ఉద్యమం ప్రయివేట్‌ లిమిటెడ్‌!

ఉపఎన్నిక పెట్టి చూడు, ఉద్యమం చేసి చూడు- అన్నారు. ఎవరూ? ‘ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు’ అన్న పెద్దలే. చేతులు కాల్చుకున్నాక కానీ, పిన్నలు, పెద్దలు కాలేరు లెండి.
ఎన్నిక వేరు. ఉప ఎన్నిక వేరు. రెంటి మధ్యా, ఇల్లుకీ, చిన్నిల్లుకీ వున్నంత తేడా వుంటుంది. నార చీర పెట్టినా మురిసి పోతుంది ఇంటావిడ. పట్టు చీర పెట్టేవరకూ ప్రాణం తీస్తుంది చిన్నింటావిడ. ఎన్నికప్పుడు వోటరు వంద నోటు చూసి ఒప్పేసుకుంటాడు. ఉప ఎన్నిక వోటరు మాత్రం- కనీసం వెయ్యి నోటు కళ్ళ చూడాలంటాడు.
ఇక ఉద్యమం అంటారా? ఉప ఎన్నిక కన్నా ‘ప్రియమైనది’. అసలు ఉద్యమం అంటే ఏమిటి?(కాస్సేపు పిడికిళ్ళు బిగపడతారా?ఎఫెక్టు కోసం!) ఉద్యమానికి త్యాగమే ఊపిరి. ఎందర త్యాగ’ధనుల’ పుణ్యమే ఒక ఉద్యమం.( చాల్లెండి. పిడికిళ్ళు సడలించండి.)
ఇవాళ-త్యాగం ప్రియాతి ప్రియమైనది. భోగం కన్నా ఖరీదయినది. ఉదాహరణకి తిండి ఖర్చు కన్నా, ఉపవాసం ఖర్చు ఎప్పుడూ ఎక్కువే. దీన్నే ఉద్యమ పరిభాషలో నిరాహార దీక్ష- అంటారు.
ఒక సాదాసీదా రాజకీయ నేత రోజుకు ఎంత తింటాడు?( అపార్థం చేసుకోకండి. మామూలు తిండి గురించే మాట్లాడుతున్నాను.) పొద్దున్నే మూడు వందల రూపాయిల టిఫిన్‌, మధ్యాహ్నం అయదు వందల రూపాయిల భోజనం, సాయింత్రం వెయ్యి రూపాయిల డిన్నర్‌( మందూ, మాకు కలుపుకుని.) వెరసి పద్దెనిమిది వందల రూపాయిలు.
ఇదే నేత ఒక రోజు నిరాహర దీక్ష చేస్తే..?
కిలోమీటరు లెక్క షామియానాలు; కింద కార్పెట్లు, ఒక పెద్ద బల్లల ప్లాట్‌ ఫారం; దాని మీద పాతిక పరుపులు;
ఎక్కడి కక్కడ మైకులూ, ముందస్తు పోస్టర్లు, హోర్డింగులూ, పూల దండలూ, కుడిఎడమల మద్దతుగా తిండి మానేసి కూర్చోనే వారికి వచ్చేటప్పుడు కారు ఖర్చులూ, వెళ్ళేటప్పుడు మందు ఖర్చులూ, ఎదతెరిపి లేకుండా పరామర్శకు వచ్చే జనప్రవాహానికి లారీలూ, తలవొక్క బీరూ, బిర్యానీలూ, ఆనక దీక్ష భగ్నం చెయించుకోవటానికి మధ్యవర్తుల ఏర్పాట్లు ఖర్చులూ, ఛానెళ్ళలో చెల్లింపు ‘లైవూ’, పత్రికల్లో ‘పెయిడ్‌ న్యూసూ’, అరెస్టు అయ్యేటప్పుడు పోలీసులు ఎత్తి కుదేయకుండా, సుకుమారంగా వ్యాన్‌ ఎక్కించటానికీ అయ్యే ముడుపులూ- వెరసి పది, పదిహేను లక్షల పైమాటే.
చూశారా! ఒక్క రోజు తిండి త్యాగానికి ఎంత ఖర్చో!
అయినా సరే! కొందరు త్యాగ’ధనులు’ ఈ ఖర్చుకు వెరవరు. ఈ నిరాహార దీక్షను రోజుల పాటు కొనసాగిస్తారు. అవసరమయితే అరెస్టయి ఆసుపత్రికి వెళ్ళి కూడా తిండిమానేస్తారు. అప్పుడు ఆయనకు అవసరమయ్యే గ్లూకోజ్‌, ప్రోటీన్లు, విటమిన్లు- అన్నీ నోటినుంచి కాకుండా నరాల నుంచి పంపించాల్సి వుంటుంది. అది ఇంకా ఖర్చు. పైపెచ్చు. ఆయనకు మద్దతుగా బయిట ఆందోళనల్నీ, అల్లర్లనీ నిర్వహించటానికీ, చైతన్యాన్ని రగలించటానికీ, బస్సుల్ని దగ్ధం చెయ్యటానికీ, ఎంత ఖర్చు! ఖర్చు! ఆవేశం ఎంత కట్టలు తెగితే మాత్రం, యువకులు ఏ స్థితిలో రోడ్లెక్కుతారు? ఖాళీ చేతుల్తోనూ, ఖాళీ జేబుల్తోనే కదా? చేతుల్ని కర్రలతోనూ, జేబుల్ని చిల్లరతోనూ నింపాల్సిందే కదా! అప్పుడు ఖర్చు లక్షల నుంచి కోట్లకు చేరుతుంది.
ఏ లెక్కన చూసినా ఉద్యమం అంటే పెళ్ళిలాంటిదే… కాకుంటే కార్పోరేట్‌ పెళ్ళి లాంటిది.
ఉద్యమం అంటే కేవలం నిరాహార దీక్షలేనా? అనేక ఉద్యమ రూపాలున్నాయి. యాత్రలున్నాయి: అంటే పాదయాత్రలూ, సైకిల్‌ యాత్రలూ, రథయాత్రలూ, ఆటో యాత్రలూ, అంకిత యాత్రలూ, అంతిమయాత్రలూ, ఏడిపించే యాత్రలూ, ఊరడించే యాత్రలూ…!
ఏ యాత్ర బడ్జెట్‌ ఆ యాత్రకుంటుంది.
ఏ వాహనమూ లేకుండా నడిచి వెళ్ళితే ఖర్చు తక్కువ అనుకుంటాం కదా! కానీ అనుభవజ్ఞులు లెక్కలు తీసిందేమిటంటే, అన్ని యాత్రల ఖర్చు కన్నా, పాద యాత్రల ఖర్చు మరీ ఎక్కువ.
నేత రోడ్డు మీదే స్నాన పానాలు చెయ్యాలంటే… చిన్న విషయమా? నీళ్ళాడేది ఆయనొక్కడే కావచ్చు. చూడ్డానికి వచ్చేవారెంత మంది? నడిచేది ఆయనొక్కడే! కానీ ఆయన చూడ్డానికి వచ్చేవాళ్ళు లారీల్లోనూ, బస్సుల్లోనూ రావాలి. ట్రాఫిక్‌ దిగ్బంధనాలు చెయ్యాలి. దాదాపు తిరునాళ్ళు నిర్వహించినట్టే.
యాత్ర నిర్వహించే ఖర్చు కన్నా , యాత్రను అడ్డుకునే ఎదురు ఉద్యమానికి మరీ ఖర్చు ఎక్కువ.
ఆందోళన కారులకు మందు, ప్రయాణం ఖర్చులతో పాటు కొన్ని ‘ఎగ్‌’స్ట్రా ఖర్చులు కూడా వుంటాయి. అవేనండి ‘గుడ్డు'(ఎగ్‌) ఖర్చులు! యాత్రను అడ్డుకోవాలంటే కొన్ని వేల గుడ్లను విసరాలి. ఇది ‘సోడాబుడ్లు’ విసిరినంత సులువు కాదు. ఇందుకు ‘ఫ్యాక్షన్‌’ అనుభవం ఒక్కటే సరిపోదు. కొంత ‘యాక్షన్‌’ అనుభవం కూడా వుండాలి. ఇందుకు శిక్షణ ఖర్చులు కూడా ఉంటాయి.
పూర్వం వాళ్ళు అమాయకులు. బలమైన కారణం వుంటేనే కాని ఉద్యమాలు చేసేవారు కారు.
కానీ ఇప్పటి ఉద్యమాలకు కారణం ముఖ్యం కాదు. పెట్టుబడి కీలకం. పెట్టుబడి వుంటే ఏ వ్యాపారమయినా ఎలా చెయ్యవచ్చో, ఏ ఉద్యమమయినా అలాగే చెయ్యవచ్చు.
ఇప్పుడు మీ చేతుల్లో పైసలు వున్నాయనుకుందాం. ఒకానొక ఉద్యమం చెయ్యాలనుకుంటారు.
ఐడియా కోసం సాయింత్రం పూట ట్యాంక్‌ బండ్‌ మీద తిరుగుతూ హుస్సేన్‌ సాగర్‌ సుగంధపరిమళాలను ఆఘ్రాణిస్తారు.
వెంటనే మెరుపు లాంటి ఆలోచన!
హుస్సేన్‌ సాగర్‌ను పూడ్చేస్తే..!? అవును. ఇందుకు ఓ ఉద్యమం. ‘పూడిక వాదులారా! ఏకం కండి’ అప్పుడే నినాదం వచ్చేసింది. ‘ పూడ్చేసిన ఈ స్థలంలో, వీధి బాలలకు విద్యాలయాలు నిర్మిద్దాం’ లక్ష్యం కూడా నెరవేరింది.
మీరు నిజంగా ఈ ఉద్యమం మొదలు పెట్టారనుకోండి. వెంటనే డబ్బులున్న మరో మహారాజు మరో ఐడియా తో వస్తాడు.
‘హుస్సేన్‌ సాగర్‌ను రక్షించాలి’. ‘పరిరక్షణ వాదులారా! ఏకం కండి’. ఈ పరిమళాలు వెదజల్లే ‘హుసేన్‌ సాగర్‌ అభివృధ్ధిలో మా వాటా కూడా వుంది. మేము ఎన్ని వ్యర్థాలను వదలిపెడితే, ఇంతటి సుగంధం వస్తోంది?’ అనే రీజనింగ్‌ కూడా తీస్తారు.
ఇంకా చూస్తారే..! ఉద్యమించండి.!!

– సతీష్‌ చందర్‌
27-5-11

Leave a Reply