‘మర్యాదస్తుల’ కోపాలకీ ‘కోటా’లుంటాయా?

అత్యాచారాలు ఈ దేశానికి కొత్త కాదు; దేశరాజధాని ఢిల్లీకి కూడా కొత్తకాదు. అందుకే ఇంకో పేరుతో కూడా ఆ నగరాన్ని పిలుస్తారు: ఈ దేశపు అత్యాచార రాజధాని (‘రేప్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’). ఎన్నో అత్యాచారాలు జరిగినా, ‘నిర్భయ’ పై జరిగిన సామూహిక అత్యాచారం దేశాన్ని కుదిపివేసింది. దేశంలోని చదువుకున్న యువతీయువకులు ఆగ్రహోదగ్రులయిపోయారు. అదే ఢిల్లీ నగరంలోని పాత నంగల్‌లో అత్యాచారం జరిగింది. అత్యాచారమే దారుణం కదా! అసాధారణమే కదా! కానీ ఈ 3 ఆగస్టు 2021 జరిగిన ఈ ఘటన దారుణాతి దారుణం. ఒక్క అసాధారణత వుంటేనే వార్తయిపోతుంది. అలాంటిది ఈ ఘటనలో పది అసాధారణతలు వున్నాయి:

ప్రధాన నిందుతుడు పూజారి రాధే శ్యామ్

ఒకటి: ఈ బాలికకు తొమ్మిదేళ్ళే.
రెండు: ఈమె దళిత కుటుంబంలో పుట్టింది;
మూడు: ఒకరు కాదు, ఏకంగా నలుగురు అత్యాచారం చేశారు;
నాలుగు: ప్రధాన ముద్దాయి పూజారి;
అయిదు: సంఘటనా స్థలం శ్మశానవాటిక,
ఆరు: అత్యాచారం తర్వాత బాలిక ప్రాణంతో లేదు.
ఏడు: మృత దేహాన్ని అదే శ్మశాన వాటికలో దహన పరచారు.
ఎనిమిది: ఈ దహనం కూడా బాలిక తల్లిని ముందు పెట్టి చేశారు.
తొమ్మిది: అత్యాచార ప్రధాన నిందితుడే దహనసంస్కారం నిర్వహించాడు.
పది: ఫిర్యాదు చెయ్యటానికి వెళ్ళిన బాలిక తల్లిదండ్రుల్ని 15 గంటల పాటు స్టేషన్‌ దగ్గర వుంచారు.

నిజానికి ఇది అతి పెద్ద వార్త కావాలి. స్థానిక, ప్రాంతీయ, జాతీయ మాధ్యమాల్లో రావాలి. ‘టాప్‌ స్టోరీ’ కావాలి. అయ్యిందా? అయ్యింది. కానీ దేశం వెలుపల ‘బీబీసీ’ లాంటి ప్రపంచ మాధ్యమాల్లో. ఈ ఘటన జరిగిన వివరణ ఇస్తే, విని కొందరు తట్టుకోలేక పోవచ్చు- అన్న ముందస్తు హెచ్చరికతో మరీ ప్రచురించారు. దేశంలోనూ కొన్ని మాత్రమే డిజిటల్‌ మాధ్యమాలు ఈ వార్తను వెల్లడించాయి.

ఒకే రకం దారుణానికి ఒక స్థాయి కోపం రావాలన్న రూలు లేదు. మరీ ముఖ్యంగా చదువుకున్న మధ్యతరగతి(‘మర్యాదస్తుల’) వర్గం విషయంలో ఈ హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఇదే ఢిల్లీలో, అప్పటి ‘నిర్భయ’ అత్యాచారానికి వచ్చిన స్థాయి ఆగ్రహం సరే, కనీసం హైదరాబాద్‌ లో జరిగిన ‘దిశ’ అత్యాచారానికి వచ్చిన కోపం కూడా రాలేదు. ‘దిశ’ అత్యాచారం విషయంలో అయితే, చదువుకున్న మధ్యతరగతి వర్గం వారు వీధుల్లోకి వచ్చి అత్యాచార నిందితులను ‘ఎన్‌కౌంటర్‌’ చెయ్యాలన్నారు. వారం తిరగకుండానే వారి కోరిక నెరవేరి పోయింది. నిందితులు పోలీసు ‘ఎన్‌కౌంటర్‌’లో మరణించారు. ఈ ‘ఎన్‌కౌంటర్‌’ కేసు కోర్టు విచారణలో వుంది కూడా.

ఈ దళిత బాలిక అత్యాచారం కేసులోనూ నిందితులను ‘ఉరితియ్యాలి’ అని ప్లకార్డులు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చారు. వీరిలో చదువుకున్న మధ్యతరగతి వర్గం వారు బహుస్వల్పం. మళ్లీ ఆ బడుగు వర్గాలే ముందుకు వచ్చారు. అధిక భాగం స్థానికులే. కానీ నిర్భయ ఘటనకు అలా కాదు. దేశం నలుమూలలనుంచి చదువుకున్న యువతీ యువకులు ఢిల్లీని ముట్టడించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం స్పందించి, జస్టిస్‌ వర్మ ఆధ్వర్వ్యం లో కమిషన్‌ వేసి, నిర్బయ బిల్లును తయారు చేసి, ఆఘమేఘాల మీద చట్టం చేసింది.

అత్యాచారం వేదిక శ్మశాన వాటిక

కావచ్చు. ఆమె ఒకానొక బాలికే కావచ్చు. ‘ఈ బాలిక కూడా ఈ దేశ పుత్రికే’ (ఇండియాస్‌ డాటర్‌). పురస్కారాలు తెచ్చిపెట్టే ఆడపిల్లలే కాదు, అత్యాచారాలకు గురయ్యే ఆడబిడ్డలూ ఈ దేశ పుత్రికలే కదా! ‘నిర్భయ’ అత్యాచారం మీద డాక్యుమెంటరీ తీసిన లెస్లీ ఉడ్‌విన్‌ ‘ఇండియాస్‌ డాటర్‌’. కాకపోతే, ఈ డాక్యుమెంటరీని ఇండియాలో నిషేధించారు. అది వేరే విషయం.

ఈ దళిత బాలిక తల్లి దండ్రులు చెత్త ఏరుకుని జీవిస్తారు. ఈ శ్మశాన వాటికకు కూత వేటు దూరంలో పూరింటిలో వుంటారు. నడచి వెళ్ళితే అయిదు నిమిషాలు. మధ్యాహ్నం పూట పక్కనే వున్న పీర్‌ బాబా దర్గా దగ్గర ఆడుకుని వస్తానని తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళబోయింది ఆ బాలిక. ‘అలాగే వెళ్దువు గానీ, ముందు శ్మశానవాటిక లో వాటర్‌ కూలర్‌ వుంటుంది కదా, అక్కడ నుంచి చల్లటి నీళ్ళు తెచ్చిపెట్టు.’ అన్నారు తల్లి దండ్రులు. అంతే, ఆతర్వాత బాలిక రాలేదు. కానీ కబురు వచ్చింది. అది కూడా బాలిక తల్లికి. శ్మశాన వాటిక నుంచే కబురు పెట్టింది పూజారి రాధే శ్యామ్. ఇతడికి వయసు యాభయి యేళ్ళు పైన వుంటాయి. తీరా ఆ తల్లి వెళ్ళి చూస్తే, తన కూతురు శవమై పడివుంది. పెదవులు నీలి రంగులో వున్నాయి; ముంజేతుల మీదా, మోచేతి మీదా కాలిన మచ్చలున్నాయి; ముక్కు నుంచి రక్త కారిన చారికలున్నాయి. తల్లి కుప్పకూలిపోయింది. వాటర్‌ కూలర్‌ షాక్‌ కొట్టి చనిపోయిందని చెప్పాడు పూజారి. అంతే కాదు. ఈ విషయంలో పోలీసులకు చెప్పవద్దాన్నాడు. వాళ్ళు వస్తే మృతదేహంలోని అవయవాలను అమ్మేసుకుంటారన్నాడు. తానే మూడోకంటికి తెలియకుండే, అదే శ్మశాన వాటికలో దహన పరుస్తానని చెప్పి, చితి పేర్చేసి, నిప్పంటించాడు.

ఆమె గుండెలు బాదుకుంటూ ఇంటికొచ్చి, కుప్ప కూలిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆరా తీశారు. అందరూ కలసి శ్మశాన వాటికకు వెళ్ళారు. పూజారి రాధేశ్యామ్ ను నిలదీసి అడిగితే ‘అత్యాచారం చేసి, చంపినట్టు’గా ఒప్పుకున్నాడని, బాలిక తల్లి చెప్పింది. అంతే కాదు. ఈ ఘోరకృత్యాలు చేసింది అతడు ఒక్కడే కాదని, 48 యేళ్ళ లక్ష్మీ నారాయణ్‌ అనే పెయింటరూ, పూజారికి శ్మశానవాటికలో సహాయకుడుగా వుండే 49 యేళ్ళ మహ్మద్‌ సలీం, 63 యేళ్ళ కులదీప్‌ కుమార్‌ వున్నారని కూడా వెల్లడించాడు.

అయితే ఈ విషయమై ఫిర్యాదు చెయ్యటానికి ఢిల్లీ కంటోన్మెంటు పోలీసు స్టేషన్‌కు బాలిక తల్లిదండ్రులు వెళ్ళితే, వారు కేసు నమోదు చెయ్యటానికి నిరాకరించారు. సరికదా, ఓ పదిహేను గంటల సేపు, వారిని స్టేషన్‌ దగ్గరే తిండీ తిప్పలు లేకుండా వుంచేశారు. కడకు ఫిర్యాదు జాతీయ మానవహక్కుల కమిషన్‌ దృష్టికి వచ్చాక కానీ, పోలీసులు ఈ కేసును ‘దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం’గా గుర్తించలేదు.
చెత్త యేరుకునే ‘అస్పృశ్య కులానికి’ చెందిన బాలిక కాబట్టే కేసు కట్టటంలో జాప్యం జరిగిందా? అదే నిజమైతే పోలీసు వ్యవస్థలో వున్న లోపం అని సరిపెట్టుకోవచ్చు. కానీ చదువుకున్న మధ్యతరగతి యువతీ యువకులకు ఈ ఘటన పెద్దగా పట్టినట్టు లేదు. ‘ముఖ పుస్తకాలు’ ‘ట్విట్టర్ల’లో ఈ బాలిక ఒక్క సానుభూతి వాక్యానికి కూడా నోచుకోదా?

-సతీష్ చందర్ 

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 7-14 ఆగస్టు 2021 సంచికలో ప్రచురితం)

1 comment for “‘మర్యాదస్తుల’ కోపాలకీ ‘కోటా’లుంటాయా?

Leave a Reply