ఈ కథలు ‘పెద్దల’కు మాత్రమే!

బధ్ధకించవచ్చు, మరచి పోవచ్చు-

దగ్గర బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళక పోవచ్చు. ఎడమ కాలి చీలమండ కింద ఎయిర్‌ ఫ్రాక్చర్‌ అయిందనో, కుడి వైపున జ్ఞానదంతం నొప్పిపెట్టి దంత వైద్యుడి దగ్గర కువెళ్ళితే, అతడి అజ్ఞానం కొద్దీ దాని పక్క పన్ను పీకినంత పనిచేశాడనో చెప్పవచ్చు.( చెప్పే కథల్లో డీటైల్స్‌ ఎక్కువ వుంటే తొందరగా నమ్ముతారు లెండి.)

కానీ ఎవరయినా తన పెళ్ళికి తాను హాజరు కావటం బధ్ధకిస్తే , పోనీ మరచి పోతే ఏమవుతుంది? రిజిస్ట్రార్‌ ఆఫ్‌ మేరేజెస్‌ దగ్గర ఎదురు చూసి, చూసి విసిగి పోయిన పెళ్ళికూతురు, ఇంటికి వెళ్ళి కట్టుకున్న పట్టుచీరను పనిమనిషికి బహూకరించేసి, ఆ తర్వాత సదరు పెళ్ళికొడుక్కి ఫోను చేస్తే- అతడు ఏం కథ చెబుతాడు?

‘సారీ డియర్‌, పెళ్ళి జరిగే చోటూ గుర్తుంది. తేదీ, ముహూర్తం కూడా గుర్తుంది. కానీ పెళ్ళాడేది నిన్నో, మరొకర్నో గుర్తురాక, రాలేక పోయాను.’ అని కథ చెబితే ఆమె కెలా వుంటుంది?

చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అనే అంశం మీద రాజ్యసభలో జరిగిన వోటింగ్‌కు గైర్హాజరు, తెలుగుడేశానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఇలాంటి కథలే చెప్పారు.

‘డాక్టరుతో అప్పాయింట్‌ మెంట్‌ వుంది. అందుకే రాలేక పోయాను.’

‘నేను వచ్చేటప్పటికే లాబీలు మూసేశారు.’

‘రావాలని ఎంతో ప్రయిత్నించాను. కానీ అప్పటికే ఫ్లైటు వెళ్ళిపోయింది.

మూడూ ముగ్గురు ‘పెద్దలు’ (రాజ్యసభ పెద్దల సభ కదా!) చెప్పిన కథలు.

మూడు కధలకీ పేర్లు పెడితే- ‘అనారోగ్యం’, ‘ఆలస్యం’ ‘అశ్రధ్ద’ – అవుతాయి.

చూశారా? కథల్లో ‘డీటైల్స్‌’ లోపించాయి. కాబట్టే నమ్మబుద్ధి కావటం లేదు. ఇంకో అనుమానం కూడా వుంది. నమ్మకుండా వుండేందుకే- ఈ కథలు చెప్పారేమో!

అలిగిన ఇంటావిడ కూడా ఇలాంటి కథే చెబుతుంది. ‘ఏం అన్నం తినవా?’ అని అంటే ‘ఆకలిగా లేదు.’ అంటుంది. ఇది కథే. కధేనని అనుకోవాలని కావాలని చెప్పిన కథే. ‘అలిగాను చూస్కో’ అన్న నిజం తెలిపేందుకు, చెప్పిన కథ.

ఈ ఎంపీలు కూడా అంతే. తమ అధినాయకుడికి ‘మేం అలిగాం’ అన్న నిజాన్ని తెల్పటానికి చెప్పిన కథలు మాత్రమే ఈ మూడూను. నాయకుడు నిజం గ్రహించి కూడా, గ్రహించినట్లు నటించారనుకోండి. పాపం. ఈ ముగ్గురి నేతల గతేంకానూ? ఈ మూడు కథల్నే ఉన్న వివరాలు కూడా తెగ్గోసి, పరమ నిర్లక్ష్యంగా ఒక్కో మాటలో చెప్పేయవచ్చు.

ఎందుకు రాలేదంటే- అని ఒక్కొక్కరు ఇలా ముక్తాయిస్తారు:

‘ నొప్పి’ అంటారొకరు. ‘విసుగనిపించీ..’ అని తేల్చేస్తారు ఇంకొకరు. ‘టైమ్‌ వేస్టనీ’ అని నసుగుతారు.

ఈ తరహా కారణాలు కూడా వినేశాక అధినాయకుడేం చేస్తారు?’

పార్టీలో వుండే ఉద్దేశ్యం లేదేమోనని నిర్థారణ కొస్తారు. వాళ్ళంత వాళ్ళే వెళ్ళే స్థితిని కల్పిస్తారు.

అలాకా కుండా, ఈ ముగ్గురూ ‘మనసు మార్చుకుని’ ( రూటు మార్చుకుని) ఏమైనా సరే పార్టీ వుండటమే- క్షేమదాయమూ, లాభదాయకమూ, వాణిజ్యదాయకమూ అని భావించేస్తే, చెప్పిన ఈ మూడు కథలకూ మరిన్ని వివరాలు చేరుస్తారు.

అప్పుడా కథలు- అందరూ నమ్మి తీరాలన్నట్టు వుంటాయి.’పార్టీకోసం ప్రాణం ఇచ్చే మనిషిని. వోటు వేయకుండా పడిపోయాను. నన్ను స్పృహలోకి తేవాలని నా అనుచరులు డాక్టర్ని వేడుకున్నారు. ఆయన శతవిధాలా ప్రయత్నించారు.నాకు స్పృహ వచ్చింది. ఐసియూలోంచి వేరే రూమ్‌ లోకి తెచ్చారు. టీవీ చూశాను. అప్పటికే టీవీలో వోటింగ్‌ పూర్తయినట్టు వార్తలు వచ్చాయి. ఏం చెయ్యను. చాలా బాధపడ్డాను. మా పార్టీనేతకు నా ముఖం ఎలా చూపించాలీ- అనుకున్నాను.’

ఈ కథ నమ్మాలని పిస్తోంది కదా! ఎందుకంటే నమ్మించాలని చెప్పే కథ కదా!

‘చుట్టూరా ట్రాఫిక్‌. నేను పొరపాటు చేసిందెక్కడంటే ఒక ప్రయివేటు కారులో వస్తున్నాను. వేగంగా చేరుకోవాలనే. కానీ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాను. నాకు అర్థమయింది. ఇలాగయితే చేరుకోలేనని. దిగి మోటారు బైక్‌ మీద వున్న వ్యక్తిని లిఫ్ట్‌ అడిగాను. పాపం అతడు ఇచ్చాడు. కానీ పెట్రోలు లేక మధ్యలోనే ఆగిపోయింది. కొంత దూరం నడిచాను. ఈ లోగా నా కారుకు ఫోన్‌ చేసి రమ్మన్నాను. అతి కష్టం మీద వచ్చింది. కానీ అప్పటికీ లాబీలు మూసేశారు. తల బద్దలు గొట్టుకోవాలనిపించింది.’

వివరాలతో పాటు, ట్విస్ట్‌లు కూడా వున్నాయేమో-మరింత నమ్మ బుద్ధేస్తుంది.

‘ఫ్లయిట్లను నమ్ముకోవటం నాది బుధ్ధిపొరపాటు. కారణం ఏమయినా నేను చేసింది క్షమించరాని నేరం. నా అధినాయకుణ్ణి క్షమాపణ కోరే అర్హత కూడా నాకు లేదు.’

వివరాలు లేనట్టు అనిపిస్తుంది కానీ, సెంటిమెంటల్‌ టచ్‌ వుంది. ఒక రకంగా అన్ని వివరాలకంటే బలమైన వివరం ఇది. రాజకీయ ‘చిల్లర’ల వర్తకంలో ఎవరి ప్రత్యక్ష పెట్టుబడులు వారివి!!

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 9డిశంబరు2012 తేదీ సంచిక లో ప్రచురితం)

 

2 comments for “ఈ కథలు ‘పెద్దల’కు మాత్రమే!

  1. పెద్దలనగా నెవరురా!! వారిబుద్డులన్ని వేరురా!! పరమానందయ్య శిష్యులు ఏరోజో చెప్పేశారు.. సారూ…

Leave a Reply