ఇచ్చట అభిప్రాయాలు అమ్మబడును!

అప్పుడప్పుడూ అభిప్రాయాలతో కూడా పనిబడుతుంది- రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయంతో పనిబడినట్లుఅంటే ప్రతి సభ్యుడూ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, సరిపడా చొక్కా తొడుక్కొని వెళ్ళినట్టు, ఓ అభిప్రాయం కూడా తొడుక్కుని వెళ్ళాల్సి వుంటుంది. ‘బ్రాండెడ్‌’ చొక్కాలయితే బెటర్‌ గా వుంటాయి. ఏదో ‘మాల్‌’కు ఇలా వెళ్ళి అలా తొడుక్కుని వచ్చేయవచ్చు. ఏవో రెండు మూడు సైజుల్లో చొక్కాలు దొరుకుతాయి. కానీ ఇలాంటి ‘బ్రాండెడ్‌’ చొక్కాలకు ఓషరతు వుంటుంది: చొక్కాలను బట్టి దేహాలను సర్దుబాటు చేసుకోవాలి కానీ, దేహాలను బట్టి అక్కడ చొక్కాలు కుట్టరు. అలాంటి పప్పులు, గ్రామంలోని టైలర్‌ దగ్గర ఉడుకుతాయేమో కానీ, రెడీమేడ్‌ దుస్తులమ్మే షాపుల్లో కుదరవు. అందుకని ఉన్న చొక్కా సైజుకు తగ్గట్టుగా, దేహాన్ని తగ్గించుకోవటమో, పెంచుకోవటమో చెయ్యాలి.

అంగడిలో చొక్కాలు దొరికినట్లే అభిప్రాయాలూ దొరుకుతాయి. ఇప్పుడు రాష్ట్రంలోని రెండు ప్రాంతాలలోనూ అభిప్రాయాలు దొరుకుతున్నాయి. కానీ ఒకే షర్టు, ఒకే సైజు వున్నట్టు, ఒకే ప్రాంతానికి ఒకే అభిప్రాయం వుంది. సీమాంద్ర షాపుల్లో ‘సమైక్యం’, తెలంగాణ షాపుల్లో ‘విభజన’ అనే అభిప్రాయాలు మాత్రమే దొరుకుతున్నాయి. సీమాంధ్ర నుంచి ఎన్నికయిన సభ్యుడయితే, ఇష్టమున్నా లేకున్నా ‘సమైక్యాన్ని’ తొడుక్కోవాల్సిందే. ఇబ్బందిగా వున్నా తనని తాను అందులో పట్టించుకోవాల్సిందే. అలాగే తెలంగాణ నుంచి ఎన్నికయిన సభ్యుడయితే ‘విభజన’ చొక్కాలో దూరిపోవాల్సిందే.

పూర్వం చొక్కా అంటే కుట్టించుకునేదే కానీ, పట్టించుకునేది కాదు. అలాగే, అభిప్రాయం అంటే తమకి తాము ఏర్పరచుకున్నదే కానీ, ఎవరో ముందుగా ఏర్పాటు చేసి పెట్టింది కాదు.

ఒక ప్రాంతం విషయంలోనే కాదు, ఇతర సున్నితమైన, కీలకమైన విషయాల్లో కూడా ఎవరో ఏర్పాటు చేసిన అభిప్రాయాలుంటాయి. జెండర్‌ విషయాన్నే తీసుకోండి. మార్కెట్లో ఎవరి ‘పెర్‌ఫ్యూమ్‌’లు, ఎవరి ‘డియడోరెంట్‌’లు వారికి వున్నట్లు, ఎవరి అభిప్రాయాలు వారికి లభ్యమవుతాయి.

బాగా చదివేసుకున్నవాళ్ళయినా సరే-బోయ్‌ బోయ్‌ లాగా, గాళ్‌ గాళ్‌లాగా- వెళ్ళి మార్కెట్లో రెడీమేడ్‌ అభిప్రాయాలు కొనుక్కోవాలి.

గాళ్స్‌ తో స్నేహమంటే ఖర్చుతో కూడిన పని. ఏటీఎం కార్డు పెట్టుకుని, ‘గీకు’ వీరుడిగా మారటమే. ఇక పెళ్ళంటే బ్యాచిలర్‌ జీవితంలో వుండే స్వేఛ్చనంతా కోల్పోవటమే. సాయింత్రం అయ్యే సరికి ఇంటికి చేరాలి; భార్య కొంగు పట్టుకుని తిరగాలి.

ఇది కుర్రాళ్ళంతా తొడుక్కునే రెడీ మేడ్‌ అభిప్రాయం.

మరి గాళ్స్‌కో..? బాయ్స్‌లో బ్యాడ్‌ బాయ్స్‌ వుండొచ్చేమో కానీ నాకు దొరికిన బాయ్‌ ఫ్రెండ్‌ ‘అలాంటి వాడు కాడు’. ఇది ప్రేమించిన కొత్తల్లో అనేమాట. ఇక పెళ్ళయ్యాక కూడా అంతే, మిగిలిన భర్తల్లో వేధించే భర్తలు వుండవచ్చేమో కానీ, ‘మా ఆయన మాత్రం’ బంగారం. ఇది పెళ్ళయిన కొత్తల్లో చెప్పేమాట. ఆ తర్వాత ఎలాగూ ‘మరీ ఇలాంటి వాడనుకోలేదు’ అని పెదవి విరవటం మామూలే. ఈ అభిప్రాయాలు కూడా ‘మాల్స్‌’ లోనూ, వాటిలో భాగంగా వున్న ‘మల్టీప్లెక్స్‌ ‘థియేటర్ల లోనూ దొరుకుతాయి. ఎంచక్కా ఈ అభిప్రాయాలు తొడుక్కొని ‘బైక్‌’ ల మీద ఒకరి మీద ఒకరు వాలి పోయి తిరిగేస్తూ వుంటారు యువతీ, యువకులు.

అన్నట్టు, మనదేశంలో కులానికో అభిప్రాయం కూడా పరమ చిల్లరగా దొరుకుతాయి. బాగా చదువుకున్న వాళ్ళుకూడా ఈ అభిప్రాయాన్నే తొడుక్కొని తిరుగుతారు. ‘అగ్రవర్ణాల’ వారయితే, తాము ఉన్నత ఉద్యోగాలకు వెళ్ళలేక పోవటానికి ఒక్కటే కారణం: రిజర్వేషన్లు. ‘కింది వర్ణాల’ విద్యావంతులుంటారు. కుల వివక్ష వున్నమాట నిజమే కావచ్చు కానీ, నా వరకూ అయితే ‘కింది వర్ణం వాడినని ఎవరూ భావించరు. నేనలా కనిపించను’ అన్న అభిప్రాయాన్ని తొడుక్కుని నొప్పిలేకుండా బతికేయాలని చూస్తారు.

మండల్‌ శిఫారసులు వచ్చినప్పుడు దేశంలోని యువత అంతా, ఇలా, రెండే అభిప్రాయాలు తొడుక్కొని తిరిగారు.

ఇప్పుడయితే అభిప్రాయాలను ‘ఈ-షాపింగ్‌’ చేసి, మరీ పొందుతున్నారు కుర్రకారు. ‘ఫేస్‌ బుక్‌’, ‘ట్విటర్‌’ వంటి సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లలో అయితే, ఇలా వెళ్ళి, అలా రెడీమేడ్‌ అభిప్రాయాన్ని తొడుక్కుని వచ్చేయవచ్చు.

దేశంలో ప్రజాస్వామ్యం రావాలంటే, ఒక్క అవినీతిని తీసిపారేస్తే చాలు. ఎవరు తీసిపారెయ్యగలరో, ఎవరు ఏరి పారెయ్యగలరో తర్వాత మాట. కుల తత్వం, పేదరికం, మతతత్వం, హింస- వీటిగురించి వీరు మాట్లాడరని కాదు. కానీ మొత్తం సర్వరోగ నివారిణి ‘అవినీతి నిర్మూలన’ గా గుర్తిస్తారు.

అలాగే స్త్రీల మీద పెరుగుతున్న అత్యాచారాల గురించి వచ్చినప్పుడెల్లా ఢిల్లీతరహా అత్యాచారాలను దృష్టిలో పెట్టుకుని ‘ఉరితీయాల్సిందే’ అంటారు. కానీ పల్లెల్లో, ఇళ్ళల్లో, స్నేహితుల్లో, దగ్గర బంధువుల్లో వాళ్ళే స్రీల పై చేస్తున్న దైనందిన లైంగిక హింసకు పరిష్కారాలు అనవసరం. ఆ మాట కొస్తే, వరకట్నపు పెళ్ళికొడుకులు సైతం ఈ ‘ఉరితీత’ గురించి దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తారు.

క్లాత్‌ కొనుక్కుని, దర్జీ దగ్గరకు వెళ్ళి, కొలతలు ఇచ్చి, కుట్టాక ఒకటి రెండు సార్లు మార్పులు చేయించుకుని వేసుకునే చొక్కాలకు ఎలా ఇది కాలం కాదో, సొంత బుర్రతో సమస్యను అర్థం చేసుకుని, లోతుగా ఆలోచించి, రాజకీయ, సాంఘిక, ఆర్థిక ధృక్కోణాల్లోనుంచి విశ్లేషించుకుని అభిప్రాయం ఏర్పరచుకోవటానికి కూడా ఇది కాలం కాదు.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 22 డిశంబరు 2013 వ తేదీ సంచికలోప్రచురితం)

2 comments for “ఇచ్చట అభిప్రాయాలు అమ్మబడును!

Leave a Reply