అన్నింటా ఆడపిల్లలు. సివిల్స్ టాపర్‌గా ఆడపిల్ల. ఇంటర్ ఫలితాలలో ఆడపిల్లల ముందంజ. ‘క్యాట్’లో ఆడపిల్లలు. ‘నీట్’లో ఆడపిల్లలు. ఎటు చూసినా ఆడపిల్లలే చదువుకు పోతున్నారు.
నాజూకయిన నగరాల్లో అత్యాచారాలు. ఎదిగీ ఎదగని పట్టణాల్లో లైంగిక హింసలు. ఒదిగీ ఒదగని పల్లెల్లో బలాత్కారాలు.
రెండూ వాస్తవాలే. వాటి మధ్య పొంతనేమీ లేదు.
అంతా పురుషాధిక్యమే -అని ఒక్కముక్కలో తెంపు చేసుకుని, పాపం, ఆడపిల్లలు తమ పని తాము చేసుకుని పోతున్నారు.
చదవనిచ్చే పురుషులు, ఎదగనిచ్చే పురుషులు, ఎగరనిచ్చే పురుషులు- మళ్ళీ ఎందుకని స్త్రీల రెక్కల్ని కత్తిరిస్తున్నారు?
నిజమే మరి. కందుకూరి వీరేశలింగం, జ్యోతిరావు ఫూలేలు ఎంత గించుకున్నా, ఆరోజుల్లో స్త్రీలను చదవనిచ్చే వారు కారు.
మరివాళ, అలా కాలికి బలపం కట్టుకుని తిరిగే గొప్ప సంస్కర్తలు ఎవ్వరూ లేరు. అయినా తెగ చదవనిచ్చేస్తున్నారూ- అంటే అందుకూ ఒక పాయింటు వుండాలి. అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటే లాజిక్కు. పురుషుడి అవసరం మేరకే స్త్రీ చదువుతోంది.
తెల్ల వాడు చెప్పిన ‘బొట్లేరు’ ముక్కల్ని నాలుగు వొంటబట్టించుకున్న పురుషులు గుమస్తాలయ్యారనుకోండి. వారు ఎప్పట్లాగా ఇస్త్రీచెయ్యని ముతక ఖద్దరు పంచెలు కట్టుకుని అర్థనగ్నంగా ఆఫీసులకు వెళ్ళలేరు కదా! చొక్కాలూ,ఫ్యాంట్లూ కుట్టించుకుని, వాటిని ఇస్త్రీ చేయించుకుని మరీ వెళ్ళాలి. ఈ పని ఎక్కువ అయిందనుకోండి. గుమాస్తా గారి భార్యకి కనీసం ‘ఇస్త్రీ పద్దులు’ రాసే చదువు రావాలి. అంటే రెండోతరగతో, మూడో తరగతో చదవాలి.
కొన్నాళ్ళకు ఈ గుమస్తాలు రోజూ పల్లెనుంచి పట్నం ప్రయాణమై వెళ్ళి ఉద్యోగం చేసి రాకుండా, ఏకంగా పట్టణాల్లోనే ఒంటిగా మకాం మార్చి, నెలకోసారి వస్తుండేవారు. అప్పుడు ఆయన సతీమణికి ‘ఉత్తరం ముక్క’ చదువు రావాలి. (మరీ పక్కింటి పంతులుగారి చేత ‘భార్యాభర్తల’ ముచ్చట్లు ఉత్తరం రాయించుకోవటం మంచిది కాదు కదా! ) అంటే అయిదో తరగతి వరకూ చదవ వచ్చు.
పాపం, మగమహారాజు ఎన్నాళ్ళని పట్నంలో ఒంటరిగా వంటింట్లో చేతులు కాల్చుకుంటాడు? అందుకని భార్యని పట్నం తీసుకు వెళ్ళాలి. ఆమెను బయిటకు తీసుకు వెళ్ళితే కాస్త స్టయిలిష్ గా మాట్లాడాలి. అందుకు కనీసం పదోతరగతన్నా చదవాలి.
తీరా పట్నంలో కాపురం పెట్టాక, ఖర్చులు పెరుగుతుంటాయి. అప్పుడు ‘వేణ్నీళ్ళకు చన్నీళ్ళ తోడు’ సిధ్ధాంతం మదిలో మెదులుతుంది. ఆ పయిన భార్యామణి కనీసం డిగ్రీ చదివితే బాగుంటుందని అనిపిస్తుంది. తొలుత పార్ట్ టైమ్ ఉద్యోగం చేసినా, తర్వాత ఫుల్ టైమ్ ఉద్యోగం చేయించుకోవచ్చు. అంటే వేణ్నీళ్ళకు వేణ్ళీళ్ళే తోడన్నమాట.
ఈ ఫార్ములా బాగా వర్కవుటయింది. దాంతో భర్త డాక్టరయితే, భార్య డాక్టరు. భర్త ఇంజనీరయితే, భార్య ఇంజనీరు. ఈ స్కీము మీదే అమెరికా, ఆస్ట్రేలియాల వరకూ భారతీయ స్త్రీలు చదువుకుని వెళ్ళిపోయారు. ఈ స్కీము మీదే బీపీవోల్లో పనిచేసేటంత చదువు స్త్రీలు కూడా చదివేస్తున్నారు.
ఐయ్యేఎస్, ఐపీయస్‌ల వంటి చదువులు కూడా స్త్రీలు ఈ స్కీముల కిందే చదువుతున్నారు.
ఒక్క సారి వెనక్కి తిరిగి చూస్తే, తమ కోసం తాము చదువుకోవటం- ఇంకా స్త్రీలు మొదలు పెట్టినట్టు లేరు.
మార్కెట్లో చదువుకున్న ‘వరుళ్ళ’ అవసరాల మేరకే వారి చదువులున్నాయి.
మరి చదువుకోని మగవాళ్లూ, చదువుల్ని మధ్యలో తగలేసిన మగవాళ్ళూ ఏం చేస్తున్నారు.
ఈ మాత్రం చదువుకున్న స్త్రీలను చూసి వోర్వ లేక పోతున్నారు.
ఈ చదువుకున్న వధువులు తమ కోసం కాదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక, వారిని అందుకోలేక, వారి మీద ‘సినిమా ప్రేమ’ లను ప్రకటించి లొంగ దీసుకోవాలని ప్రయత్నించి విఫలమయి, ఆసిడ్ దాడులకో, అత్యాచారాలకో పాల్పడుతున్నారు.
ఇంత చదువుకునీ, స్త్రీ-
ఇంట్లో అందమైన బానిస లాగా,
వీధిలో భోగ వస్తువులాగా నే కనిపిస్తోంది.
అందుకే, అన్నిరంగాల్లో స్త్రీ ముందంజ అనే వార్తల్ని, అత్యాచారాల్లో నగరాల్లో ముందున్నాయి- అని వార్తల్నీ పక్కపక్కనే చదవాల్సి వస్తుంది. చూడాల్సి వస్తోంది. వినాల్సి వస్తోంది.
స్రీలు తమకోసం తాము చదివి, తమకోసం తాము ఉద్యోగం చేసి, తమ షరతుల మేరకు తాము తమ సహచరుణ్ణి స్వీకరించగలిగే రోజున ఈ ‘ద్వంద్వ’ వాస్తవాలు మాయమవుతాయేమో!
-సతీష్ చందర్
(ఆంధ్రభూమి దినపత్రిక 5 మే2013 వ తేదీ సంచికలో ప్రచురితం)