దళిత ప్రేమ లేఖ

Photo By: gogoloopie

మరణిస్తున్నాను. మన్నించు సవర్ణ ప్రియా

మనసునొక సారి శరీరాన్నొక సారి సులభవాయిదాల్లో కాక

ఆకూ వక్కల్లా ఏకకాలంలో అందించిన దాన్ని

 

తడిపే వాన నా తనువు

కాల్చే మెరుపు నా మనసు

నీళ్ళల్లోని నులివెచ్చదనమే నా ప్రేమ

 

ముడుపు చెల్లించి మూడు ముళ్ళూ వెయ్యించుకున్నాకనే

దేహాన్ని ‘డోర్‌ డెలివరీ’ చేసే ఊర ప్రేమలు నాకు తెలీవు

 

కూలికి వెళ్ళి కమిలి పోవద్దంటూ

చక్కదనాల నా తల్లిని తిట్టుకుని, పట్టుకుని

నా తండ్రి తనివి తీరా ఏడ్చుకున్నప్పుడే

నేను గర్భంలో పడివుంటాను

 

రెండు శరీరాలూ రెండు మనసులైనప్పుడు మాత్రమే

ఏర్పడ్డ జన్మ నాది

పసుపు తాళ్ళకందని పవిత్రత

పస్తులతో హత్తుకున్న గుండెల మధ్య గుబాళిస్తుంది

 

మరణించటం మా కులధర్మం

పూవు పూస్తుందనీ

కోడి కూస్తుందనీ

పాప ఏడుస్తుందనీ

చెప్పటానికి మరణిస్తుంటాం

మాకివన్నీ భూమి గుండ్రంగా వుందన్నంతటి గొప్ప విషయాలు

 

నోరు తిరుగుతుందనడానికీ

నాజూకు తెలుస్తుందనడానికీ

నిజం పలుకుతామనటానికీ

శిలువలెక్కుతూ వుంటాం

 

ఉదాహరణకి నేనిప్పుడు

తనివి తీరా మనసివ్వడాన్నో లేక, మన:స్పూర్తిగా శరీరాన్నివ్వటాన్నో

ప్రేమని చెప్పడానికి మరణిస్తున్నాను

 

ముద్దంటే

వేడిమి, తేమల విచిత్రాద్వైతమని

చెప్పడానికి మరణిస్తున్నాను

 

రెండు శరీరాలకూ అంటుకట్టి

ఒకే ఒక ప్రాణాన్ని చిగురింప చెయ్యడమే

ఆలింగనమని చెప్పటానికి మరణిస్తున్నాను

 

ప్రయాణిస్తున్న పడవను పరమ సాహసవంతంగా తన్ని-

మునుగుతూ, తేలుతూ, పెనుగులాడుతూ

ఒకరినొకరు ఒడ్డుకు చేర్చుకోవడమే

అసలు సిసలు ప్రణయమని చెప్పడానికి మరణిస్తున్నాను

 

శిక్ష విధించి శిరసు వంచుకున్న పిరికి చక్రవర్తిలా

పండిన నాగర్భం ముందు ప్రాధేయ పడినందుకు మరణించడం లేదు

 

యోగివో, భోగివో తెలీదు కాని-

వడ్డించిన విస్తరిలో చొంగ కార్చుకున్న

అకాల వృధ్ధుడివి నీవు

క్కును కొట్టిన చేత్తోనే విస్తరినీ విసరి కొట్టగలను

 

కానీ, హఠాత్తుగా

నాకు మరణం జీవితమంత ముఖ్యమయిపోయింది

పార్వతి, లైలాల శరీరాల కన్నా

మాతంగి స్త్రీల మనసులు పరమ పవిత్రమైనవని చెప్పడానికి

ఒక మరణం అనివార్యమయిపోయింది

 

మన్నించు నా సవర్ణ ప్రియా, మన్నించు

శరీరంలేని నా మససును సమకూర్చలేక పోయాను

 

సొంత యింటికి కన్నం వెయ్యాలన్నా

కట్టుకున్న భార్యతో వ్యభిచరించాలన్నా

ఊరేమో కాని

వాడ అంత అనువైనది కాదు
-సతీష్ చందర్

(అనేకానేక సునీతల కోసం)

1995

(సునీత ఒక దళిత విద్యార్థిని. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్( పెంట్రల్ యూనివర్శిటీ)లో చదువుతూ వుండేది.అక్కడే చదువుతున్నయోగేశ్వర రెడ్డి అనే అగ్రవర్ణ యువకుణ్ణి ప్రేమించింది. అతడి కారణంగా ఆమె మూడుసార్లు గర్భవతియై అతని సలహా మేరకు అబార్షన్ చేయించుకుంది. కడకు అతడు ఒక రోజున ఆమెకు ఓ వార్త చెప్పాడు తనకు తన వాళ్ళు వేరే రెడ్ల అమ్మాయితో పెళ్ళి నిశ్చయించారని.  ఈ వార్త విన్న సునీత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన 1995 లో జరిగింది.  ఆమె చనిపోతూ ఒక ఉత్తరం రాసి పెట్టింది. అప్పుడు నేను వార్త దిన పత్రికకు అసోసియేట్  ఎడిటర్ గా వున్నాను. ఈ లేఖను చదివాను. వాడినేమీ చెయ్యలేమా అనిపించింది. ఆమె మరణ వార్తను ప్రముఖంగానే ప్రచురించాను. కానీ ఏదో తెలియని అవమానం. ఇలాంటి సునీతలు  ప్రతీ క్యాంపస్ లోనూ రహస్య వేదనను అనుభవిస్తుంటారు కదా- అని పించింది. ఫలితమే ఈ కవిత. తొలుత  ఇండియాటుడే సాహిత్య సంచికలో వెలువడింది. నా ’ఆదిపర్వం‘ కవితా సంకలనం ఈ కవితతో ముగుస్తుంది. ఈ పోస్ట్ లో ప్రచురించింది సునీత చిత్రం కాదు. )

12 comments for “దళిత ప్రేమ లేఖ

Leave a Reply