‘హంగే’ బెంగ!

బెంగ.

2012 లాగే 2014 కూడా ఉంటుందన్న బెంగ.

ఉప ఎన్నికల ఫలితాలే, సార్వత్రిక ఎన్నికల్లోనూ వస్తాయన్న బెంగ.

రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి బదులు మూడు ప్రాంతీయ పార్టీలు(తెలుగు దేశంతో పాటు, టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు) వచ్చేశాయన్న బెంగ.

2014 లో సీమాంధ్రలో త్రిముఖ పోటీ, తెలంగాణాలో చతుర్ముఖ పోటీ వుంటుందన్న బెంగ( బీజేపీ చతికిలపడింది. లేకుంటే పంచముఖ పోటీ వుండేది.)

అన్నింటినీ మించి రాష్ట్రంలో ‘త్రిశంకు సభ’ (హంగ్‌ అసెంబ్లీ) వస్తుందన్న బెంగ.

మిగిలి వారి కన్నా, పొరపాటున, ఎక్కువ సీట్లు వచ్చినా, స్వంతంగా సర్కారు ఏర్పాటు చేయలేనన్న బెంగ.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ వైపు జరిగిపోతుందేమోనన్న బెంగ.

కేంద్రంలో యుపీయే సర్కారుకు మద్దతు ఇచ్చే నెపం మీద, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా తిరిగి కాంగ్రెస్‌కు దగ్గరవుతుందేమోనన్న బెంగ.

మహరాష్ట్రలో నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలాగా, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ లాగా, ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో స్థిరపడిపోతుందేమోనన్న బెంగ.

సందట్లో సడేమియాలాగా 2014కు ముందే రాష్ట్ర విభజనకు కేంద్రం నిర్ణయం తీసుకుంటుందేమోనన్న బెంగ.

వీటితో పాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ తన మాట కాదని, రాజకీయాలలో ఎక్కడ స్వతంత్రంగా వ్యవహరిస్తారేమోనని బెంగ.

ఈ బెంగలనన్నింటినీ మించిన బెంగ ఒకటి వుంది: తన సమాజ వర్గం ప్రముఖులకు తన మీద విశ్వాసం సడలిందేమోనన్న బెంగ.

 

ఇన్ని బెంగల్ని కడుపులో పెట్టుకుని కూడా ధైర్యంగా తిరగగలుగుతున్న ధీరోదాత్తుడు నారా చంద్రబాబు నాయుడు.

ఆ ఒక్కటీ లేదు

ఆయనకు ముందు ఎన్టీఆర్‌, ఆయన తర్వాత వైయస్సార్‌. మధ్యలో ముఖ్యమంత్రిగా దాదాపు తొమ్మిదేళ్ళు పాలించారు. జనాకర్షణకీ, జనాకర్షణకీ మధ్య సుదీర్ఘ విరామంలో ‘నిద్రపోను. నిద్రపోనివ్వను’ అంటూ పాలన చేశారు. దేశ రాజకీయాలను చక్రం తిప్పారు. తాను ముఖ్యమంత్రిగా వుండి ప్రధాన మంత్రిని ఎంపిక చేశారు. ప్రపంచ బ్యాంకు దృష్టిలో పాలనా దక్షుడిగా
పేరొందాడు. ఆయనకోసం బిల్‌గేట్సూ, బిల్‌క్లింటన్‌లు దిగివచ్చారు. ఇంత మందిని ఆకర్షించిన నేత, ఎందుకనో రాష్ట్రంలోని సాధారణ పౌరుణ్ణి ఆకర్షించ లేక పోయారు. ఆకర్షణకు రెండో వైపే సానుభూతి.

జనాకర్షణ వున్న నేత మృతి చెందినా, మృత్యువు దగ్గర వరకూ వెళ్ళి బతికి వచ్చినా సానుభూతి పెల్లుబుకుతుంది.

వైయస్‌ ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందారు. రాష్ట్రమంతా సానుభూతి కట్టలు తెగింది. ఇది జరిగి రెండేళ్ళు దాటిపోయినా, ఇంకా సానుభూతి నడుస్తూనే వుంది. వివాదాల్ని పక్కన పెడితే ఆయనకు జరిగింది ప్రమాదమే.

కానీ, చంద్రబాబు నాయుడికి (2004లో) అలిపిరి వద్ద జరిగింది దాడి. ఏకంగా ఆయనను హతమార్చటానికి నక్సలైట్లు బాంబుప్రేలుడు చేసిన విఫల యత్నం. ఆ దాడినుంచి
గాయాలతో బయిట పడి ఎన్నికలలో పాల్గొన్నా, సానుభూతి పనిచెయ్యలేదు. ఇలాంటి విపత్తునుంచే ఏ ఎన్టీఆర్‌ లాంటి నేత బయిట పడి వుంటే ఎంతటి సానుభూతి వచ్చేదో ఊహించ
వచ్చు. సానుభూతి రాలేదంటే, జనాకర్షణ లేదనే చెప్పాలి.

అందుచేత ప్రధానమైన ఏ ఎన్నికల్లోనూ ఆయన స్వంతంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు రాలేదు. ఆయన తొలిసారి 1995లో ముఖ్యమంత్రి అయింది
ఎన్టీఆర్‌ ..మీద తిరుగుబాటు చేసి!( వైరి వర్గాల మీడియా ప్రకారం- వెన్నుపోటు పొడిచి). 1994లో ఎన్టీఆర్‌ జనాకర్షణ వల్లే తెలుగుదేశం తిరిగి అధికారంలోకి వచ్చింది. లక్ష్మీపార్వతిని
పెళ్ళిచేసుకుని, ఆమెతో పాటు రోడ్‌ షోలు చేసినప్పుడు పలువురు ఆక్షేపించారు. తెలుగుదేశానికి పరాజయం తప్పదనుకున్నారు. కానీ, జనం ఎలాంటి ఆక్షేపణ లేకుండా ఆహ్వానించారు.
తన వయసులో సగం వయసున్న స్త్రీని ద్వితీయ వివాహం చేసుకున్నాడన్నది ఎన్టీఆర్‌ మీద మచ్చగా పనిచేయలేదు. జనాకర్షణకుండే ప్రత్యేకత అది. అలా సాధించి పెట్టిన రాజ్యాన్నే
బాబు 1999 వరకూ ఏలుకున్నారు. మళ్ళీ1999లో ఎన్నికలు. అగ్ని పరీక్షే. కానీ కార్గిల్‌ యుధ్ధం పుణ్యమా అని ‘దేశభక్తి’కి మారకపు విలువ వచ్చింది. అప్పుడు కేంద్రంలో
వున్నది ఎన్డీయే సర్కారు కాబట్టి, బిజేపీ ‘దేశభక్తి’ని ‘హిందూత్వ’కు పర్యాయ పదంగా జనంలోకి తీసుకు వెళ్ళింది. ఆ బీజేపీ తో పొత్తుపెట్టుకుని చంద్రబాబు బయిట పడగలిగారు.
2004లో తిరిగి స్వశక్తిని ప్రదర్శించాల్సి వచ్చింది. చతికిల పడ్డారు. ఉద్యమమో, వాదమో, ప్రభంజనమో- ఏదీ లేనప్పుడు ‘జనాకర్షకనేత’ ఎన్నికలకు కేంద్రమవుతాడు. కానీ,
చంద్రబాబుకు లేనిదే ‘జనాకర్షణ’. అది 2009లో మరోసారి రుజువుయ్యింది. ఉపఎన్నికలలో పదేపదే రుజువుఅవుతోంది.

జనాకర్షణ అంటే, కేవలం సినిమా గ్లామర్‌ లాంటిది కాదు. ఏదో ఒక రాజకీయ కారణం వల్ల, జనం ఆరాధించటం మొదలు పెట్టాలి. ఎన్టీఆర్‌ కు మొదట సినిమా గ్లామర్‌
తో వచ్చారు. ఇదే రాజకీయప్రవేశానికి మాత్రమే ఉపయోగపడింది. కానీ, రాజకీయ జనాకర్షణ వచ్చింది- ‘కిలోరెండు రూపాయిల’ బియ్యంతో. చిరంజీవి కూడా సినిమా గ్లామర్‌తో
వచ్చారు. అది ప్రవేశానికి పనికొచ్చింది. కానీ రాజకీయంగా జనాకర్షణ పొందటానికి ఏమీ చెయ్యలేక పోయారు. వైయస్సార్‌ కు పాదయాత్ర ద్వారా గ్లామర్‌ వచ్చింది. ఆ గ్లామర్‌తో
ముఖ్యమంత్రి అయ్యారు. దానిని ‘ఉచిత విద్యుత్తు’ ‘ఆరోగ్యశ్రీ’ వంటి పథకాల ద్వారా రాజకీయ జనాకర్షణగా మార్చుకున్నారు.

ఇప్పుడు జగన్‌కు సానుభూతి రూపంలోనూ, కేసీఆర్‌కు ఉద్యమం రూపంలోనూ ఈ జనాకర్షణ సంక్రమించింది. జగన్‌ మీద అవినీతి ఆరోపణల పరంపర వచ్చినా,
ఆకర్షణను పెంచుతున్నాయే తప్ప తగ్గించటం లేదు.

వీరిద్దరినీ 2014లో ఎన్నికలలో చంద్రబాబు ఢీకొనాలి. అది కేవలం జనాకర్షణతో సాధ్యం. అది లేకనే రెండేళ్ళగా ఆయన అప్రధానమవుతూ వచ్చారు. 60 ఉప
ఎన్నికల సాక్షిగా ఆయనకు ఇప్పుడు ఎన్నికలంటే నిజంగానే ఎముకల్లో చలి పుట్టవచ్చు.

చంద్రబాబు ఎన్ని పాచికలయినా వేయవచ్చు; ఎన్ని వ్యూహాలయిన రచించ వచ్చు. కానీ తనకు తానుగా జనాకర్షణను తెచ్చుకోలేరు.

 

పార్టీకి బాబే మైనస్‌!

వాస్తవం చేదుగా వుండొచ్చు. కానీ ఆయనముందున్న అవకాశం ఒక్కటే, ఆయన తప్పుకుని తెలుగుదేశం పార్టీని-ఎవరయినా జనాకర్షక నేత చేతిలో పెట్టాలి. లేదా,
కేసీఆర్‌ తరహాలో జనమంతా ఊగిపోయే ఉద్వేగపూరితమైన ఉద్యమాన్ని సృష్టించాలి. రెండవ పని మరింత కష్టతరమయినది.

అలా కాకుండా, ఎన్ని కొత్త విధాన ప్రకటనలు చేసినా, ఆయనకు లేని ‘జనాకర్షక శక్తి’ రాదు.

అయితే, చంద్రబాబుకు అభిమానులే లేరని కాదు. ఐటీ, ఇతర ఉన్నత సాంకేతిక, మేనేజ్‌ మెంట్‌ చదువులు చదివే వారూ, ఒకటి రెండు సామాజిక వర్గాల
ప్రవాసాంధ్రులూ- ఆయన పేరు చెప్పగానే వెర్రెత్తి పోతారు. అబివధ్ధికి నిలువుటద్దం అంటారు. ఆయనే లేకుంటే ఇవాళ హైదరాబాద్‌ రూపు రేఖలు ఇలా వుండేవి కాదంటారు. హైటెక్‌ సిటీ
వుండేది కాదంటారు. కానీ ఈ వాదనలు చేసే వారు వోట్ల శాతం తక్కువ.

12 జూన్‌ 2012 నాటి పరిస్థితే 2014లోనూ యధాతథంగా కొనసాగక పోవచ్చు. ఇప్పుడున్న సానుభూతి పవనాలు మందగించ వచ్చు. కానీ వైయస్సార్‌
కాంగ్రెస్‌ పార్టీ ఒక స్థిరమైన ప్రాంతీయ పార్టీగా అయితే రంగంలో వుంటుంది. మూడు ప్రాంతీయ పార్టీలూ, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలలో తల పడ్డప్పుడు, ‘హంగ్‌’ అనివార్యమవుతుంది. ఈ
‘హంగ్‌’ లో తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఇతర పార్టీలు తక్కువ వుంటాయి. ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తాయంటే ఎంత చంద్రబాబు ఎంత భయపడుతున్నారో, ఈ హంగ్‌
వస్తుందంటే అంతకు రెండింతలు భయపడతారు.

ఒకప్పుడు దేశంలో ‘సంకీర్ణ’ రాజకీయాల్లో పండిపోయిన నేత చంద్రబాబు. కానీ, ‘హంగ్‌’ ద్వారా సంక్రమించిన ‘సంకీర్ణ రాజకీయాలు’ రాష్ట్రంలో ఇప్పటి వరకూ రాలేదు.
అవి వస్తాయంటే ఆయనకు దిగులుగా వుంది.

రాష్ట్రంలో ‘హంగ్‌’ నిజంగా వస్తుందా? అందుకు దాఖలాలు కనిపిస్తున్నాయా?

ఉద్వేగాల విషయంలో ఇప్పటికే రాష్ట్రంగా రెండుగా చీలివుంది. ఒకటి ‘సానుభూతి’కి నెలవుగా వున్న సీమాంధ్ర. రెండు: ఉద్యమానికి ప్రతిరూపంగా వున్న తెలంగాణ.
2014లో కూడా విభజన కొనసాగితే, ఏదో ఒక పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న హమీ వుండదు.

బీజేపీని మినహాయించినా రాష్ట్రంలో అన్ని చోట్లా త్రిముఖ పోటీలూ, చతుర్ముఖ పోటీలూ అనివార్యమవుతాయి. అప్పుడు మిశ్రమ ఫలితాలకు తావుంటుంది.

‘చేతి’ లో తురుపు ముక్క!

ప్రత్యేక తెలంగాణ విషయంలో ఇటు వైయస్సార్‌ కాంగ్రెస్‌, అటు టీఆర్‌ఎస్‌ సౌకర్యవంతంగా వున్నారు. తెలుగుదేశం పార్టీలాగానే వైయస్సార్‌ కాంగ్రెస్‌ తెలంగాణ
విషయంలో తేల్చి చెప్పక పోయినా, సీట్ల విషయంలో ఆశలన్నీ సీమాంధ్రలోనే పెట్టుకున్నారు. అయితే పరకాలలో తమ అభ్యర్థి గట్టిపోటీ ఇవ్వటం వల్ల ఇప్పుడిప్పుడే తెలంగాణ
విషయంలో కూడా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కానీ ప్రధానంగా సీమాంధ్రయే జగన్‌కు కంచుకోట. అలాగే టీఆర్‌ఎస్‌కు తెలంగాణయే సర్వస్వం. సీమాంధ్రవైపు కన్నెత్తి కూడా చూడదు.
రెండూ కావాలనుకున్న కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు ప్రధానమైన ఇబ్బంది. కానీ కాంగ్రెస్‌కు ఈ ఇబ్బంది ని అధిగ మించటానికి ఇంకా ‘తురుపు ముక్క’ తన చేతిలోనే వుంది.
కేంద్రంలో వున్న అధికారాన్ని ఉపయోగించుకుని, తెలంగాణ పై నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నిర్ణయంతో టీఆర్‌ఎస్‌ మద్దతు పొందవచ్చు. అలా పొందే క్రమంలో చంద్రబాబును పూర్తి
ఇరకాటంలో పెట్ట వచ్చు. ఒక వేళ వినిపిస్తున్న పుకార్లే నిజమయి, ‘రాయల తెలంగాణ’ ను ప్రకటిస్తే, చంద్రబాబు సీమలో వేరుగా, ఆంధ్రలో వేరుగా జగన్‌ను ఢీకొనాల్సి
వుంటుంది. కనీసం ఇలాంటి తురుపు ముక్క కూడా తెలుగుదేశంలో లేదు.

అదీకాక, శాసన సభ్యుల వలసలెలా వున్నా సామాజిక వర్గాలుగా జరగుతున్న వోటర్ల వలసలు ఇటు కాంగ్రెస్‌నూ, అటు తెలుగుదేశం పార్టీని ఇబ్బందికి
గురిచేస్తున్నాయి. సీమాంధ్రలో ఎస్సీలు, దళిత క్రైస్తవులు కాంగ్రెస్‌నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ కు వలసపోయారు. పీఆర్పీ విలీనం కారణంగా కాపులు కాంగ్రెస్‌కు వెళ్ళారు. ఎటొచ్చీ
తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన సామాజిక వర్గం లేక పోగా, ఆ పార్టీకి బాసటగా నిలిచిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలూ, వ్యాపారులూ చంద్రబాబు
నాయకత్వంలో తెలుగుదేశం పట్ల ఆశలు వదలుకుంటున్నారు. కేంద్రంలో వున్న యుపీయే పాలనపట్ల పాక్షికంగానైనా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వారి వైరి
వర్గమైన రెడ్లు కాంగ్రెస్‌ను ఖాళీ చేసి, వైయస్సార్‌ కాంగ్రెస్‌లో దాదాపు చేరిపోతున్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ కమ్మసామాజివర్గాన్ని ఆకర్షించే పని చేయవచ్చు. ఇలా చూసినా కూడా
చంద్రబాబు ఒంటరి అవుతున్నారు.

ఇక మామ కుటుంబానికి కున్న రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో బాలయ్యనూ, జూనియర్‌ ఎన్టీఆర్‌నూ దగ్గరకు తీసుకుంటున్నా, జూనియర్‌ ఎన్టీఆర్‌
కున్న స్వతంత్ర వైఖరి సైతం ఆయనను బాధిస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్‌ కుమార్తె పురంధేశ్వరి కాంగ్రెస్‌లో కీలకమైన స్థానంలో వున్నారు. అందుచేత కాంగ్రెస్‌ కమ్మ సామాజిక వర్గాన్ని
ఆమె ద్వారా ఆహ్వానించే వీలు కనిపిస్తోంది.

ఇప్పటికే ఏడేళ్ళు పైగా ప్రతిపక్షంలో వున్న తెలుగుదేశం పార్టీని మోస్తూ వస్తున్నారు. ఈ భారాన్ని ఎన్నికల వరకూ మోయాలి. ఎలాంటి ఆశలు లేని చోట శ్రేణుల్నీ,
ఇతర నేతల్నీ రక్షించుకోవటమూ కష్టమే. ఎలా చూసినా, ఇప్పుడు తెలుగు ‘చంద్రు’నికి నడుస్తున్నది శుక్ల పక్షమే!
-సతీష్‌ చందర్‌
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 22-29జూన్ 2012 సంచికలో ప్రచురితం)

 

 

 

 

Leave a Reply