ఎంత ‘వోటు’ ప్రేమయో!

Photo by watchsmart

పక్షులన్నాక ఎగరాల్సిందే.
ప్రేమ పక్షులు ఇందుకు మినహాయింపు కాదు.
తుర్రున దూసుకు పోయే బైకు వుండాలే కానీ, ముందు ప్రియుడూ, వెనుక ప్రియురాలూ హత్తుకుని మరీ ఎగురుతుంటారు.
అది నెక్లెస్‌ రోడ్డా, అవుటర్‌ రింగ్‌ రోడ్డా- తర్వాత విషయం.
ఇలా ఎగరటానికి అలవాటు పడ్డ ప్రియురాలిని ఒక చోట కూర్చోబెట్టేస్తే ఏం చేస్తుంది?
‘రేయ్‌ ఈ కాఫీడేలో కూర్చోవాలంటే నాకు బోరు కొడుతోంది రా!’ అని ఒక ప్రియురాలు గారాబాలు పోతోంటే-
‘కాఫీ డే- కాక పోతే, టీ నైట్‌ వుంటుంది. అక్కడ కూర్చుందామా?’ అని ఊర్కోబెట్టాడు ప్రియుడు.
‘చంపుతాను- ఆ చావు వెటకారం ఆపక పోతే..! ముందు ఇక్కడనుంచి లేచి పోదాంరా ఇడియట్‌!.’
‘అప్పుడే- లేచిపోదాం- అంటే బాగుండదు. మన ఎఫైర్‌ మొదలయి రెండు రోజులు కూడా కాలేదు.’ నచ్చచెప్పబోయాడు.
అవును. రెండు రోజులకే ఆమె అంత చనువయిపోయింది. ‘ఒరేయ్‌’, ‘గిరేయ్‌’ అనటం మొదలు పెట్టేసిందా అమ్మాయి.
కొనుక్కున్నప్పుడు తన బండే ఫాస్ట్‌ అనుకున్నాడు. కానీ ఇప్పుడే అర్థమయింది. ఈ అమ్మాయి బండిని మించి ‘ఫాస్ట్‌’.
నిజం చెప్పాలంటే, వాళ్ళిద్దరిదీ ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ లిఫ్ట్‌’ బస్ట్‌ సాపులో బిడియంగా నిల్చున్న ఈ అమ్మాయిని ‘లిఫ్ట్‌ కావాలా?’ అన్నపిలుపులోని తియ్యదనానికి ఆమె పడిపోయింది… కాదు, వచ్చి బైక్‌ మీద పడిపోయింది.
కానీ, ఆ మురిపెం రెండు రోజులే నిలిచింది.
ఇప్పుడు, కదలకుండా, ఒక చోట కూర్చుని తీరిగ్గా కాఫీతాగుతూ ప్రేమించుకుందామని అతగాడంటూంటే, ఈమెకు ఒళ్ళు మండిపోయింది.
అంతే విసా, విసా నడుచుకుంటూ వెళ్ళి ఎప్పటిలాగే బస్‌స్టాప్‌లో నిలుచుండి పోయింది. అయినా సరే బైక్‌ తీయదలచుకోలేదు ప్రియుడు.
జజజ జజజ జజజ
భార్యా, భర్తలిద్దరికీ ఆదివారం అంటే, ఆదివారం కాదు. కేవలం అవుటింగ్‌ వారం.
భార్య అయితే ఆ రోజుకోసం అయిదు పగళ్ళూ, అయిదు రాత్రిళ్ళూ సీరియల్‌ కలలు కంటుంది. వెనకటి కాలపు సీరియల్‌లోగానే, తన భర్త సాంత్రో కారును స్టీరింగ్‌ను ఒక చేత్తో విలాసవంతంగా తిప్పుతూ, ఇంకో చేత్తో సిగరెట్టును కాలుస్తూ, పొగను రింగు రింగులా వదలుతూ వున్నప్పుడు, అలా ఆమె అతని భుజం మీద వాలిపోతూ టాంక్‌ బండ్‌ మీద రైడ్‌ విహారం చేస్తుంటే, హుస్సేన్‌ సాగర్‌ కంపు కూడా ఇంపుగా వుంటుంది.
అందుకే తన భర్త నోరుతెరిచి అడక్కపోయినా, అడిగినట్టు తన తండ్రితో చెప్పి వరకట్నం కింద కొనిపించి పెట్టిన ఇల్లాలు ఆమె.
అందుకనే ఆమె అసలు పేరు చారుమతి అయినప్పటికీ, భర్తే ప్రియంగా ‘కారు’మతీ అనిపిలిచే వాడు. పెళ్ళయిన రెండు నెలల్లో అన్ని ఆదివారాలూ ఇలాగే గడిచాయి. కానీ ఇదుగో ఈ మూడోనెలలో మొదటి ఆదివారమే, ‘చారు మతీ’ అని పాత పిలుపు మొదలు పెట్టేశాడు భర్త.
అంతే కాదు. ‘నువ్వలా హంసలా నడస్తూ వుంటే, నీ వెనకాల చూస్తూ నడవాలని వుంది ఈ రోజు’ అంటూ పాదయాత్ర చేయించాడు.
‘కారు’ మతికి కోపం రాదూ..!
పుట్టింటికి పోతానంది. కంగారు పడాల్సిన పనిలేదు. ఇద్దరిదీ హైదరాబాదే లెండి.
‘అలాగే డాళింగ్‌! ఎంఎంటిఎస్‌ రైల్లో డ్రాప్‌ చేస్తాను.’ అన్నాడు తప్ప, కారులో డ్రాప్‌ చేస్తానని మాట వరసక్కూడా అనలేదు.
ఇంకా కోపం వచ్చేసింది ‘కారు’ మతికి. కోర్టుకు పోయి విడాకులు పుచ్చేసుకుందామంది.
‘కోర్టుకా? ఎన్నో నెంబరు బస్సు వెళ్తుంది..?’ అన్నాడు భర్త.
జజజ జజజ జజజ
చూశారా? అక్కడ ప్రియురాలికన్నా బైకూ, ఇక్కడ భార్య కన్నా కారూ ‘ప్రియమ’యి పోయాయి!
అతడికీ బైకూ, ఇతడికీ కారూ బేవార్సుగా వచ్చినవే. బైకు బాబు గిఫ్టు అయితే, కారు మామ గిఫ్టు.
బళ్ళంటే ఉచితంగా వచ్చాయి అందుకే అంత ప్రియం.
బళ్ళకన్నా వాటిల్లో పోసే పెట్రోలు ప్రియాతి ప్రియం.
రెండు నెలలకోసారి సర్కారు పెట్రోలు మీద వడ్డించుకుంటూ వెళ్ళిపోతే, ఇలాగే ప్రేమలు భగ్నమయిపోతాయి, పెెళ్ళిళ్ళు పెటాకులయిపోతాయి.
మనసిచ్చి తెచ్చుకున్న ప్రియుణ్ణీ, కట్నమిచ్చి కట్టుకున్న భర్తనీ వదలించుకన్న దానికన్నా పెద్ద పని కాదు, వోటిచ్చి నెత్తిన పెట్టుకన్న సర్కారును దించెయ్యటానికి…!!
-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రిక 6-11-2011 సంచికలో ప్రచురితం)

Leave a Reply