేక ఉద్యమంలో సారాషాపుల మీద దాడులు చేసి, అరెస్టు అయి, సర్వ స్వతంత్రంగా ఎదిగి, తనకు నచ్చిన విద్యావంతుణ్ణి పెళ్ళాడి, ఎన్నికలలో పోటీ చేసి, గెలిచి చట్టసభకొచ్చి కూర్చుంటుంది.

ఇప్పుడు ఏమంటాం? చట్టసభల్లో మహిళలంతా రాజకీయవితంతువులే అంటామా? లేక స్వతంత్ర మహిళలు కూడా ఉన్నారంటామా?

కానీ, కొందరికి పంట చేనును చూపిస్తే, అందులో కలుపు మొక్కలే కనిపిస్తాయి. దాంతో పంటను మొత్తం తగలేస్తానంటారు.

ప్రజాస్వామ్యంలో అవినీతి వుందని, మొత్తం ప్రజాస్వామ్యాన్నే తగలెయ్యటానికి యోధులు పుట్టుకొచ్చేశారు. వారిలో ఒకరు మన పార్లమెంటులో వున్నవారు హంతకులూ, రేపిస్టులే- అన్నారు.

దీంతో ఒక మహిళా ఎం.పి ఒక జాతీయ చానెల్లో, ‘నేనూ ఎం.పీనే? నేనెలా రేప్‌ చెయ్యగలనా? మీరే చెప్పండి’ అన్నారు.

ఈలోగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన ఒక బాబా ఇవే చట్టసభల్లో వున్నదంతా ‘దొంగలూ, హంతకులే’ అంటూ ఇంకో అభాండం వేశారు.

ఆ లెక్కన చూస్తే బాబాలంతా, ముక్తిని ప్రసాదించే బాబాలేనా?

సరసన స్త్రీ మూర్తులను పెట్టుకుని నిత్యానంద-భరితమైన రక్తిని అందించే బాబాలు లేరా?

అలాగని ‘బాబా, బాబా,’ బ్లాక్‌ షీప్‌- అని అందరి మీద ఒకే ముద్ర వేస్తే ఎలా వుంటుంది?

ఆ మధ్య రాష్ట్రంలో ఒక పార్టీ నేత, శాసన సభలో తన పార్టీ సభ్యులూ వున్నారని తెలిసి, అసెంబ్లీలు ‘…. దొడ్లు’ అని అనేశారు.

ప్రజాస్వామ్యాన్ని ఆకస్మికంగా బాగుచేసేయ్యటానికి, మన అవినీతి వ్యతిరేక యోధులకు ‘లోక్‌పాల్‌’ అనే ఒక గొప్ప ఔషధాన్ని కనుగొన్నారు.

ఈ మందు పట్టుకుని- ‘వైద్యో నారాయణో హరీ’ – అని అన్నారు తెలుసా? అని తిరుగుతున్నారు.

‘అంటే తమరి వైద్యానికి నారాయణుడు కూడా హరీ- అంటాడాండీ?’ అని మనం ఏదో నాటకం లో అడిగినట్టు అడగాల్సి వుంటుంది.

వీరు పార్లమెంట్లనూ, అసెంబ్లీలనూ తుడిచిపెట్టేసి- ‘అవినీతి పోయిందొహో’ అని ఊరేగే లా వున్నారు. అలా చేస్తే అవినీతి నిజంగానే పోతుంది. కానీ, దానికన్నా ముందు ప్రజాస్వామ్యం పోతుంది!!

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రికలో 5-5-12 నాడు వెలువడింది)

Leave a Reply