‘అబ్బోయ్’- ‘బాబోయ్’

కొంపన్నాక, కుటుంబం వుంటుంది. కుటుంబం అన్నాక కొన్ని వరసలుంటాయి. ఆ వరసల్లో కూడా రెండు రకాలుంటాయి:పడిచావని వరసలూ, పడి చచ్చే వరసలూ.

అత్తా-కోడలు. వామ్మో! నిప్పూ- గ్యాసూ అన్నట్లు లేదూ? అఫ్‌కోర్స్‌! కోడల్ని వదలించుకోవటానిక్కూడా అత్త ఈ వస్తువుల్నే వాడుతుందనుకోండి!

మామా-అల్లుడు. ఇదీ అంతే. అప్పూ- పప్పూ లాంటిది. మామ అప్పు చేస్తే, అల్లుడూ పప్పుకూడు వండిస్తాడు.

ఇవి పడని వరసలు.

మరి పడే వరసలో..? ప్రతిపక్షాలను తిరగేస్తే సరి. అత్తా-అల్లుడు, మామా-కోడలు ‘అల్లం-వెల్లుల్లి’ మసాలా కలిసిపోతారు. పడే వరసలు మరి.అందుకే వీరిని చూస్తే, అవతల పార్టీ వాళ్ళకి నషాళానికి ఎక్కుతుంది.

కొన్ని వరసలుంటాయి. ‘ఇంటర్వెల్‌'(పెళ్ళి)కి ముందు ఒకరి కొకరు పడిచస్తారు. ఇంటర్వెల్‌ తర్వాత కొట్టుకు చస్తారు. వాళ్ళే బావా-మరదళ్ళు. పెళ్ళికి ముందు- బావా, బావా పన్నీరు. పెళ్ళయ్యాక- బావా, బావా ‘కన్నీరు’. ఒక్క సారి మొగుడూ-పెళ్ళాలయ్యాక, కొట్టుకు చావటం తప్ప, పడి చావటం వుండదు కదా!

ఇవన్నీ సాధారణ కుటుంబాలలోని సంగతి. ఇవి కాక, కొన్ని అసాధారణ కుటుంబాలుంటాయి. అవే రాజకీయ కుటుంబాలు. ఎన్టీఆర్‌ కుటుంబమూ, చిరంజీవి కుటుంబమూ, వై.యస్‌ రాజశేఖరెడ్డి కుటుంబమూ- ఇలాగన్న మాట.

వీటిల్లో కూడా పడిచావని ఒక ప్రత్యేకమైన వరస వుంది. అదే ‘అబ్బాయి-బాబాయి’ వరస.

జూనియర్‌ ఎన్టీఆర్‌- బాలయ్య; చరణ్‌- పవన్‌; జగన్‌- వివేకా- వీళ్ళే ఇటీవలి కాలంలో పేరొందిన ‘అబ్బాయ్‌-బాబాయ్‌’లు. అయితే వీళ్ళ గొడవలు- రేయీ-పగలు లాగా, వెన్నెలా- అమావాస్య లాగా, శుక్లపక్షం- కృష్ణపక్షం లాగా…, వస్తుంటాయి, పోతుంటాయి. వీరి మధ్య శాశ్వతంగా ‘అయోధ్యా’ వుండదు, సయోధ్యా వుండదు. అలాగని శాశ్వత పరిష్కారాలు వుండవు (అయోధ్య కు ఎలాగూ వుండవు కదా!). వీరు విడిపోయి వున్నప్పుడు కన్నా, కలిసి వున్నప్పుడు ఉద్రేకంగా వుంటారు. మధ్యలో దూరిన ‘మీడియా’ను దుమ్మెత్తి పోస్తారు. ఒకరి నొకరు తీవ్రాతి తీవ్రంగా పొగిడేసుకుంటారు. పక్కటెములు విరిగేటంత గాఢంగా కౌగలించేసుకుంటారు. ‘మా ఇద్దరి శరీరాలు వేరయినా, ప్రాణం ఒక్కటే’ అన్న రీతిలో ఒట్లు పెట్టేసుకుంటారు. ‘ఒకే మాట-ఒకే బాట’ అని బాసలు చేసేసుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు మళ్ళీ మామూలే- ‘నోటితో నవ్వులూ, నొసటితో వెక్కిరింతలూ.’

‘అబ్బాయ్‌- బాబాయ్‌’ అనే రాజకీయ వరసలో ‘పడకపోవటానికి’ కారనాలు రెండు.

మొదటిది వారసత్వం. అటునుంచి నరుక్కొస్తే.. అబ్బాయ్‌ కూత పట్టక ముందే బాబాయ్‌ రంగంలో వుంటాడు. కాబట్టి, తండ్రి నీడ బాబాయ్‌ మీద ముందు పడుతుంది.

రెండవది పుత్రవాత్సల్యం. కొడుకుని ప్రేమించటంలో ధృతరాష్ట్రుడి రికార్డు బద్దలుకొట్టేసే వాళ్ళే రాజకీయాల్లో ఎక్కువ మంది వుంటారు. అందుకు మహానేతలూ, మహామహా నేతలూ మినహాయింపు కారు.

ఎన్టీఆర్‌ని తీసుకోండి. మనవడికి(జూనియర్‌కి) తన పేరయితే ఇచ్చారు కానీ, ఒక ‘బలహీనమైన’ క్షణంలోనో, ‘బలవంతపు’ క్షణంలోనో- ‘బాలయ్యే(కొడుకే) నా వారసుడనేశారు. కానీ తీరా ప్రచారం దగ్గరకు వచ్చేసరికి, బాలయ్య తో సమానంగా జూనియర్‌ 2009 ఎన్నికలప్పుడు ‘దుమ్ము’ దులిపేశారు. దాంతో సహజంగానే ఇద్దరి మధ్యా అంతరం వస్తుంది. ఈ అంతరాన్ని కూడా తనవైపు తిప్పుకోగలిగి సమర్ధుడు చంద్రబాబు అనుకోండి. అది వేరే విషయం. ఈ అంతరాన్ని ఒక్క (వంశీ-జగన్‌ల)’కౌగలింత’ మరింత పెంచింది. అబ్బాయికి మిత్రుడయన వంశీ, శత్రుశిబిరం లోని వ్యక్తి కౌగలించవచ్చునా? ఇదీ పంచాయితీ. ఇప్పుడు పరిష్కారమయిపోయిందనుకోండి.

ఇక చిరంజీవికి తమ్ముడు( పవన్‌ కళ్యాణ్‌), కొడుకు (చరణ్‌)- ఇద్దరూ రెండు కళ్ళు లాంటి వారు. చంద్రబాబుకి సీమాంధ్ర- తెలంగాణలు ఎలా రెండు కళ్ళయ్యాయో అలాగన్న మాట. పోలిక సరయినదే. రెండు కళ్ళూ కలిసి మొత్తం ప్రపంచాన్ని చూడగలవు. కానీ ఒక కన్ను మరొక కన్నును మాత్రం చూడలేవు, చూసి భరించ లేవు. పవన్‌ ఫంక్షనప్పుడు చరణ్‌కు అర్జెంటు పనిపడుతుంది. చరణ్‌ ఫంక్షన్‌ అప్పుడు వపన్‌కు ఇంకా పెద్ద పని పడుతుంది. నాన్న (చిరంజీవి) కూడా ‘పొరపాటులో -అలవాటు’ లాగా, ‘పవన్‌ అనటానికి బదులు చరణ్‌’ అంటుంటారు. అంటే తమ్ముడిలోనూ కొడుకును చూసుకుంటారు.(మరి కొడుకులో తమ్ముణ్ణి చూడగలరా?)

ఇక జగన్‌- వివేకాలది అంతే. వైయస్‌ జీవించి వుండగా వివేకా ‘జగన్‌’ కోసం ఏమయినా చేసేవారు. పక్కకు తప్పుకుని నియోజవర్గాన్ని ఇచ్చే వారు. కానీ, వైయస్‌ చనిపోయాక- తన మీద కూడా వైయస్‌ వారసత్వం వుందనుకుని భూమి చుట్టూ తిరిగి వచ్చారు . భూమి ఎంత పెద్దదయినా తిరిగి పులివెందుల దగ్గరకే వచ్చారు. జగన్‌ చెంతకే చేరారు. పాపం! భూమి గుండ్రం – అనే చిన్న సత్యాన్ని నమ్మటానికి నిజంగానే కాంగ్రెస్‌ను చుట్టివచ్చారు. ఇప్పుడు అబ్బాయ్‌ ‘జగన్‌’ తో కలిశారు. అయోధ్య పోయి సయోధ్య నడుస్తుందిప్పుడు. ఎన్నాళ్ళు? అంటే చెప్పలేం. ఇప్పుడు నడుస్తున్నది శుక్ల పక్షం. నాన్న ఆస్తిలోనే కాదు, ఆకర్షణలో కూడా ‘బాబాయ్‌’ కన్నా, ‘అబ్బాయ్‌’ కే సింహ భాగం వస్తోంది.

దాదాపు జనాకర్షక నేతలు అందరూ ఇలాగే చేస్తారు. కావాలంటే వారిని గిచ్చి చూడవచ్చు. ‘అయ్యో! బాబో!’ అనరు. ‘అబ్బాయోయ్‌! బాబాయోయ్‌!’ అంటారు.

-సతీష్‌ చందర్‌

 

 

 

 

2 comments for “‘అబ్బోయ్’- ‘బాబోయ్’

Leave a Reply