అమీర్‌ ఒక క్లాసు ‘పీకె’!

టాపు(లేని) స్టోరీ:

amir khanవేరే గ్రహం నుంచి భూమ్మీదకు దిగి, వెతుక్కుంటూ, వెతుక్కుంటూ భారత దేశం వచ్చిన ‘పీకే'(అమీర్‌ ఖాన్‌), ఈ దేశంలో తప్ప ఎక్కడయినా వుంటానంటున్నాడా? ఆ సినిమాలో అన్ని మత ఛాందసాలకూ, సమానంగా తలంటు పోసిన అమీర్‌ పట్ల, ఒక మతానికి చెందిన ఛాందసులే ‘అసహనం’ ప్రదర్శించారా? ఇంతకీ దేశం వెళ్ళాలనే ఆలోచన ఆయనకు వచ్చిందా? లేక హిందువుగానే పుట్టిన తన భార్య(కిరణ్‌)కు వచ్చిందా?

ఇంతకీ ‘అసహనం’ అంటే ఏమిటో? ఒకడు పచ్చిపులుసుతో అన్నం తింటాడు; వంటలో ఇంగువ కూడా వేసుకుంటాడు. ‘అన్‌బాయిల్డ్‌ (పొంగించని) వాటర్‌ తో ఎలా తింటావ్‌? అబ్బ… ఇంగువ కంపు… ఎలా భరిస్తావ్‌?’ అని ఇంకొకడనటం ‘అసహనం’. ‘ఎంత పురోహితుడయితే మాత్రం, వొంటి మీద చొక్కాలేకుండా, ఆ ఎక్స్పోజింగ్‌ ఏమిటి?’ అని కామెంట్‌ చెయ్యటం కూడా ‘అసహనమే’. ‘నడుము భాగం, వీపూ కనబడేలా వుండే ఈ చీరకట్టు కాకుండా, నిండుగా జీన్‌ ఫ్యాంటూ, షర్టూ వేసుకోవచ్చు కదుటే..!’ అని తల్లి కూతుర్ని అనటం కూడా ‘అసహనమే’. ‘కుచమూ..కుంకుమా’ అంటూ పొద్దున్నే సంస్కృతంలో అశ్లీలామిట్రా, తెలుగులో ఏ వేమన శతకమో చదువుకో వచ్చు కదా..! ‘ అని తండ్రి కొడుకునంటే ‘అసహనం’ కాదూ! విడ్డూరంగానే వుంటుంది.

ఏమి తినాలి, ఏది కట్టాలి, ఏది వినాలి, ఏది అనాలి- తాము నిర్ణయించినట్టే జరగాలీ- అంటూ పైన ఎవరయినా కర్ర పట్టుకుని కూర్చుని, ‘ఇదేరా డెమాక్రసీ’ అంటే ఎలా వుంటుందీ..!? ఎలా వుండటమేమిటి? పాతి వ్రత్యమంత గొప్పగా వుంటుంది. పగలంతా ప్రేమించే భర్త , కేవలం రాత్రయ్యాక, భార్య ఒంటి మీద ‘కాలే సిగరెట్టుతో’ పచ్చబొట్లు పెడుతున్నాడని, అత్తింటిని వదలి పుట్టింటికి వెళ్తానంటుందా? అలా అంటే ఆమె ‘పతివ్రతే’నా? భరించాలి కదా! మూడు వేల యేళ్ళ పాటు వూరు వెలుపలే వుంటూ, ఆ దుస్తులూ, ఈ దుస్తులూ అని కాదు, ఏ దుస్తులూ వేసుకోవద్దన్నా, వేసుకుకోకుండా, ఏ చెప్పులూ వేసుకో వద్దన్నా వేసుకోకుండా, పప్పూ, నెయ్యీ వంటివి తినొద్దన్నా, కేవలం మృత పశువుల మాంసాన్నే ( ఏమో మృత గోమాతలు కూడా వున్నాయేమో!) తింటూ అక్కడే వుండి పోయారు కానీ, ఎప్పుడన్నా దేశం దాటుతానన్నాడా? కనీసం వాడ దాటి ఊళ్ళోకి వస్తానన్నాడా? ఎప్పటికీ దేశంలో సగటున పూట కొక్క దళితుణ్ణి చంపుతున్నారు. అయినా వారు ‘సహనం’ కోల్పోయారా? లేదే…!

అమీర్‌ ఖాన్‌ అయినా, షారుఖ్‌ ఖాన్‌ అయినా, ఆస్కార్‌ గ్రహీత రహమాన్‌ అయినా… అంటున్నది ఒక్కటే. ఉగ్రవాదుల్లో ముస్లింలు వుండవచ్చు; హిందువులు వుండవచ్చు; క్రైస్తవులు వుండవచ్చు. కానీ కేవలం ముస్లింలను చూస్తేనే ఉగ్రవాదులని అని ముద్ర వేసే స్థితి ఏమిటీ? అని. ఈ పాయింటు బాగుంది కదా! మరి ఇదే స్టోరీ లైన్‌తో, ఎంచక్కా ‘పీకే-2’ తీసుకోక, దేశం వదలాల్సిన ఖర్మ ఏమిటని. ఆ మాటకు వస్తే గాంధీని చంపిన వాడికన్నా పెద్ద ఉగ్రవాది వుంటాడా? అనుకోకుండా అతడు (గాడ్సే) హిందువుయ్యాడు. అలాగని హిందువులందరినీ ఉగ్రవాదులుగా చూపిస్తే..!? కడుపు మండి పోదూ..! దేశం వెళ్ళాలనే ఆలోచన ముస్లిం అయన తనకెప్పుడూ రాలేదనీ, హిందువయిన తన భార్యకే ఒకప్పుడు వచ్చిందనీ, ఇప్పుడయితే ఇద్దరికీ లేదనీ చెప్పేశారు. దేశాన్నుంచి వెళ్ళాల్సింది ‘అమీర్‌’, కాదు ‘అసహనం’!?

న్యూస్‌ బ్రేకులు:

‘నా జన్మభూమి ఎంత అందమైన దేశమూ!’

అంబేద్కర్‌ ఎన్నో అవమానాలు భరించారు; దేశాన్నుంచి వెళ్తానన్నారా?

రాజ్‌ నాథ్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి

అవును. అద్వానీ పుట్టిన ఊరు ఇప్పుడు పాకిస్థాన్‌లోనే వుంది. అయినా అక్కడికి వెళ్ళిపోతానన్నారా? కాకుంటే వెళ్ళినప్పుడు మాత్రం పాకిస్థాన్‌ నిర్మాత మహ్మద్‌ ఆలీ జిన్నాను దేశభక్తుడిగా కీర్తించి వచ్చారు.

ప్రతీ అంశాన్నీ పార్టీలు రాజకీయం చేయటం తగదు

ఎం. వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి

అంతేనా? ప్రతీ ‘మతాన్నీ’ రాజకీయం చేయటం తగదు- అని అంటున్నారేమో! అని అనిపించింది.

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

‘బాబా’ క్రసీ!

పలు ట్వీట్స్‌: హిందువులూ, ముస్లింలూ ఎప్పటి నుంచో ఈ దేశంలో కలసి వుంటున్నారు.

కౌంటర్‌ ట్వీట్‌: మత చాందసులూ, రాజకీయనాయకులు కూడా ఈ దేశంలో కలిసే వుంటున్నారు. ఇది డెమక్రసీ కాదు. ‘బాబా’ క్రసీ!

ఈ- తవిక

సర ‘కారే’ గెలిచింది

‘కారు’ జోరు తీరు జూడు

వెళ్ళి వోరుగల్లు!

అప్పోజిషనోళ్ళ కేమొ

మళ్ళి గుండె ఝల్లు!!

 

కమేడియన్లయ్యారా

కాంగిరేసు నేతలు?

బీజేపీ, తేదేపా..

వారికి ముత్తాతలు!

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

భారత రాజ్యాంగం ‘ప్రీంబుల్‌’లో కూడా ‘సెక్యులరిజం, సోషలిజం’ పదాలు వుండాలా- అన్నది బీజేపీ నేతల అనుమానం. కొంపతీసి వాటి స్థానంలో ‘కాషాయం, హిందూత్వం’ చేరుస్తారా.. ఏమిటి?

కొట్టేశాన్‌( కొటేషన్‌):

‘ఆయనెవరో దేశమంతటా తిరిగి యోగా నేర్పిస్తున్నాడు. దేశభక్తుడేనా?’

‘కాదు, దేహ- భక్తుడు’.

-సతీష్ చందర్

27-11-2015

Leave a Reply