పేరు : ధర్మాన ప్రసాద రావు
ముద్దు పేరు : ‘ఆపద్ధర్మాన’ ప్రసాదరావు.( కేబినెట్ నిర్ణయాలనే ‘ఆపధ్ధర్మంగా’ అమలు జరిపాను కానీ, నా స్వంత నిర్ణయాలు కాదు. అయినా ‘వాన్ పిక్’లో నన్ను బుక్ చేశారు.)
విద్యార్హతలు : ఎన్ని విద్యలుండి ఏం లాభం? తప్పించుకునే విద్య ఒక్కటీ లేకపోతే, మిగిలిన విద్యలన్నీ వృధా.
హోదాలు : రాజెవరయినా మంత్రి మనమే: నేదురుమిల్లి, వైయస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి- ఎవరు- సింహాసనం మీద వున్నా, మన స్థానం మారదు. కానీ హఠాత్తుగా దేశానికి ‘సిబిఐ’ రాజయి కూర్చుంది. ఏం చెయ్యను చెప్పండి.
గుర్తింపు చిహ్నాలు : ఒకటి: మెట్టు మెట్టుగా ఎదిగిన వాణ్ణి. కేరీర్ కోసం ఎన్నడూ ‘లిఫ్ట్’ వాడలేదు. గ్రామ సర్పంచ్నుంచి ఎదుగుతూ వచ్చాను. దిగాల్సి వస్తే, మెట్టు మెట్టుగా దిగుతాను. కానీ ఒకే సారి కూలిపోను. చూశారు కదా- నా రాజీనామా పర్వం కూడా ఎలా దశల వారీగా నడుస్తుందో..!!
రెండు: ప్రగల్బాలు పలికే ఉత్తర కుమారుణ్ణి కాను. మాట మీద నిలిచే ఉత్తరాంధ్రుణ్ణి. అందుకే నేను రాజీనామా చేసి వెళ్ళి నా జిల్లాలో(శ్రీకాకుళంలో) మాట్లాడుతుంటే, వర్షంలో తడుస్తూ కూడా విన్నారు. రేపు అసెంబ్లీలో మాట్లాడినా అలాగే వింటారు. అవకాశం ఇచ్చి చూడండి.
అనుభవం : ఏ స్కాములోనయినా, ఫలితం ఎవరు పొందారో చూడటం లేదు, ఫైళ్లు ఎవరు కదిపారో మాత్రమే చూస్తున్నారు. ఇది అన్యాయం. తిన్న వారెవరో చూడాలి. ‘క్విడ్’ ప్రోకో అంటే ‘ఫుడ్’ ప్రోకో- అనే అర్థం.
వేదాంతం : ‘అధర్మం’ నాలుగు పాదాలా నడవచ్చు. కానీ, ‘ధర్మాన’ రెండు పాదాలు మీద మాత్రమే నడుస్తాడు. ఒకటి:నీతి, మరొకటి: నిజాయితీ. (నాకు తెలుసు. మీకు నవ్వొస్తుంది. కష్టాల్లో కృంగి పోవటం నాకిష్టం వుండదు. అందుకే ఇలాంటి జోకులు!)
వృత్తి : నేను కళాకారుణ్ణి కాదు. అయినా సరే ప్రతిపక్షాల వారు నాకు లేని కళలను అంటగడుతున్నారు. నన్ను ‘కళంకితుడు’, ‘కళంకితుడు’- అని మాటిమాటికీ గౌరవించేస్తున్నారు. ప్లీజ్! అంతటి ప్రశంసను స్వీకరించలేను. నన్ను ‘ఆరోపితుడు’ అనండి చాలు. (అంటే చార్జ్ షీట్ ‘ఆరో’ పేరు అని మాత్రం అర్థం రాదు లెండి)
హాబీలు :1. తీరిక వేళల్లో ‘ఆటోగ్రాఫ్’ లివ్వటం. చిన్న చిన్న వాళ్ళడిగితేనే ఇచ్చేస్తాం. అలాంటిది సాక్షాత్తూ ముఖ్యమంత్రి అడిగితే ఇవ్వకుండా వుంటామా? రెవెన్యూ మంత్రిగా వున్నప్పుడు ఈ ‘హాబీ’ యే నా కొంపలు ముంచింది.
2. నాలాగా ఆలోచించే వారితో స్నేహ బృందాన్ని తయారు చేసుకోవటం. ఇప్పుడు కేబినెట్లో ఓ ‘ఉప కేబినెట్’ వుంది. ఈ కేబినెట్ సభ్యులు నాలా ‘ఆటోగ్రాఫ్’ లో పెట్టి ‘ఆరోపితులు’గా నిలిచిన వారు..( ఉదాహరణకు నా కొచ్చిన కష్టమే ‘చేవెళ్ళ చెల్లెమ్మ’ కు కూడా వచ్చింది.)
నచ్చని విషయం : ఎక్కిన కొమ్మను నరుక్కోవటం.( జగన్ కూర్చున్న కొమ్మ మీదే కాంగ్రెస్ మంత్రులూ కూర్చున్నారన్న విషయం మరచి సిబిఐ చేతికి రంపం ఇవ్వటం.)
మిత్రులు : ‘ఆరోపిత’ మంత్రులందరూ, నాకిప్పుడు ఆరో ప్రాణంతో సమానం.
శత్రువులు : కాంగ్రెస్ లో వున్నవాళ్ళకి శత్రువుల్ని బయట వెతుక్కునే ఖర్మ వుండదు.
జపించే మంత్రం : ‘చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ!’
విలాసం : ఇన్నాళ్ళూ సచివాలయమే దేవాలయమనుకున్నాను. (ఈ మధ్య జైళ్ళల్లో గుడులు కడుతున్నారట.) భగవన్నామ స్మరణకు ఎక్కడున్నా ఒక్కటే.
గురువు : నిన్నటి ‘గురువు’ నేటికి ‘బరువు’ అవుతున్నాడు. చెప్పి లాభం లేదు.
జీవిత ధ్యేయం : మంత్రీ వద్దు, ముఖ్యమంత్రీ వద్దు. ‘మిస్టర్ క్లీన్’ అని అనిపించుకుంటే చాలు.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 25-31 మే 2013 సంచికలో ప్రచురితం)