పెద్ద కుర్చీలో ‘చిరు’ నేతా?

రాష్ట్రంలో ‘అకాల’ జ్ఞానులు పెరిగిపోతున్నారు. అడక్కపోయినా, ఆపి మరీ జోస్యం చెప్పేస్తున్నారు. చంద్ర శేఖర సిధ్ధాంతి (కె. చంద్రశేఖరరావు) హఠాత్తుగా వచ్చే నెలలో(సెప్టెంబరులో) తెలంగాణ తేలిపోతుందంటారు. ఈయనకు గతంలో కూడా ఇలాంటి జ్యోతిషం చెప్పిన అనుభవం వుంది. కానీ ఆంధ్ర నుంచి, ఇంకో సిధ్ధాంతి బయిల్దేరారు. ఆయనే రామచంద్ర సిధ్ధాంతి( గుడుల మంత్రి సి.రామచంద్రయ్య). చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ద్వారాకా తిరుమలలోని ‘కాపు కళ్యాణమంటపం’లో చెప్పారు. వీరు హాస్యాలాడుతున్నారా? లేక జోస్యాలాడుతున్నారా? రాజకీయాల్లో రెంటికీ పెద్ద తేడా ఏమీ వుండదు లెండి.

తెలంగాణ రాష్ట్రం ఇవ్వగలిగేదీ, చిరంజీవికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలిగేదీ కాంగ్రెస్‌ అధిష్ఠానమే. పాపం. ఈ విషయాలు ఆవిడకు(సోనియాకు) తెలుసో తెలియదో. ఆమెకు అతి సన్నిహితంగా వుండే ఢిల్లీలోని కాంగ్రెస్‌ పెద్దలు మాత్రం తమకు తెలియదనే చెప్పారు. కానీ, ఈ రెండు విషయాలూ- కాంగ్రెస్‌తో ‘విడిగా వుండి కలిసే’ తెలంగాణ రాష్ట్రసమితి(టీఆర్‌ఎస్‌) కూ తెలిసింది; ‘కలిసి కూడా విడిగా వుండే’ ప్రజారాజ్యం పార్టీ( పిఆర్‌పి) నేతలకూ తెలిసింది.(రామచంద్రయ్య తర్వాత మరో నేత గంటా శ్రీనివాసరావు కూడా ఆయన జోస్యాన్ని ఖరారు చేశారు లెండి.)

‘ఇదిగో తెలంగాణ. అదిగో తెలంగాణ, తెల్లవారితే తెలంగాణ’ ఇలాంటి క్రాంత దర్శనాలు టీఆర్‌ఎస్‌ నేతలకు మామూలే. కానీ, ‘చిరంజీవి సిఎం’ అవుతారన్న జోస్యం మాత్రం పూర్తిగా కొత్తది. ముఖ్యమంత్రిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డిని మారుస్తారేమో-నన్న అలవాటయిన అనుమానాల మధ్య ఈ జోస్యం- ఒకింత ఆసక్తిని రేపుతుంది. బహుశా ముఖ్యమంత్రి స్థానాన్ని ‘జనాకర్షక నేత’కు ఇద్దామన్న ఆలోచనలోంచి ఈ ప్రతిపాదన వచ్చిందా?

చిరంజీవికి ఆకర్షణ వున్నమాట నిజమే. అది ఇతరులకు వరమేమో కానీ, ఆయనకు మాత్రం శాపమే అయింది. రాజకీయాల్లోకి చేరాక తన ‘గ్లామర్‌’ తనకు పనిచేయలేదు. ‘ఉన్నదీ పోయింది, ఉంచుకున్నదీ పోయింది’ అన్న చందంగా ఆయన ‘ఇలాకా’లు కళ్ళముందే చెదరి పోయాయి. 2009లో ఆయన పాలకొల్లు, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. పాలకొల్లు స్వస్థానం కన్నా ఎక్కువ.( ఎందుకంటే అది ‘అత్తింటి’ స్థానం). అక్కడ ఆయన చతికిల పడ్డారు. కానీ తిరుపతిని అతికష్టం మీద దక్కించుకున్నారు. కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభ సభ్యత్వం పొందాక, 2012లో తీవ్రాతి తీవ్రంగా ప్రచారం చేసి, అలనాటి తన ప్రత్యర్థి( వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రుణాకర రెడ్డి) ని గెలిపించారు. తన స్థానంలో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థిని మట్టి కరిపించేశారు. అయితేనేం? 2009లో ఆయన పార్టీకి 16 శాతం వోట్లూ, 18 అసెంబ్లీ సీట్లూ వచ్చాయి. (ఎంపీలకూ, ఆయన పార్టీకీ ఎలాంటి సంబంధం లేదు.) తెలంగాణలో అయితే ఆయన సినిమాలు ఆడినంత గొప్పగా కూడా ఆయన పార్టీ ఆడలేక పోయింది. ఇప్పుడు తెలంగాణలో ‘సమైక్యాంధ్ర’ ముద్ర వున్న జగన్‌ తల్లి విజయమ్మ అయినా ప్రవేశించగలిగారు కానీ, ‘సామాజిక తెలంగాణ’ నినాదం ఇచ్చిన చిరంజీవి మాత్రం- ఇప్పటికీ చొరబడలేక పోతున్నారు.

అలాంటి చిరంజీవిని ముఖ్యమంత్రిని చేస్తే ఒక్క ఉదుటున కాంగ్రెస్‌ వోటింగ్‌ శాతం పెరిగి పోతుందా? కాంగ్రెస్‌కు 2009లో తెలంగాణ లో 33 శాతం, సీమాంధ్రలో 41.8 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈ మూడేళ్ళలో అటు తెలంగాణ ప్రభంజనానికీ, ఇటు వైయస్సార్‌ కాంగ్రెస్‌ దెబ్బకీ- తెలంగాణలో 20.8 శాతానికీ, సీమాంధ్రలో 22.8 కాంగ్రెస్‌ వోటింగ్‌ పడిపోయింది. అంటే సగానికి సగం కుప్పకూలింది. ఈ వోట్లు ఎక్కడికి పోయాయి? తెలంగాణలో అధిక శాతం టీఆర్‌ఎస్‌కీ, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌కూ పోయాయి. తాజా ఉప ఎన్నికల ఫలితాల ఆధారంగా, ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు47.7శాతం, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌కు 51.5 శాతం పోలయిన వోట్లలో తీసుకోగలుగుతున్నాయి. కులాల వారిగా చూస్తే ఇలా వెళ్ళి పోయిన వారిలో రెడ్లూ, ఎస్సీఎస్టీలూ మొదటి వరసలోనూ, బీసీలు రెండవ వరసలోనూ వున్నారు.

కాపుల్ని కూడా బీసీలుగా భావిస్తే, చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం వల్ల, కాంగ్రెస్‌నుంచి వెల్ళి పోయిన ఈ వర్గం బీసీలు మాత్రం తిరిగి వచ్చి వుండాలి. గత నెలలో జరిగిన ఉప ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాలో కాంగ్రెస్‌ గెలుచుకున్న రెండు స్థానాలూ (నర్సాపురం, రామచంద్రాపురం) కాపు అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. అయితే వీరిద్దరూ చిరంజీవి సొంత పార్టీ తరపున 2009లో పోటీ చేసినప్పుడు ఓడిపోయారు. కాంగ్రెస్‌ వల్లే గెలిచారని వేరే చెప్పనవసరం లేదు.

ఇంకా న్పష్టంగా చెప్పాలంటే చిరంజీవి కాంగ్రెస్‌లో చేరటం వల్ల చిరంజీవికి మేలు జరిగింది కానీ, కాంగ్రెస్‌ కు ఒరిగిందేమీ లేదు.

సొంత నియోజక వర్గాన్ని, సొంత సామాజిక వర్గాన్ని, సొంత ప్రాంతాన్ని సైతం ప్రభావం చేయలేని నేతను, కాంగ్రెస్‌ సంరక్షకుడిగా ముందు పెడితే, కాంగ్రెస్‌కు ఉన్న వోట్ల శాతం అయినా నిలబడుతుంతా- అన్నది ప్రశ్నార్థకమే. ఆయన సభలకు జనం విరగబడి వచ్చిన తర్వాత (2009) లో జరిగిన ఎన్నికలలోనే, ఒక్క పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోలేక పోయిన చిరంజీవి, రేపు రాహుల్‌ను ప్రధానిగా చేయటానికి, కాంగ్రెస్‌నుంచి ఎన్ని సీట్లను ఇస్తారు? అయినా సరే, బొమ్మలకీ, రోబోలకీ పెద్దకుర్చీలు వేసే అలవాటున్న సోనియా ఈ ‘తెరమీద బొమ్మ’కు కూడా వేస్తారేమో!? కరెక్టే. ఆ ఆనవాయితీ వున్న మాట నిజమే. కానీ పార్టీకి తిరుగులేని బలముందనుకున్నప్పుడు మాత్రమే ఆ పని చేస్తారు. ఇప్పుడు మాత్రం- ఆమెకు సమర్థులయిన నేతలే కావాలి.

-సతీష్ చందర్

2-8-12

 

 

 

4 comments for “పెద్ద కుర్చీలో ‘చిరు’ నేతా?

Leave a Reply