‘గుర్తు’కొస్తున్నాయీ…!

symbolకేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీకి గుర్తు ‘చీపురు’ ఇచ్చారు కాబట్టి సరిపోయింది కానీ, ఏ ‘చిప్పో’ యిస్తే ఏమయ్యేది? ఏమీ అయ్యేది కాదు. ‘చీపురు’ కాబట్టి, అవినీతిని తుడిచిపాడేశాడు- అని అనేశారు. ‘చిప్ప’ కు తగ్గ గొప్ప చిప్పకూ వుంటుంది. దేశంలో నేతలు సంపదను మేసేసి, సామాన్యులకు ‘చిప్ప’ ఇస్తారా?- అని తిరగబడేవాడు.

ఎన్నికల సంఘం ఏ ‘గుర్తు’ ఇచ్చినా, తమ నినాదానికి అనుగుణం మార్చుకునే తెలివి పార్టీ నేతలకు వుంటుంది. అయితే అదృష్ట వశాత్తూ, కొన్ని పార్టీలకు బాగా నప్పే గుర్తులు వస్తుంటాయి.

ఇప్పడు కిరణ్‌ కుమార్‌ పార్టీ పెడుతున్నారని పుకార్లు వస్తున్నాయి. పుకారు అన్నాక పునాది వుండాల్సిన అవసరం లేదు. దానికి చిలవలూ, పలవలూ కూడా జోడించవచ్చు. దాంతో పార్టీ పేరు ఏమి పెడతారన్న ఊహాగానం కూడా నడుస్తోంది. ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పెడతారని కొందరు సునాయసంగా ఊహించేశారు. కానీ కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ పార్టీకి పేరులో ‘కాంగ్రెస్‌’ వుండేటట్టు జాగ్రత్త పడతారు.(ఉదా: తృణమూల్‌ కాంగ్రెస్‌, తమిళ మానిల కాంగ్రెస్‌, నేషలిస్ట్‌ కాంగ్రెస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌లు). కానీ ఊహించిన వారే విస్మరించారో లేక అసలు వ్యూహ కర్తలే వదలేశారో, చూడాల్సి వుంది.

పేరుతో ఆగారా? గుర్తును కూడా సిధ్ధం చేశారు. అసలే క్రికెటర్‌. ఆ పై ఈ మధ్య తెలంగాణ బిల్లు విషయంలో ‘చివరి బంతి’ ని తీస్తానంటూ, రోజుకో ‘చివరి బంతి’ తీస్తున్నారాయన. అలాంటి క్రికెటర్‌ పెట్టే పార్టీ గుర్తు ‘బ్యాట్‌’ కాకుండా, మరొకటి వుంటుందా? అలాగే ఊహించారు పుకారువీరులు.

ఎన్నికల ముందు ‘గుర్తులకు’ తగ్గట్టు ప్రచారం చేసుకోవటం ఎలా వున్నా, రాష్ట్ర పునర్విభజన ప్రక్రియ సమయంలో మాత్రం రాష్ట్రంలో పార్టీలన్నీ తమ గుర్తుకు తగ్గట్టుగా నడుచుకుంటున్నట్టున్నాయి.

తెలుగు దేశం పార్టీనే తీసుకోండి. ఆ పార్టీనేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ యిచ్చి వున్నా, విభజన ప్రకటన వచ్చాక మాత్రం ‘సమన్యాయం’ అనే విధానాన్ని ప్రకటించారు. విషయం అర్థం అవుతూనే వుంది. ఆయన రాష్ట్రంలో అటు తెలంగాణ లోనూ, ఇటు సీమాంధ్రలోనూ ఎక్కడా పట్టు వదలుకోవాలనుకోవటం లేదు. ఈ విషయాన్ని చెప్పటానికి ఆయన కవిలాగా మారిపోయి ఎన్నో పోలికల్నీ, ఉపమానాల్నీ ఇచ్చారు. రెండు ప్రాంతాలనూ ‘రెండు కళ్ళ’ తో పోల్చారు. ( నిజమే కదా! రెండూ కలిసి ప్రపంచాన్నంతా చూడగలవు కానీ, ఒక దానిని ఒకటి చూసుకోలేవు.) ‘రెండు కొబ్బరి చిప్పల’తో పోల్చారు. (సమంగా పగిలినవే సుమండీ. ఎక్కువ తక్కువలగా పగిలితే ఏమవుతుందో అది వేరే విషయం.) ఆతర్వాత ఇద్దరు బిడ్డలతో పోల్చారు.( కరెక్టే. ఇద్దరిలో ఒకరు కుబేరుడూ, ఇంకొకడు కుచేలుడూ కాకూడదనే రూలు లేదు.) అన్ని పోలికలూ తెచ్చారు. ఆయన పార్టీ గుర్తు ‘సైకిలు’ ను మరచిపోయారు. రెండు ప్రాంతాలూ ‘రెండు సైకిలు చక్రాలు’ అంటే సరిపోయేది కదా! ఒకే సారి రెండు చక్రాలకూ పంక్చర్‌ పడితే, ఎలా కదులుతుంది చెప్పండి! ఏ విషయం చెప్పేస్తే, తన స్థితినీ, తన పార్టీ స్థితినీ రెండు ప్రాంతాల ప్రజలూ సులభంగా అర్థం చేసుకునే వారు.

ఇక కాంగ్రెస్‌ గుర్తు ‘చెయ్యి’. ఏ ‘చెయ్యి?’ ఎడమ చెయ్యా? కుడి చెయ్యా? ఏ చెయ్యయినా నడుస్తుంది. ఒక్కొక్క సారి రెండు చేతులూ అవసరమవుతాయి. (సంపాదించటానికే కాదు, పనిచెయ్యటానికి కూడా.) ‘చెయ్యి’ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక చెయ్యీ, కౌగలించుకోవాలనుకున్నప్పుడు ‘రెండు చేతులూ’ వాడుతుంది. ఇప్పుడు కూడా రెండు చేతుల్తో పని వచ్చింది. ఒక ‘చెయ్యి’ ‘జై తెలంగాణ’ అంటే, ఇంకో ‘చెయ్యి’ ‘జై సమైక్యాంధ్ర’ అంటుంది. అందుకని కాంగ్రెస్‌ ‘గుర్తు’ కు తగ్గట్టుగానే ప్రవర్తిస్తోంది.

ఇక జగన్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ గుర్తు ‘ఫ్యాన్‌’. దీనికి మూడు రెక్కలుంటాయి. ఇంగ్లీషులో ‘బ్లేడ్స్‌’ అంటారు. ‘బ్లేడులు’ ఎవరు ఎందుకు వాడతారో తర్వాత విషయం. కానీ ఈ పార్టీ ‘ప్రాంతానికో’ బ్లేడ్‌ వాడాలనుకుంది. కానీ ఈ మధ్యనే ఓ ‘బ్లేడ్‌’ (ఒక రెక్క) విరిగింది. అదీ ‘తెలంగాణ’ కు చెందినది. మిగిలినవి రెండూ రెండు చోట్ల పనికివస్తాయి. ఒకటి: సీమ, రెండు: ఆంధ్ర. ఇంకో ‘బేడు’ కూడా విరిగేదే. కొంచెంలో తప్పింది. ఆ మధ్య ‘రాయల తెలంగాణ’ అనే ఒక అంశాన్ని కేంద్రం తెర మీదకు తెచ్చింది. అలాగయితే రాయల సీమ రెండు ముక్కలయ్యేది. అప్పుడు వైయస్సార్‌ కాంగ్రెస్‌ కూడా ‘సీమ’లో సగం కోల్పోయేది.

ఇక కేసీఆర్‌ ‘టీఆర్‌ఎస్‌’ పార్టీకి రంగొకటి; గుర్తొకటి. రంగు ‘గులాబి’; గుర్తు ‘కారు’. నిజానికి ‘సైకిలు’కు లేని సౌకర్యాలు కారుకున్నాయి. సైకిలుకు రెండే చక్రాలు. కానీ కారుకు ‘నాలుగు చక్రాలు’ ( చేతిలో వున్న స్టీరింగును కూడా కలుపుకుంటే అయిదు చక్రాలు- అవుతాయి.) వేగం చెప్పనవసరం లేదు. కానీ ఈ కారుకు పర్మిట్టు ‘తెలంగాణ’ దాటి లేదు. ఎంత తిరిగినా పది జిల్లాల్లోనే తిరగాలి. అక్కడ మాత్రం ఎవరొచ్చినా కారుని దాటలేరు. అందుకే కాంగ్రెస్‌ తెలివిగా ‘చెయ్యి’ లోపల వున్న ‘స్టీరింగ్‌’ మీద వేస్తోంది.

ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ‘తోడి కోడళ్ళు’ లాంటివి. గుర్తులతో మాట్లాడుకోవాలంటే తోడి ‘కొడవళ్ళు’. ఒకటి ఎడా, ఇంకొకటి పెడా. సీపీఐ ‘జై తెలంగాణ’, సీపీఎం ‘జై సమైక్యాంధ్ర’.

ఈ విభజనలో కూడా పార్టీలు ఇలా ‘గుర్తు’ండి పోవటం విశేషమే. కానీ ఎన్నికల తర్వాత ఎన్నింటికి గుర్తులు మిగులుతాయో, వేచి చూడాలి.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 12జనవరి 2014 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply