అభద్రం కొడుకో!

tirumala‘నేను ఇక్కడ అభద్రంగానే వున్నాను. నువ్వు కూడా అభద్రంగా వుంటావని భావిస్తాను’

ఉత్తరాలు రాసినా వెళ్తాయో, లేదో, తెలియదు కానీ, ఒక వేళ తెలంగాణలో వున్నవారు, సీమాంధ్రలో వున్నవారికీ , సీమాంధ్రలో వున్న వారు తెలంగాణలో వున్నవారికీ రాయాల్సి వస్తే, ప్రారంభ వాక్యం ఇలా వుంటుంది.

ఇంతకీ అభద్రత అంటే ఏమిటో..?

ఎవరికి వారు ఎంచక్కా సినిమాలకు వెళ్తున్నారు. షికార్లకు వెళ్తున్నారు. పేరంటానికి వెళ్తున్నారు. తిరిగి ఇళ్ళకు కూడా భద్రంగానే వెళ్తున్నారు.

కానీ ఏ ప్రాంతంలో ఉద్యమం జరుగుతుంతో, ఆ ప్రాంతపు ఎమ్మెల్యేలూ,ఎంపీలూ మాత్రం తమ ఇళ్ళకు వెళ్ళటానికి కొంత అభద్రత ఫీలవుతారు. తెలంగాణలో ఉద్యమం ఉధ్ధృతంగా వున్నప్పుడు, తెలంగాన నేతలు తమతమ ఇళ్ళకు వెళ్ళటానికి భయపడేవారు. ఇప్పుడు ఈ స్థితి సీమాంధ్రలోవుంది. ఒక వేళ వెళ్ళాలంటే, వీరోచితంగా రాజీనామా పత్రాన్ని రాసి, స్పీకర్లకో, గవర్నర్లకో పంపి రావాల్సివుంటుంది.

కానీ నేతలు ఏంచేస్తారంటే, తమకున్న అభద్రతను- ప్రజల అభద్రతగా చిత్రిస్తుంటారు.

hyderabad.హైదరాబాద్‌లోనూ, ఇతర తెలంగాణ జిల్లాల్లోనూ వుంటున్న సీమాంధ్ర వాసులకు భద్రత లేదని అంటూ వుంటారు.

రెండుప్రాంతాలు కలిసి, ఒక రాష్ట్రంగా ఏర్పడి దాదాపు అరు దశాబ్దాలు కావచ్చు. ఈ ఆరు దశాబ్దాలలో, రెండు ప్రాంతాల రాజకీయాలు కలవక పోవచ్చు, అభివృధ్దిలో హెచ్చు తగ్గులు వుండవచ్చు. కానీ రెండు ప్రాంతాల మథ్యా ‘వియ్యాలు’ పెరిగాయి.

మన దేశంలో వియ్యాలకు ‘కులమూ’ గోత్రమూ’ అడ్డొచ్చినట్టుగా, ప్రాంతం పెద్దగా అడ్డురాదు. ఏదో ఇలా ఉద్యమాలు చెల రేగిపోయినప్పుడు ‘నువ్వు ఏ ప్రాంతం వాడివి’ అన్న ప్రశ్న వస్తుంది కానీ, మిగిలిన సందర్భాలలో సహజంగా వేసే ప్రశ్న ‘మీరేవుట్లూ?’ అనే. కాబట్టి ‘స్వకుల వివాహాలే’, ప్రాంతేతరంగా జరిగిపోయాయి. హైదరాబాదే తీసుకోండి. కుటుంబం సీమాంధ్ర ప్రాంతానికి చెందిందే కావచ్చు. వారికి తెలంగాణ ప్రాంత బంధువులు వుంటారు. కారణం ఈ వియ్యమే. అలాగే, తెలంగాణ కుటుంబాలలో సీమాంధ్ర బంధుత్వాలూ వుంటాయి.

మన దేశంలో ‘కులం’ హ్రస్వ రూపం ‘కుటుంబం’లో కనిపిస్తుంది. ఇలా ప్రాంతేతర వియ్యాలు అందుకోవటంలో చొరవ చూపించిన వారు రాజకీయ నాయకులు వున్నారు; పారిశ్రామిక వేత్తలు కూడా వున్నారు.

ఇక ప్రేమ వివాహాలంటారా? ఐటీ రంగం పెరిగాక ఈ వివాహాలు కూడా పెరిగాయి. అరేంజ్డ్‌ మేరేజ్‌ కయితే ‘కులమూ, గోత్రమూ’ కలవాలి. కానీ, ప్రేమవివాహానికి అలా కాదు. కులం, గోత్రం తో పాటు, ఆర్జన కూడా కలవాలి. నెలకి అతడికో లక్ష, ఆమెకో లక్ష వస్తుందనుకోండి. ప్రేమ కూడా ‘లక్ష’ణంగా ఏర్పడిపోతుంది. అలాంటప్పుడు వీరికి ప్రాంతం, ససేమీ అడ్డురాదు. అలాగే తేడాపాడాలు వచ్చి విడిపోదామనుకున్నప్పుడు కూడా ‘ప్రాంతం’ అడ్డురాదు.

ఇలా ఇన్ని రకాల ‘ఇచ్చిపుచ్చుకోవటాలు’ రెండుప్రాంతాల మధ్యా జరిగిపోయాక, ఇక్కడ ఎవరు ఎవరు మీద దాడి చేసినా, తమ బంధువులకు తగిలే అవకాశం వుంది. ఎప్పుడో యాభయ్యేళ్ళ క్రితం జరిగిన ‘ముల్కి’ (స్థానికుడు) ‘నాన్‌ ముల్కి’ (స్థానికేతరుడు) అన్న వివాదాలు ఇప్పుడు కష్టం. ‘స్థానికేతరుడు’ సైతం ‘కుటుంబేతరుడు’ కాని పరిస్థితి. అందుచేత ఉద్యమం ఎంత ఉధ్ధృతమైనా అది చచ్చినట్టు శాంతియుతంగానే జరగాలి. మరో మార్గం కూడా లేదు.

కానీ ‘అభద్రత’ నటించటం ఇరు ప్రాంతాల నాయకులకూ రాజకీయావసరమయి పోయింది. లేని ప్రేమను ప్రకటించటం, ఎంత కష్టమో, లేని పగను కూడా నటించటం అంతే కష్టమవుతుంది. తెలంగాణలో భాగంగా హైదరాబాద్‌ వుంటే, ఇక్కడ వుండే సీమాంధ్రులకు రక్షణ లేదని ‘సమైక్యాంధ్ర’ ఉద్యమ కారులూ, అలాగే ‘హైదరాబాద్‌లో’ సీమాంధ్రులు వుండిపోతే, మొత్తం తెలంగాణకే భద్రత కరవుఅవుతుందని ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కారులూ ప్రకటనలు గుప్పిస్తుంటారు.

ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నది ప్రభుత్వం కాదు, మార్కెట్టు.

బయిటకు చూపించే తగాదా అంతే ప్రభుత్వోద్యోగులు తగాదా. కానీ ప్రయివేటు రంగంలో ఉపాధి పొందేవారే హైదరాబాద్‌లో ఎక్కువ. హైదరాబాద్‌ అభివృధ్ధి అంటే, ఇక్కడ వ్యాపారాభివృధ్ధి. ప్రయివేటు సంస్థల వాళ్ళూ, కార్పోరేట్‌ రంగం వాళ్ళూ ‘రిజర్వేషన్ల’కు వ్యతిరేకం. బడుగు వర్గాల వారికి ‘కోటా’ ఇమ్మమంటేనే ససేమీ పొమ్మంటారు. అలాంటప్పుడు ఉపాధిలో ‘ప్రాంతాన్ని’ బట్టి కోటా ఇమ్మంటే ఇస్తారా? వ్యాపారికి నష్టం వస్తుందంటే దుకాణం సర్దేస్తాడు. కానీ వారు ఏ ప్రాంతంలో వుంటే, ఆ ప్రాంతాభివృధ్ధికి ఎంతో కొంత దోహద పడతారు. కాబట్టి ‘మనుషుల్ని పొమ్మన్నట్టు , మార్కెట్టును పొమ్మనలేం’. ఒక వేళ పోతానంటే, ఏవేవో రాయితీలు కల్పించి, ఉన్నవాళ్ళను ఉండేటట్టు బుజ్జగించాల్సి వస్తుంది. ఇంకా కొత్తగా రమ్మని ఆహ్వానించాల్సి వస్తుంది. ఉన్న మార్కెట్టు వెళ్ళి పోతే, ప్రాంతానికి అభద్రత కానీ, మార్కెట్టుకు కాదు. పశ్చిమ బెంగాల్‌నుంచి ‘టాటా’ ను పొమ్మంటే, టాటాకు నష్టం కాదు. రమ్మనటానికి ఏ గుజరాత్‌ నుంచో మోడీ సిధ్దంగా వుంటారు.

అంతా భద్రంగానే వున్నాను. రాజకీయాలు ఊరుకోవు కాబట్టి, కాస్సేపు అభద్రంగా వున్నట్టు నటిద్దాం.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 18 ఆగస్టు 2013 తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “అభద్రం కొడుకో!

Leave a Reply