‘ఆలి‘ ఖైదాలు!

సూర్యరశ్మి సోకకుండా అత్యంత సుకుమారంగా అంత:పురాలలో వుండే  స్త్రీలను అసూర్యంపశ్యలని అని అనేవారు. మహిళలకు భద్రత చాలు, స్వేఛ్చ  ఎందుకనే రోజులవి. కానీ పరదాలను దాటుకుని రావటానికి  ఆరాటపడుతూనే వున్నారు. వారు బయిటకు వచ్చి అన్ని రంగాలలోనూ తమ  ఉన్నతిని చాటుకుంటున్నా, ఈ సూర్యుడనేవాడు ఇంకా వెంటాడుతూనే వున్నవాడు. దాంతో అతణ్ణి మాత్రమే తప్పించుకోవటానికి వారు ముసుగులు ధరించి ‘ఉగ్ర‘వాదులు గా మారణం తప్పటం లేదు. పురుషాధిపత్యం మీద కూడా ఏదో ఒక నాడు  వారు  నిజంగానే ఈ ‘ఉగ్ర’ రూపం దాల్చక తప్పదేమో.

Hot day in Allahabadపొత్తిళ్ళలోని ‘ఉగ్గు’ వాదిగానే వుంటాడు

పొద్దున్నే తూర్పు వొడిలో పుట్టినప్పుడు.

పైకి వచ్చేకొద్దీ ఓర్పు కోల్పోతాడో ఏమో

‘ఉగ్ర’ రూపం దాల్చుతాడు-

మనమెరిగన సూర్యుడే.

ఏ వాదమయినే ఒక్కడితో పోదు కదా-

వంటింటి కుందేళ్ళను సైతం

మహోగ్రవాదుల్ని చేస్తాడు.

ముసుగుల్లో వున్న వారిని చూసినప్పుడెల్లా

ఒక్కటే దిగులు:

‘ఆలి’ని నైనా సరే ‘ఖైదు’ చేస్తే

‘ఆల్‌ ఖైదా’ అవుతుందేమోనని!!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 24-31 మే2013 సంచికలో ప్రచురితం)

 

Leave a Reply