లైంగికోగ్రవాదులు!

gangrape-accused-sl-2-2-201అత్యాచారాలు జరిగినప్పుడెల్లా అల్లర్లు జరగవు

అల్లర్లూ, ఆందోళనలు జరిగినప్పుడు- అందరూ బెంగపడిపోతారు. సర్కారూ, పోలీసులూ మాత్రం భంగపడిపోతాయి.

ఈ బెంగపడ్డ వారిలో పెద్దలూ, పిన్నలూ, ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అందరూ వుంటారు. ఇలా మళ్ళీ మళ్ళీ జరగకుండా వుండటానికి ఏమి చెయ్యాలీ- అన్నప్పుడు ఎవరికి తోచిన సలహాలూ, సూచనలూ వారిస్తారు. ఢిల్లీ బస్సులో కిరాతకంగా జరిగిన అత్యాచారం తర్వాత ఈ సూచనలకు మరింత విలువ పెరిగింది. ఈ సూచనల్ని సూక్ష్మీకరిస్తే రెండు రకాలు తేలతాయి:నివారణ, చర్య.

ఈ నివారణోపాయాల్నే ‘సూక్తిముక్తావళి’ గా ఆడపిల్లలకు చెబుతూ వుంటారు. వీటిలో కూడా శ్రుతులుంటాయి:

ఆలస్యంగా ఇంటికి రావద్దు. ఒంటరిగా బయిటకు పోవద్దు. ఇవి మంద్ర స్థాయిలో నొప్పించకుండా చెప్పే పధ్ధతి.

ఆడపిల్లలకు ఆర్థరాత్రులు బయిటపనులేముంటాయి? ఎవరు తిరగమన్నారు? మనుషులు లేని బస్సులు ఎవరు ఎక్కమన్నారు? (ఈ వ్యాఖ్యనే ‘రైమింగ్‌’ బాగుంది కదా-అని ‘అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చిందని, ఆడపిల్లలు అర్థరాత్రి తిరగాలా?’ అని ‘పంచ్‌’ జోడించి మరీ చెప్పారు మన పీసీసీ నేత బొత్స సత్యనారాయణ. తర్వాత ఆయనకే ‘పంచ్‌’ల మీద ‘పంచ్‌లు పడ్డాక సారీ చెప్పారనుకోండి. అది వేరే విషయం.) ఇది మధ్యమ స్థాయి.

అయినా ఆడపిల్లలు ఈ మధ్య బరితెగించేశారు. బొత్తిగా ఇళ్ళల్లో ఇవ్వాల్సిన వారికి క్రమ శిక్షణ లోపించింది. వాళ్ళు వేసుకుంటున్న డ్రస్సులు చూశారా? సాటి ఆడవాళ్ళకే సిగ్గు వేసేలా వుంటోంది. పైగా పబ్బులూ, క్లబ్బులూ, షికార్లూనా? ఇలాంటి రేప్‌లు జరగమంటే జరగవా?. ఇది తీవ్రస్థాయి.

ఇక ఇలాంటి అత్యాచారాలు జరిగినప్పుడు శిక్షలు ఎలా వుండాలి అన్నప్పుడు, దాదాపు అందరూ తీవ్ర స్థాయిలోనే తీవ్రమైన శిక్షల్ని ప్రతిపాదిస్తారు: ఉరితీయాలి. హ!హ! కాదు. కాదు. ఉరితీస్తే ఒకే సారి చస్తాడు. ఒకరోజు కాలూ, ఒక రోజు చెయ్యీ- ఇలా రోజుకో పార్టు తీయాలి. ఇవి అన్నీ కాదు. ‘కేస్ట్రేషన్‌’ చెయ్యాలి.( అంటే ఆబోతును ఎద్దుగా మార్చటం. వృషణాలు తీయటం.)

సర్కారు విన్నట్టే నటిస్తుంది. ఏవో కంటి తుడుపు నిర్ణయాలు చేస్తుంది. బిల్లులు కదుపుతుంది. వీలయితే చట్టాలు కూడా చేస్తుంది. అలా చేసిన ప్రతీ చట్టమూ ‘వరకట్న నిషేధ చట్టం’ లాగా చిత్తుకాగితంలాగా మిగిలిపోతుంది. మళ్లీ మామూలే దేశం ‘అత్యాచార సంప్రదాయాల’ను పాటిస్తూనే వుంటుంది.

ఘోర ఘటన జరిగినప్పుడు మనకు కలిగిన భయాన్ని పోగొట్టుకోవటానికీ, ఆవేశాన్ని చల్లార్చుకోవటానికీ ఈ తక్షణ నివారణోపాయాల్నీ, శిక్షల్నీ ప్రతిపాదిస్తుంటాం.

మనవాళ్ళు ఇస్తున్న ‘మూడు స్థాయిల’ సూచనల్నీ చూద్దాం. రాజ్యాంగం పురుషులకు పగళ్ళనీ రాత్రుళ్ళనీ రాసిచ్చి, స్త్రీలకు కేవలం పగళ్ళనే ఇచ్చిందా? ఇప్పుడు నిండుగా కప్పుకోండి- అని చెప్పటానికీ, ఒకప్పుడు పరదాలూ, బురఖాలూ, ముసుగులు వేసుకోండని చెప్పటానికీ పెద్దగా తేడా ఏమిటో? అలా అయితే మూడేళ్ళ పసిపాపల మీదా, వృద్ధురాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి వాటినేమనాలి? నిజమే ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం వుంది, జాగ్రత్తగా వుండండీ- అంటే ఓ నాలుగు రోజుల పాటు రద్దీ ప్రాంతాలకు పోకుండా వుంటాం. కానీ అత్యాచారాలు చేసే ‘లైంగికోగ్రవాదులు’ ఫలానా అప్పుడు ఫలానా చోట, ఫలానా వేళలో అత్యాచారాలు చేస్తారని నిఘా వర్గాలు ముందుగా వెల్లడిస్తాయా? మన దేశంలోనే సగటున మూడు నిమిషాలకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ, ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యంగా వుంటుంది. 2011 లో దేశవ్యాపితంగా నమోదయిన 24,000అత్యాచారాల్లో , 22,500 అత్యాచారాలు పీడితురాలికి తెలిసిన వాళ్ళూ, బంధువులూ, మిత్రులూ చేసినవే. అత్యాచారాల్లో కేసుల వరకే వచ్చేవి అయిదు శాతం వరకూ లేవు. అంతే కాదు. ఒక జాతీయ దిన పత్రిక నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి పది మంది ఆడపిల్లలో ఏడుగురు మాటల ద్వారా కానీ, చేతల ద్వారా లైంగిక హింసకు గురయిన వారే. నలుగురయితే భౌతిక లైంగిక హింస(ఇందులో అత్యాచారమూ భాగమే) కు గురయిన వారున్నారు. ఇప్పుడు ఆలోచిద్దాం. నిజంగా వీరంతా బయిటకొచ్చి కేసులు పెడితే, ఉరి శిక్షను వీటికి వర్తింప చేస్తే, మన బంధుమిత్రుల్లో ఎంత మందిని ఉరితీయాలి. పురుషుడికి తన దేహం మీద తనకు హక్కు వున్నట్టే, స్త్రీకీ వుంది. తన దేహాన్ని అమె సమ్మతితో ఎవరు దురాక్రమించినా అది దుశ్చర్యే. కడకు భర్తయినా సరే. ఆమె దేహం మీద ఆమెకున్న హక్కును గౌరవిద్దాం. మృగాలు మారకుండా వుండేందుకు ఈ ‘సూక్తి ముక్తావళి’ని పుత్రరత్నాలకీ, పతి దేవుళ్ళకీ, మగ బంధువులకీ బోధిద్దాం.

-సతీష్ చందర్ 

(గ్రేట్  ఆంధ్ర వారపత్రిక 28డిశంబరు 2012- 2జనవరి2012 సంచిక కోసం రాసినది)

1 comment for “లైంగికోగ్రవాదులు!

  1. తన దేహాన్ని అమె సమ్మతితో ఎవరు దురాక్రమించినా అది దుశ్చర్యే.

Leave a Reply