గాంధీ భవన్‌లో ‘ప్రజారాజ్యం’?

2014. ఇది ఒక అంకె కాదు. ఒక గురి. చేప కన్ను. మన రాష్ట్రంలో నే కాదు, కేంద్రంలో కూడా అందరి లక్ష్యం 2014.

ఈ ‘విజన్‌ 2014’ను సాకారం చేసుకోవటానికి ఎవరి కసరత్తు వారు చేస్తున్నారు. అన్ని పార్టీల కన్నా, అధికారంలో వున్న కాంగ్రెస్‌ ఎక్కువ హడావిడి చేస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ని ప్రధానిని చెయ్యాలి. అందుకు తగ్గట్టుగా పెద్ద రాష్ట్రాలన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ పార్లమెంటు సీట్లను కొట్టేయాలి. రాష్ట్రంలో మరో మారు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇదే ‘సోని(యా) విజన్‌ 2014.

ఇందుకోసం ఎవరినయినా కుర్చీలనుంచి దించగలరు. కుర్చీలు ఎక్కించగలరు. ఇందులో రాగద్వేషాలేమీ వుండవు- లాభనష్టాలే తప్ప. పైకి ‘మ్యూజికల్‌ చైర్స్‌’ ఆటలాగే కనిపిస్తుంది. కానీ పరమ కిరాతకమయిన క్రీడ. పరమ విధేయుడి పీక తెగి పడవచ్చు. లేదా కత్తుల దూసిన వాడికి ఆసనం వేయవచ్చు. ఈ ఆట మొదలయింది.

ఢిల్లీలో ఈ క్రీడ మొదలయింది. ఎవరి మీద వేటు పడుతుంది? ఎవరికి చోటు దొరుకుతుంది? ఈ ఆటకు కూడా అంతే క్రూరమయిన నేపథ్యం వుంది. అటు చూస్తే ‘కోల్‌’ గేట్‌. ఇటు చూస్తే ‘వాన్‌ పిక్‌’.’కాగ్‌’ తీసిన బొగ్గు కుంభకోణంలో ప్రధాని కార్యాలయమే మసి బారింది. రాష్ట్రంలో ‘సిబిఐ వేసిన గేలం ముల్లుకు మంత్రి వర్గంలో ‘రెండో చేప’ గుచ్చుకుని గిలగిల లాడుతోంది. ఇవీ ‘ఇద్దరు’ మంత్రులతోనే పోయే లా లేదని, ఇరవయి రెండు మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని శరణు జొచ్చారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినంత వరకూ ‘పార్టీ హైమాండ్‌’ ముందు వున్న సమస్యలు:

ఒకటి: ‘ధర్మాన’ తో పాటు ‘కళంకిత’ మంత్రులను ఏమి చెయ్యాలి.

రెండు: సీమాంధ్ర ఉప ఎన్నికల్లో ‘చావు తప్పి కన్నులొట్ట బోయిన'( చచ్చి చెడి రెండు సీట్లలో గెలిచింది లెండి) కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి చికిత్స చేయాలి.

మూడు: తెలంగాణ అంశం మీద ప్రకటన చేయాలా? చేస్తే ఎలా వుండాలి.

నాలుగు: ఆర్థిక కుంభకోణాలను దాటి, సంక్షేమ పథకాలను వదలి, ఇతర పార్టీలు ‘సామాజిక న్యాయం’ బాట పట్టాయి. (శాసన సభలో బీసీల ప్రాతినిథ్యం పెంచటానికి, తెలుగుదేశం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు వాటి వాటి ప్యాకేజీలతో వచ్చాయి. ఇందుకు విరుగుడు యోచించాలి.

వీటిని వీలయినంత తొందరలో పరిష్కరించకుండా రాష్ట్రంలో ‘సోనియా విజన్‌ 2014’ వైపు ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు.

‘ధర్మాన’ రాజీనామా విషయంలో కాంగ్రెస్‌ కు ‘చాయిస్‌’ లేదు. అయితే అంగీకరించటమో, అంగీకరించక పోవటమో- అన్న ప్రశ్నలేదు. ఇరవయి రెండు మంత్రులు కాదు, మొత్తం మంత్రులందరూ కలిసి ఊరేగింపుగా వచ్చి అడ్డు పడినా ఆమోదించి, ప్రాసిక్యూషన్‌ అనుమతించాల్సిందే. అలా కాకుండా మరేమీ చేసినా, రాష్ట్రంలో పతనమవుతున్న కాంగ్రెస్‌ ప్రతిష్టను మరింత దిగజార్చటమే.

పార్టీ హైకమాండ్‌ ఈ సమస్యను సమస్యగా కాకుండా ఒక అవకాశంగా చూసే పరిస్థితి కూడా లేక పోలేదు. ఎలాగూ ‘వైయస్‌ ముద్ర’ కాంగ్రెస్‌ కు కాకుండా, వైయస్సార్‌ కాంగ్రెస్‌ కే నూటికి నూరు శాతం లాభిస్తోంది. కాబట్టి అప్పటి ‘వైయస్‌ ముద్ర’ వున్న క్యాబినెట్‌ను మార్చుకోవాలనే చూడవచ్చు. ‘కళంకితుల’ పేరు మీద, వారిని పక్కన పెట్ట వచ్చు. వీరిలో పలువురు ఇప్పటికే ‘వైయస్సార్‌ కాంగ్రెస్‌’ మీద ఎంత విషం కక్కగలరో, అంతా కక్కేసారు కాబట్టి, అటు వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వెళ్ళ లేరు. పైపైచ్చు, తాము తీసుకున్న ప్రతీ నిర్ణయాన్నీ, మరణించిన వైయస్‌ ఖాతాలో వేస్తున్నారు. అందుచేత అందరికీ కాకపోయినా, కొందరు ‘కళంకితుల’ మీదయినా వేటు పడవచ్చు. ఈ రకంంగా ఏర్పడిన ఖాళీలను ‘సోనియా విజన్‌2014’ కు అనుగుణంగా నింప వచ్చు.

మంత్రులతో పాటు, ముఖ్యమంత్రిని కూడా మార్చ వచ్చు కదా- అన్నది సమస్య. కానీ కిరణ్‌ కుమర్‌ రెడ్డి ఎంపిక సాక్షాత్తూ పార్టీ హైకమాండ్‌ ఎన్నిక. అదీ కూడా రోశయ్యను పెట్టినట్టు, తాత్కాలికంగా బండిని నడిపించటానికి పెట్టిన ఎంపిక కాదు. ఇటు విద్యుత్‌ కోతలతో, అటు అధిక ధరలతో రాష్ట్రం అల్లాడిపోతున్నప్పుడు, ‘అసమర్థుడు’ అనే ముద్ర వేసి, కిరణ్‌ ను పక్కన పెట్ట వచ్చు. కానీ, మంత్రులను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు, అదే సమయంలో ముఖ్యమంత్రిని కూడా మార్చే పని పెట్టుకుంటారా? అలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అస్థిరత్వాన్ని కాంగ్రెసే భూతద్దంలో చూపించినట్టుంటుంది. అలా కాకుండా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేతనే ‘కళంకితుల’ ను వేటు వేయిస్తే, తమ వారు తప్పు చేసినా వదలమనే సంకేతాన్ని ఇచ్చినట్టవుతుంది. కాబట్టి ‘ఇదిగో దిగిపోతారు, అదిగో దిగిపోతారు’ అనుకున్న కిరణ్‌ కుమార్‌ మరి కొన్నాళ్ళు కొనసాగినా ఆశ్చర్య పోనవసరం లేదు.

అదీ కాక, ఒకపక్క రాజకీయ ప్రత్యర్థి అయిన ‘క్విడ్‌ ప్రోకో’ పేరు మీద ఇదే సిబిఐ జైలు పాలు చేసిన తర్వాత, తమ సొంత మంత్రులను కాపాడే ప్రయత్నం ఏమాత్రం తెలిసిపోయేలా చేసినా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ మరింత అపఖ్యాతి పాలవుతుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలల్లో యూపీయే అభ్యర్థికి మద్దతు పుచ్చుకున్నట్టే, 2014 తర్వాత కూడా యూపీయేకి కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి మద్దతు పొందే ఉద్దేశ్యం ఉన్నట్లయితే తమ సొంత పార్టీలో ‘కళంకితుల’ పట్ల ఉదాసీన వైఖరి ప్రకటిస్తే ‘సోనియా విజన్‌ 2014’ బెడిసి కొడుతుంది. అందుకని ఎలా చూసినా, ‘ధర్మాన’ తదితరుల విషయంలో కఠిన వైఖరి అవలంభించక తప్పదు. అలా కాకుండా వేరే రకం గా చేస్తే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వుంటుంది.

ఇక పార్టీకి చికిత్స చేసే విషయంలో పి.సి.సి నేత బొత్స సత్యనారాయణ నీరు కారిపోయారు. ఆయనే ‘మద్యం షాపుల’ ఆరోపణల్లో ఇరుక్కు పోయారు. అయితే బొత్స సామాజిక వర్గమయిన కాపులు కాంగ్రెస్‌ వైపు కొచ్చారన్నది ఇన్నాళ్ళూ ఆయనను కాపాడింది. కానీ కాపు వోట్లను ప్రభావితం చేయగలిగిన శక్తి, బొత్స కన్నా, తన ‘ప్రజారాజ్యాన్ని’ కాంగ్రెస్‌ లో విలీనం చేసిన( అదే సామాజిక వర్గానికి చెందిన) చిరంజీవికే వుందని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నట్లు కొన్ని సంకేతాలు వస్తున్నాయి. అదీ కాక ,కేంద్ర మంత్రి పదవి ఇప్పట్లో ఇవ్వలేని పక్షంలో ఆయనకు పార్టీలో కీలక పదవిని( అది పీసీసీ చీఫ్‌ కూడా కావచ్చు.) కట్ట బెట్టే ఆలోచనలు వున్నట్టు కూడా సంకేతాలు అందుతున్నాయి. సోనియా యే స్యయంగా ఆయనతో రాష్ట్ర రాజకీయాలు చర్చించిన నేపథ్యంలో ఈ పుకార్లు ఊపందుకున్నాయి కూడా.

అలాగే తెలంగాణ మీద కూడా ప్రకటన చేయటానికి ఇదిఅనువయిన సమయంగా కాంగ్రెస్‌ భావిస్తోంది. ఎందుకంటే, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ దాదాపు ఒంటరి వాడిగా వున్నారు. కాబట్టి, సీమాంధ్ర వారిని నొప్పించకుండా, తెలంగాణ సమస్యకు ఏదో ఒక కంటితుడుపు పరిష్కారంగా ప్రకటన వెలువరించే ఆస్కారం. అందుకోసం అవసరమయితే శ్రీకృష్ణ కమిషన్‌ రిపోర్టు వెనుక దాక్కొని తెలంగాణ అభివృధ్ధి మండలి ప్రతిపాదనను ముందుకు తెచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. అయితే తెలంగాణ ఉద్యమం చీలికలు కావచ్చు కానీ, ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ విషయంలో అందరూ ఒకే బాట మీద వున్నారన్న సత్యాన్ని కూడా పార్టీ హైకమాండ్‌ దృష్టిలో వుంచుకోవాల్సి వుంటుంది.

ఇక, అంతిమంగా, ఇటీవల తెలుగుదేశం, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు పోటా,పోటీగా ‘బీసీల రాజకీయ ప్రాతినిథ్యం’ గురించి ప్రకటనలు గుప్పించాయి. ‘వంద టిక్కెట్లు’ అని చంద్రబాబు అంటే, ‘వంద సీట్లు’ అని విజయమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడింది కాంగ్రెస్‌ పార్టీయే. అదీ కాక ఇప్పటికే ముగ్గురు మంత్రులు( మోపిదేవి, పార్థసారధి, ధర్మాన) కేసుల్లో ఇరుక్కున్నారు. అనుకోకుండా ఈ ముగ్గురూ బీసీలే. కాంగ్రెస్‌ పార్టీలో బీసీలకు ఈ తరహా మర్యాదలే దక్కుతున్నాయన్న విమర్శలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. వీరి స్థానంలో బీసీలనే కాకుండా, కేబినెట్‌లో వీరి సంఖ్యను పెంచే దిశగా కూడా, పార్టీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకోవచ్చు.

ఈ నాలుగు ప్రతిబంధకాలూ దాటటం అంత సులభం కాదు. కానీ దాట కుంటే, విజన్‌ 2014 వైపు యాత్ర మొదలే కాదు.

-సతీష్‌ చందర్‌

3 comments for “గాంధీ భవన్‌లో ‘ప్రజారాజ్యం’?

  1. nijamgaa gaandhee bhavanlo prajaraajyam kaalu pedithe, akbar roadlo laitha, mamatha, maaya, shushma, brindha, branch kaaryaalayaalu theruchukovachchu. mana baabu ku akkade prathyeka blok ketayimchavachchu. sonia, rahul, priyanka vadhera thama head quarters italy ki maarchukovachchu. adhi karectain vijan 2014.

Leave a Reply

Your email address will not be published.