‘ఉత్తర’ కుమారుడు

పేరు : రాహుల్‌ గాంధీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: మంచి కొడుకు( ఇంతకు ముందు ఈ పోస్టు నాదే. కానీ యుపి ఎన్నికల తర్వాత అఖిలేష్‌ యాదవ్‌ కొట్టేశాడు.)

ముద్దు పేర్లు : ‘ఉత్తర’కుమారుడు (అంటే ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం చేసిన సోనియా కుమారుడని అర్థం కాదు. గెలిచేస్తానని ప్రగల్బాలు పలికి చతికిలబడ్డ భారతంలోని ఉత్తర కుమారుణ్ణే)

విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ పెయిల్యూర్స్‌ (ప్రచార రాజకీయాల్లో వరుస వైఫల్యాలు చూస్తూ, ‘బ్యాచిలర్‌’ గానే వుండి పోయాను. ప్రధాని అయ్యాక పెళ్ళికొడుకునవుదామన్న కోరిక నెరవేరటం లేదు.
తీయ స్థాయి యువ నేతనే. యుపీ కొచ్చి, అనవసరంగా రాష్ట్ర రాజకీయాల్లో తల దూర్చి, రాస్ట్ర నాయకుణ్ణి (ములాయం కొడుకుని) రెచ్చగొట్టి, భంగపడి రాష్ట్రస్థాయి యువనేతగా కుదించబడ్డాను.

గుర్తింపు చిహ్నాలు : 1) నేను ఎక్కడికి వెళ్ళితే అక్కడ ‘చెయ్యి’ ఊపుతాను. కానీ జనం నాకు ‘చెయ్యి’స్తుంటారు. యుపీలో చూసేశారు కదా!

2) నాన్న పేరు, అమ్మ నీడ, అక్క తోడు లేకుండా అడుగు ముందుకు వెయ్యలేను.(ప్రచారం లోనైననా సరే)

సిధ్ధాంతం : లిఫ్టున్నా వాడను. మెట్లే ఎక్కుతాను. ఇదే నా సిధ్ధాంతం.( ప్రధాని మంత్రి సీట్లో కూర్చోవటానికి లిఫ్టు ఎప్పుడో సిధ్ధంగా వుంది. కానీ యుపిలాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చి, ఆ తర్వాత ఆ పదవిని అలంకరిద్దామనుకున్నాను. కానీ అదేమిటో, నేను ఒక మెట్టు మీద కాలువేయగానే, తర్వాత మెట్టు కూలిపోతుంది.)

వృత్తి : ‘కుశ లవు’ల వృత్తి. తండ్రి చరిత్రను పారాయణం చేయటం.( రాజీవ్‌ రాజ్యాన్ని రామ రాజ్యమంత గొప్పగా కీర్తించటం)

హబీలు : 1) ‘మాయ’ పగ

2) మాతృ ప్రేమ

అనుభవం : ఉత్తర ప్రదేశ్‌ ఒక రాష్ట్రం కాదు. ఒక దేశం. అక్కడ ఓడలు బళ్ళవుతాయి. బళ్ళు వాడలవుతాయి.( జాతీయ పార్టీలు(బీజేపీ, కాంగ్రెస్‌లు) రాష్ట్ర పార్టీలవుతాయి, రాష్ట్రస్థాయి పార్టీలు (ఎస్పీ, బీఎస్పీలు) జాతీయ పార్టీలు అవుతాయి.

మిత్రులు : మునిగిపోయేవాణ్ణి పట్టుకుంటే ఈత వచ్చినవాడు కూడా మునిగి పోతాడే అనే దుష్ప్రచారం వల్ల నిన్నటి వరకూ వెంట వున్న అజిత్‌ సింగే దిక్కులు వెతుకుతున్నాడు.

శత్రువులు : కాంగ్రెస్‌ అన్నాక.. లోపలా, వెలుపలా వుండేది వాళ్ళే కదా!

మిత్రశత్రువులు : ఇంకెవరూ… కేంద్రంలో సర్కారును నిలుపుకోవాలంటే, అదే ములాయంనో లేక అదే మాయనో మచ్చిక చేసుకోవాలి.

జీవిత ధ్యేయం : ఒకప్పుడు ప్రధాని అని అనుకునే వాణ్ణి, అనవసరంగా ఎదురు చూసి, చూసి విసిగి పోయాక, జీవిత భాగస్వామిని పొందటమే జీవిత ధ్యేయంగా తయారయింది.

సతీష్ చందర్
(ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాసినది)

Leave a Reply