‘మీరో’ సగం! ‘మేమో’సగం!!

మనం మనమే.
జనం మనమే.
కానీ, అప్పుడప్పుడూ సగం ‘మీరూ’, సగం ‘మేమూ’ అన్నట్లుగా చీలిపోతాం. కత్తులు దూసుకుంటాం, కాలర్లు పట్టుకుంటాం, కొత్త తిట్లు తిట్టుకుంటాం.
ఎలా కలిసిపోతామో, ఒక రోజు పొద్దున్నే చూసుకునే సరికి, ‘మీ’ కౌగిలిలో ‘మేమూ’, ‘మా’ కౌగిలిలో ‘మీరూ’ వుంటాం. అదే జనమంటే!
చీల్చటానికే మధ్యవర్తులు కావాలి. కలవటానికి అవసరం లేదు.
అందుకే మనకూ చీలికా కొత్త కాదు, కలయకా కొత్త కాదు.
కాపురమన్నాక అలకలున్నట్లు, జనమన్నాక చీలికలుంటాయి. ఎప్పుడో కానీ, ఈ అలకలు విడాకులవరకూ రావు. ఇండో-పాక్‌లగా వేరు కుంపట్లు పెట్టుకోవు.
ఇందిరమ్మ హత్య తర్వాత కొన్ని గంటల పాటు మనం హిందువులంగా, సిక్కులంగా విడిపోయాం. నెత్తురోడ్చుకున్నాం. మళ్ళీ కలిసిపోలేదూ.
అయోధ్య లోని ‘మందిర్‌-మసీదు’ సాక్షిగా హిందువులంగా, ముస్లింలుగా రెండో మారు విడిపోయాం. ఈ సారి విడాకుల వరకూ తెచ్చుకున్నామా?
మండల్‌ సిఫారసుల నెపంతో మనం ‘ప్రతిభా’వంతులముగానూ, ‘కోటా’వాదులముగానూ విడిపోయాం. ఇంకో ముక్కలో చెప్పాలంటే ‘అగ్రవర్ణుల’గానూ ‘బడుగులు’గానూ రెండు ముక్కలయ్యాం. ఎన్నాళ్ళున్నాం? కలిసిపోయామా? లేదా?
అంతెందుకు ఆ మధ్య ‘మతాంతీకరణ’ కారణంగా హిందువులం, క్రైస్తవులంగా విడిపోయాం. ఇప్పుడు కలిసిపోలేదూ.
ఇలా కలిసిపోయినందుకు గుర్తుగా కొన్ని బహుమానాలను కూడా ఇచ్చుకుంటాం.
హిందూ సిక్కుల కలయకకు సంకేతంగా మనలో మైనారిటీల ప్రతినిథిగా సిక్కును (‘మన్‌మోహన్‌ సింగ్‌)ను ప్రధానిగా పెట్టుకున్నాం.
అంతకు ముందే, హిందు-ముస్లింల ఐక్యతకు గుర్తుగా మళ్ళీ మనలోని మైనారిటీకి చిహ్నంగా ముస్లిం(అబ్దుల్‌ కలామ్‌)ను రాష్ట్రపతిగా చేసుకున్నాం.
అగ్రవర్ణుల, బడుగుల ఐక్యతకు చిహ్నంగా ‘ప్రతిభ’ పక్షాన ముందు వరసలో నిలిచి అగ్రవర్ణ పార్టీగా పేరొందిన బి.జె.పి నేడు ‘బడుగు’ ముఖ్యమంత్రులనే ముందు వరసలో( గుజరాత్‌లో నరేంద్ర మోడీ, కర్ణాటకలో నిన్నటి దాకా యెడ్యూరప్ప, ఇప్పుడు సదానంద గౌడ్‌) నిలబెట్టింది.
‘బడుగుల’ వోట్లతో ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అయిన మాయావతి అగ్రవర్ణులకు సైతం కోటా ప్రకటించారు.
అయితే మనం దేశవ్యాపితంగానే కాదు, అప్పుడప్పుడూ రాష్ట్ర వ్యాపితంగా కూడా చీలిపోతుంటాం.
మహారాష్ట్రలో మరాఠీలుగా, మరాఠీయేతరులుగా చీలిపోతాం.
కొన్ని రాష్ట్రాలలో తెగలు తెగలుగా, జాతులు జాతులుగా చీలిపోతాం.
ఒక్కొక్క సారి ఉపకులాలుకూడా చీలిపోతాం. అందుకు మన రాష్ట్రంలోని షెడ్యూల్డు కులాలే ప్రత్యక్ష ఉదాహరణ.
మన రాష్ట్రమంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మనం తెలంగాణా వాదులుగానూ, సమైక్యాంధ్ర వాదులుగానూ చీలిపోయాం. మానసికంగా ‘వేరుపడిపోయామ’ంటున్నారు కొందరు. ఇక ఎప్పటికీ శత్రువులుగానే వుండిపోతారన్న భ్రమ కలుగుతోంది.
నిజమే ఇప్పుడు జరుగుతున్న ‘ఆత్మహత్యల’ ‘రాజీనామా’ల పరంపరను చూస్తే అలాగే అనిపిస్తుంది.
ఏ ఉద్యమ కాలంలో ఆ ఉద్యమం గొప్పది గానూ, అంతకు ముందు అలాంటిది లేనట్లుగానూ అనిపిస్తుంది.
సిక్కుల ఊచకోత తర్వాత, హిందువులూ, సిక్కులూ ఇక కలవగలరా అనిపించింది.
రిజర్వేషన్‌ ఉద్యమంలో ‘ప్రతిభ’వాదులు నడిరోడ్డు మీదకొచ్చి ఆత్మాహుతి చేసుకున్నారు. అగ్రవర్ణులకీ, బడుగులకీ మధ్య సయోధ్య కుదురుతుందా- అనిపించింది.
జనాన్ని ఎన్ని ముక్కలుగానయినా తరుక్కోండి. వాళ్ళు జనంగానే కలిసిపోతారు.
అందుకే.. తెలుగు వాళ్ళు కలుస్తారు. ప్రాంతం ఒకటిగావున్నా కలుస్తారు. వేరుపడినా కలుస్తారు.
కానీ, చిత్రం. చీలిన జనం కలవగలిగినప్పుడు చీలిన పార్టీలు కలవలేవా?
‘నేడు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు నిలువునా చీలివున్నాయి. ఇవి కలవలేవా?’ ఈ ప్రశ్న కేంద్రమంత్రి చిదంబరం వేస్తున్నారు.
నిజమే. చీలిన వారు కలిసినంత సులువుగా చీల్చిన వారు కలవలేరు.
జనం చీలతారు.
పార్టీలు చీలుస్తాయి.
జనం కలవటానికి అనుబంధం చాలు.
పార్టీలు కలవటానికి చాలా కావాలి. బేరాలు కుదరాలి. వాటాలు తెగాలి. కుర్చీలు పెరగాలి.
పార్టీలోపలి చీలికలు కలవటానికి, వీటన్నిటితో పాటు, వచ్చే ఎన్నిల్లో టిక్కెట్లు దక్కాలి.
-సతీష్‌ చందర్‌

(ఈ వ్యాసం ఆంధ్రభూమి దినపత్రికలో 7ఆగస్ఠు 2011 నాడు ప్రచురితమయినది)

1 comment for “‘మీరో’ సగం! ‘మేమో’సగం!!

Leave a Reply