ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌!

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : జానా రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ప్రొటెం ముఖ్యమంత్రి ( ఈ పోస్టు ఉండదని నాకూ తెలుసు. కానీ ఉంటే బాగుండునన్నది నా ఆకాంక్ష. ప్రొటెం స్పీకర్‌- అనే పదవి ఉన్నది కాబట్టే కదా, కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయినా తెలంగాణ శాసన సభ్యుల చేత ప్రమాణం స్వీకారం చేయించేందుకు ప్రొటెం స్పీకర్‌గా ఎంపికయ్యాను చూశారా?)

ముద్దు పేర్లు : ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ (ప్రొటెం స్పీకర్‌ పదవి ఒక్కరోజు తోనే ముగుస్తుంది.)

‘విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ మిస్‌అండర్‌స్టాండింగ్‌(మనం ఒకటి మాట్లాడితే, జనానికి ఇంకోలా అర్థమవుతుంది. నేను హోం మంత్రిగా వున్నప్పుడుకూడా నా వ్యాఖ్యానాలు అర్థం కాక పోవటం వల్లనే నక్సలైట్లు నన్ను టార్గెట్‌ చెయ్యలేదు.)

హోదాలు : ఆరు సార్లు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాను. ఇంతకు మించి హోదా ఏమిటి చెప్పండి. ఈ ‘ఆరు’ సంఖ్యే నన్ను తెలంగాణ ప్రొటెం స్పీకర్‌గా చేసింది. ( కేసీఆర్‌ కు లక్కీ నంబరు ‘ఆరు’ కదా)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను మాట్లాడినప్పుడు మత బోధకుడిలాగా కనిపిస్తాను.

రెండు: నేను మౌనంగా వుంటే వైద్యుడిలాగా వుంటాను. ( ఈ రెండూ చెయ్యకుండా వుంటేనే రాజకీయ నేతలాగా వుంటాను. చిత్రం. ఈ రెండూ చేయనందుకే ప్రజలు నన్ను ఎన్నుకుంటూ వచ్చారు.)

సిధ్ధాంతం : ప్రతీ నేతా ముందు తనకు తానుగా గెలిచి చూపాలి. తర్వాత పార్టీని గెలిపించాలి.(మొదటి పని చేయటంతోనే నాకు టైం సరిపోయింది. రెండో పనికి సమయం చిక్కలేదు. (పైపెచ్చు అలాంటి బాధ్యత కూడా పార్టీ నా పై పెట్ట లేదు.) పైపెచ్చు, ఉత్తమకుమార్‌ రెడ్డికి ప్రచార బాధ్యతలు కాంగ్రెస్‌ అప్పగించింది. ఆయనది నా సిధ్ధాంతమే. తెలంగాణలో పార్టీని గెలిపించకపోయినా, తన్ను తాను గెలిపించుకున్నారు; తన సతీమణి పద్మావతి గారిని కూడా గెలిపించుకున్నారు. కాబట్టి ఆయనదీ, నాదీ ఒక్కటే సిధ్ధాంతం.

వృత్తి : రాజకీయమే ఉద్యోగం. అందుకనే తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఓ ఉద్యోగంలాగా చేశాను. ఎవరి ఉద్యోగం వారు చేసినప్పుడు దానికి ప్రచారం ఎందుకు? అందుకే ప్రచారాన్ని నిర్లక్ష్యం చేశాం. ఫలితంగా తెలంగాణ ‘ఇచ్చినో’ళ్ళను కాకుండా, తెలంగాణ ‘తెచ్చినో’ళ్ళను జనం గుర్తు పెట్టుకున్నారు.

హబీలు :1.తెలుగు భాషాభివృధ్ధికి తోడ్పడటం. నా భాషా కౌశలాన్ని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్‌రెడ్డి కూడా గుర్తించాడు. ఒక దశలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజకీయం గురించి ఆయన అభివర్ణిస్తూ- అది ఎలాగుందంటే- కె.కేశవరావు (అప్పట్లో ఆయన కాంగ్రెస్‌లోనే వున్నారు లెండి.) ఇంగ్లీషులో మాట్లాడితే, దానికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడితే, ఆ మాటలకు నేను వ్యాఖ్యానం చెప్పినట్లుంటుందీ- అని అన్నారు. ఇలాంటి ప్రశంసలు నా కెన్నో.

2. ముఖ్యమంత్రి హోదాకు సరిపడే దుస్తులలో కనిపించటం.( కొంతమందికి ఇది నచ్చక పోవచ్చు. ఏం చెప్పను. నా విగ్రహం అలాంటిది. అందుకు తగ్గ ఆహార్యాన్ని ధరిస్తే, ముఖ్యమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నాను- అనే వారు. ఇప్పుడు మా పార్టీకి పూర్తి ప్రతిపక్ష హోదా దక్కించుకోవటమే కష్టంగా వుంది. అందుచేత నాపై ఈ విమర్శలు కూడా తగ్గాయి.)

అనుభవం : ‘తెలుగుదేశం’ తో రాజకీయాల్లోకి వచ్చాను; ఆ పార్టీ అధినేతతో విభేదించాను; సొంతంగా పార్టీ పెట్టాను; కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ( కేసీఆర్‌ కూడా దాదాపు నేను చేసినవన్నీ చేశారు, చివరి పని తప్ప. ఆ కారణం వల్ల కూడా ఆయనకు నా మీద అభిమానం పోయి వుండక పోవచ్చు.)

మిత్రులు : మీడియా వారే. నేను అర్థం కానట్టు మాట్లాడతానా.. వాళ్ళు నన్ను మించిన వాళ్ళు: తమ కర్థమయినది తాము రాసుకుంటారు.

శత్రువులు :మీకు తెలియదా? నేను ఈ విషయంలో ధర్మరాజు అంతటోణ్ణి. ఆయనలాగే నేను కూడా అజాతశత్రువుని. నాకు శత్రువులంటూ ఎవరూ వుండరు. ధర్మరాజుకీ నాకూ ఒక్కటే తేడా. ఆయన సత్యం చెబుతాడు, అది అందరికీ అర్థమవుతుంది. నేనూ సత్యమే చెబుతాను. ముక్క అర్థం కాదు. ఇక మన మీద ఎవరు పగపడతారు చెప్పండి.

మిత్రశత్రువులు : శత్రువులే లేనప్పుడు, మిత్ర శత్రువులెలావుంటారు?

వేదాంతం :పదవి పదవే. ఒక్క రోజు చేసినా, అయిదేళ్ళు చేసినా. (ప్రొటెం స్పీకర్‌గా నేను పొందిన అనుభూతి అది.)

జీవిత ధ్యేయం : కనీసం ఒక్కరోజయినా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని.

-సతీష్  చందర్

(గ్రేట్ ఆంద్ర వారపత్రిక 14-21 జూన్ 2014 సంచికలో ప్రచురితం)

Leave a Reply