మోడీకి మరో వైపు ఓవైసీ!


akbaruddinద్వేషాన్ని
మించిన ప్రేలుడు పదార్థం రాజకీయాల్లో లేదు. మరీ మత ద్వేషం అయితే ‘ఆర్డీఎక్స్‌’ కన్నా ప్రమాద కరం.

ఒక్క ద్వేషంతో సర్కారును పేల్చిపారేయవచ్చు. ప్రేమతో ఒక్కటి కాని మనుషుల్ని పగతో ముడివేయ వచ్చు. దేశంలో నగల షాపులున్నట్లే ఎక్కడికక్కడ పగల షాపులున్నాయి. ఇక్కడ సరసమైన ధరల్లో రకరకాల ద్వేషాలు అమ్మేస్తుంటారు: ప్రాంతీయ విద్వేషం. కులద్వేషం, లింగ ద్వేషం, భాషా ద్వేషం, మత ద్వేషం. అయితే అన్నింటి ధరలు ఒకటి కావు. అన్నింటికన్నా చౌకగా వుండీ, అందరికీ అందుబాటులో వుండే ద్వేషం- మత ద్వేషం.

రెండువేల రూపాయిలు చాలు, ఈ దేశంలో ఏ భాగంలోనయినా మత కల్లోలాలను రేప వచ్చు. ఈ మాట అన్నది ఎవరో కాదు, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ మార్కండేయ ఖట్జూ. బహుశా ఈ ఖర్చు కొన్ని చోట్ల మరీ తగ్గ వచ్చు. నిన్న మొన్నటి దాకా గాంధీ గారు పుట్టిన స్థలం(గుజరాత్‌ రాష్ట్రం)లోనే మత ద్వేషం కారు చౌక అనుకున్నాం. కానీ ‘భాగ్‌మతి’ పేరుతో వెలసిన మన ‘భాగ్యనగరం’లో అది మరింత చౌక -అనే అనుమానం కలుగుతోంది.

గోద్రా రైలు ప్రమాదం తర్వాత గుజరాత్‌లో మతం పేరిట నెత్తుటేరులు పారాయి. అక్కడ మైనారిటీగా వున్న ముస్లింల పై, మెజారిటీ హిందువుల్లో ద్వేషాన్ని రగిలించటానికి గోద్రా ఘటనను అక్కడ ‘హిందూత్వ’ నేతలు ఎలా ఉపయోగించుకున్నారో గుర్తుండే వుంటుంది. వీటి వల్ల నాడు రాజకీయ లబ్ధి పొందిన నరేంద్రమోడీయే ముమ్మారు గెలిచారు. అయినా చరిత్ర మీద పడ్డ నెత్తుటి మరకను ఎవరూ చెరపలేరు.

నిజమే. ద్వేషమెప్పుడూ సంఖాపరంగా ‘మెజారిటీ’ రాజకీయాలకే ఉపయోగపడుతుంది. తక్కువ సంఖ్యలో వున్న వారి మీద పగలు రగిలించటం వల్ల, ఎక్కువ సంఖ్యలో వున్న వారి వోట్లనీ ఒక చోటకు చేరతాయి. ఇదే ‘ఆధిక్యవాద రాజకీయం'(మెజారిటేరియన్‌ పాలిటిక్స్‌).

కానీ మైనారిటీ నేత, మెజారిటీమతస్తుల మీద ద్వేషాన్ని రగిలించటం వల్ల ఇదే రాజకీయ లబ్ధి వచ్చిపడుతుందా? కానీ ఎంఐఎం (మజ్లిస్‌) శాసన సభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ ఇలా మెజారిటీ మతస్తుల మీద ద్వేషాన్ని రగిలించే ఉపన్యాసమిచ్చారని మీడియాలో వార్తలు రావటంతో పాటు, కోర్టుకు ఫిర్యాదులు అందాయి. ఫలితంగా ఈ కేసు మీద దర్యాప్తు జరపమని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు.

ఈయన ఉపన్యాసంలో ‘ద్వేషం’ పాళ్ళు ఎంత వరకూ వుందో చట్ట పరిధిలో విచారణయితే జరుపుతారు. అది వేరే విషయం. కానీ ఈ ‘ద్వేషం’ వల్ల కూడా మజ్లిస్‌ కన్నా మెజారిటీ మతవాద రాజకీయ పక్షాలకే ఎక్కువ ఉపయోగం కదా! మరీ చూస్తూ, చూస్తూ ఇంత పెద్ద ‘తప్పు’లో అక్బరుద్దీన్‌ ఎలా కాలు వేయరు కదా!

ఆయన ఉపన్యాసం ఎక్కడ ఇచ్చినా, దాని ప్రభావం హైదరాబాద్‌ పాత బస్తీలోనే అధికంగా వుంటుంది. రాష్ట్రవ్యాపితంగానో, నగర వ్యాపితంగానే చూసుకుంటూ ముస్లింలు మైనారిటీలే. కానీ పాత బస్తీ పరిధిలో చూసినప్పుడు వారిదే మెజారిటీ. అంటే ఇలాంటి ‘ద్వేషం’ అంటూ రగిలితే, తమ హవా వున్న పాత బస్తీ వరకూ, ‘మెజారిటీగా వున్న ముస్లింల’ వోట్లను ఒక్క చోటకు చేర్చుకోవచ్చన్న వ్యూహం, ఈ ‘ద్వేషోపన్యాసం’ వెనుక వుండి వుండ వచ్చు. అంటే ఒకప్పుడు మోడీ గుజరాత్‌లో ‘మెజారిటీ హిందువుల’ వోట్లను ఎలా కూడగట్టారో , అక్బరుద్దీన్‌ ఓవైసీ పాతబస్తీవరకూ ‘మెజారిటీగా వున్న ముస్లింల’ వోట్లను అలా పటిష్టపరచుకోవచ్చు. ‘వన్‌ బైటూ’ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్‌నుంచి హైదరాబాద్‌ మేయర్‌ పదవిని పుచ్చేసుకుంది. ఈ ప్రకటన చేసిన నేపథ్యం కూడా విశేషమైనదే. మజ్లిస్‌ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్నది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కాబోయే మిత్రపక్షమని నర్మగర్భంగా ప్రకటించింది. ‘ఉంచితే సమైక్యంగా వుంచండి. లేకపోతే రాయల- తెలంగాణ ఇవ్వండి’ అని అఖిల పక్షంలో తెగేసి చెప్పేసింది. ఈలోపుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మజ్లిస్‌ను చిన్న పార్టీగా కొట్టి పారేశారు. ఈ నేపథ్యంలో పాతబస్తీతో పాటు, సంఖ్యాపరంగా కీలకంగా ముస్లింలు ఎక్కువగా వున్న ప్రాంతాలలో పార్టీ పట్టును పెంచుకోవటానికి దగ్గర దారిగా ఈ ‘ద్వేషమార్గాన్ని’ అవలింభిస్తే అవలంభించి వుండవచ్చు. కానీ ‘ద్వేష రాజకీయం’ భస్మాసురుడు పొందిన వరం లాంటిది. ముందు ఇతరులు నష్టపోవచ్చు. కానీ అంతిమంగా ఈ రాజకీయాన్ని ప్రయోగించిన వారే నష్టపోతారన్నది చరిత్ర చెప్పిన వాస్తవం.

-సతీష్ చందర్

(గ్రేట్  ఆంధ్ర వారపత్రిక 5-12 జనవరి2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “మోడీకి మరో వైపు ఓవైసీ!

Leave a Reply