‘ఆత్మ’ రాముడు నటిస్తాడా?

‘నమ్మరే, నేను ఏడ్చానంటే నమ్మరే!’

‘నమ్మరే, నేను నవ్వానంటే నమ్మరే!’

ఇలాంటి స్థితి సాధారణంగా నటులకొచ్చి పడుతుంది. వాళ్ళు ఏంచేసినా నటిస్తున్నారేమో- అని అనుమానం వస్తుంది. ఈ కష్టం అనుభవిస్తే కానీ తెలియదు. ఇద్దరు నటీనటులు ప్రేమించుకుంటున్నారనుకోండి.

‘నవ్వంటే నాకు ప్రాణం!’ తెలుసా అని నటీమణి అంటే,

‘ఎన్నో ప్రాణం డియర్‌!’ అని చటుక్కున నటుడు అనేస్తాడు.

తెర మీద ఇలా ఎన్నో సార్లు ఆవిడ ఇలాగే ‘ప్రాణం'(ప్రేమ) ఇచ్చేసి వుంటుంది. కడకు వాళ్ళ ప్రేమ పెళ్ళి వరకూ వచ్చేసి నటుడు మూడు ముళ్ళూ వేశాక ‘అన్ని మూడులూ వేశావా? రెండుతో సరిపెట్టేశావా?’ అని నటి కూడా అడిగేస్తుంది.

నటులకే ఎన్ని కష్టాలుంటే, రాజకీయ నాయకులకు ఎన్నికష్టాలుంటాయి. వాళ్ళలో సహజ నటులే ఎక్కువ వుంటారు. ముఖానికి రంగు కూడా లేకుండా, మాటలు ఎవరూ రాసివ్వ కుండా, గ్లిసరిన్‌ వగైరాల అవసరాలు లేకుండా, నవరసాలనూ అభినయించెయ్యగలరు. టీవీ కెమెరాలు ముందున్నాయంటే ఇక వారిని ఎవ్వరూ పట్టుకోలేరు. నవ్వులు కావాలంటే నవ్వులొచ్చేస్తాయి, ఏడుపులు కావాలంటే ఏడుపులు వచ్చేస్తాయి. అంతే కాదు. నవ్వే వాళ్ళని నాలుగు తిట్టాలంటే, తిట్లొచ్చేస్తాయి. ఏడ్చేవాళ్ళను ఊర్కోబెట్టాలంటే ‘ఓదార్పు’ లొచ్చేస్తాయి. పాలిటిష్యన్లు తలచుకోవాలే కానీ, ఏడ్చి మూడేళ్ళయిన వాళ్ళను కూడా, తాజాగా ఓదార్చెయ్యగలరు.

అందుకని రాజకీయ నాయకుడు ఏమి చేసినా అనుమానంగా వుంటుంది. హఠాత్తుగా వచ్చి వాటేసుకుంటే ‘దృతరాష్ట్ర కౌగిలే’మో అనిపిస్తుంది. కాళ్ళు పట్టేసుకుంటే లాగేస్తాడేమో అనినిస్తుంది. వెన్నుతడితే వెన్ను పోటేమో అనిపిస్తుంది.

ఉన్నట్టుండి కాంగ్రెస్‌ లో వున్న నేత (కాంగ్రెస్‌ మనిషి అయి వుంటారు లెండి.) కె.వి.పి రామచంద్రరావు బహిరంగంగా దు:ఖించారు. దు:ఖం ఆవేశమై, ఆవేశం ఆగ్రహమై కట్టలు తెగిపోయింది. ఎందుకూ? దివంగత నేత వైయస్‌ రాజశేఖర రెడ్డి గుర్తుకు వచ్చి. అవును. నిలువెత్తు మనిషి బొమ్మయ్యాడన్న ఊహే అయిన వాళ్ళకి దు:ఖాన్నిస్తుంది. రాష్ట్ర ప్రజలు ఆయన్ని నేడు అడుగడుగునా గుర్తుకు తెచ్చుకుంటారు. ఎందుకంటే అడుగడుక్కీ ఆయన బొమ్మలు(విగ్రహాలు) పెట్టేశారు. కాబట్టి, మరచి పోవటం ఎవరి తరమూ కాదు. అందరికీ బొమ్మ కనిపిస్తే వైయస్‌ గుర్తుకొస్తారు. కానీ, కె.వి.పికి వైయస్‌ బామ్మ లేకపోతే వైయస్‌ గుర్తుకొచ్చారు. ఒక కీలకమైన కాంగ్రెస్‌ సమావేశంలో వైయస్‌ బొమ్మ లేనందుకు ఆయన దు:ఖించారు. ఆయన దు:ఖాన్ని చూడలేక ఎదురుగా వున్న మంత్రి (రఘు వీరా రెడ్డి) కూడా కన్నీటి పర్యంతమయ్యారు.

ఇప్పుడు వీరిద్దరికీ ‘ఓదార్పు’ అవసరం. మరీ ముఖ్యంగా కె.వి.పికి అవసరం. వై.యస్‌కు కె.వి.పి బాగా సన్నిహితుడు. స్నేహానికి నిర్వచనం చెప్పాల్సి వచ్చినప్పుడెల్లా సినిమా రంగం నుంచి ‘బాపు-రమణ’లను ఉదహరించేవారు. కానీ వైయస్‌ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మరో ఉదాహరణ రాజకీయ రంగంనుంచి దొరికేసింది. ‘వైయస్‌-కె.వి.పి’లను ఆ రీతిలో కీర్తించటం మొదలు పెట్టారు.( వారికి ఇలాంటి స్నేహం దశాబ్దాల నుంచీ వుండవచ్చు. కానీ ఆ విషయం లోకానికి కాస్త అలస్యంగా తేటతెల్లమయింది.) ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో ఎప్పుడూ రెండు పాత్రలు కనిపిస్తుండేవి. ఒకటి ‘ఆత్మ’, రెండు ‘నీడ’. ఆత్మ- కె.వి.పి రామ చంద్ర రావు అయితే, నీడ-సూరీడు. కానీ పాపం. వైయస్‌ చివరిసారిగా హెలికాప్టర్‌ ఎక్కినప్పుడు మాత్రమే ‘ఆత్మ’నీ, ‘నీడ’నీ వదలేశారు. అలాంటి ‘ఆత్మ’, ‘నీడ’ మాత్రం- వైయస్‌ తనయుడు జగన్‌ పెట్టిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదు. కె.వి.పి అయితే కాంగ్రెస్‌కే విధేయుడిగా వుండిపోయారు. ఈ లోపుగా వైయస్‌ అభిమానులకు కోపతాపాలు రాగల పరిణామాలు చాలా జరిగిపోయాయి. అక్రమాస్తుల కేసు ఎఫ్ఫయ్యార్‌లో వైయస్‌ పేరు వున్నందుకు కొందరు శాసన సభ్యులు ఉగ్రులయిపోయారు. ఇలాంటివేమీ జరగనప్పుడు హఠాత్తుగా, వైయస్‌ బొమ్మ కనిపించక పోయేసరికి, దు:ఖం వచ్చేసింది.

నిజంగానే వచ్చి వుండవచ్చు. కానీ ఆయనకు దు:ఖం వచ్చినంత హఠాత్తుగా జనానికి నమ్మకం రాదు. తప్పు ఆయనది కాదు. రాజకీయానిది.

వెనకటికి తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నేత( బంగి అనంతయ్య) నటనను నిరసనకు వాడుకోవటం అలవాటు చేసుకున్నారు. అయితే ఆయన ఏ నిరసనకు తగ్గట్టు ఆ వేషం వేసే వారు. వింతల కోసం వెతికే మీడియాకు ఆ విధంగా ఆయన ప్రీతి పాత్రుడయ్యారు. వంట గ్యాస్‌ ధర పెంచితే, ఆయన సామాన్య గృహిణిలా చీర కట్టుకుని, జడలాంటి విగ్గు పెట్టుకుని, నడి రోడ్డు మీద కొచ్చి నిరసన తెలిపేవాడు. ఇలాంటివి ఎన్ని చేసినా తనకు సరయిన స్థానం కల్పించటం లేదంటూ బహిరంగంగా ఉరి వేసుకుంటానని ప్రకటించి, మెడకు ఉరి తగిలించేసుకున్నారు. అందరూ నటనే అనుకున్నారు. కడకు గిలగిల కొట్టుకుంటున్నప్పుడు కూడా అలాగే భ్రమ పడ్డారు. తర్వాత తేరుకుని ఆసుపత్రికి తరలించి రక్షించారనుకోండి.

అసెంబ్లీ సమావేశాల్లో అయితే, సభ్యుల నటన వర్ణణాతీతం. ఒక్క రసమా? రెండేసి మూడేసి రసాలు ఏక కాలంలో కలిపి నటించేయగలరు. నవరస నటనా సార్వభౌముడు ఎస్వీ రంగారావు జీవించి లేరు కానీ, విజిటర్స్‌ గ్యాలరీలో కూర్చొని, నటనను సరికొత్తగా నేర్చుకునే వారు. తెలుగు సినిమాలకు ‘ఆస్కార్‌’లు రావటం లేదని బాధపడితే ఏం లాభం చెప్పండి! సహజ నటులంతా చట్టసభల్లో వుండి పోయారు.

‘యధా రాజా, తథా ప్రజా’ అన్నారు. వీరి నటను చూసి, చూసి- జనం మాత్రం నటనను నేర్చుకోరా? ‘మీకే వోటేస్తాను’ అని పార్టీ అభ్యర్థి దగ్గర అయిదు వందలు నొక్కేసిన వోటరే, ‘రామ.రామ. మీకే వేస్తాను.ఒట్టు’ అంటూ అతడి ప్రత్యర్థి దగ్గర వెయ్యి పట్టేస్తాడు.

కాకుంటే నేతల నటన ‘కోట్ల’ కోసం, వోటర్ల నటన ఆ పూట కూటి కోసం!!

-సతీష్‌ చందర్‌

(ఆంద్రభూమి దినపత్రికలో 5 ఆగస్టు 2012 నాడు ప్రచురితం)

5 comments for “‘ఆత్మ’ రాముడు నటిస్తాడా?

 1. Nandiraju Radhakrishna
  August 5, 2012 at 7:05 pm

  మిత్రుడు హృదయంలో నిలిచిపోతాడు. తోడు కొంత కాలం వెంట ఉంటుంది. వెలుగు మాయమైతే నీడ కనుమరుగవుతుంది. సతీ సుతులు హితైషులు కాకపొవచ్చు. శత్రువూ శాశ్వతం కాదు. అయినా సరే వీరినందరినీ ఒకింత సహించవచ్చు.

  కానీ…. ఆత్మకు రూపం లేదు. ఆత్మకు వ్యక్తిత్వం, ఉనికి కూడా లేదు. శరీరాన్ని ఆశ్రయించాల్సిందే. ఏదో శరీరాన్ని ఆ…వహించి ఎవరికీ కనబడకుండా పనులు చక్క బెడుతుంది. ఆప్త మిత్రుడు, ఆప్తబంధువంటారు కానీ ఆత్మమిత్రుడనరు. దేహం పంచభూతాలలో కలసిపోగానే, కొన్నాళ్ళు ఆత్మ ఆచుట్టుపక్కలే సంచరించి క్రతువులు పూర్తయ్యాక ఉనికి కోసం మరో దేహాన్నిఅక్కడిక్కడే వెదుక్కోవలసిందే.

 2. Nandiraju Radhakrishna
  August 5, 2012 at 7:11 pm

  ఆర్పు, ఓదార్పు మధ్య ఎంత
వ్యత్యాసం. నవ్వులు, పువ్వులు అందరూ కోరుకుంటారు. నువ్వులు మాత్రం తర్పణానికే..అది ఫైనల్.. ఆతరువాత పని ఉండదు…

 3. August 5, 2012 at 7:51 pm

  రాజకీయ నాయకులు ” నాన్నా పులి ” కథను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది . కానీ గుర్తుంచుకుని ఏం లాభం , నటనలు చెయ్యకపోతే ఇంట్లో కూర్చోవాలి. పాపం

 4. aparna
  August 5, 2012 at 8:57 pm

  emotional ga ayyaru, kalla neellu pettukovadam, emito politics lo. Ayana vallu thyroid test cheyinchukovali.

 5. PV
  August 5, 2012 at 10:37 pm

  Voters pretend to believe the leaders. Subordinates do the same with their bosses

Leave a Reply