‘ఉమ్మడి’ గాదె!

caricature:balaram

caricature:balaram

పేరు : గాదె వెంకటరెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఆంధ్ర దూత.( ఇదేదో పత్రిక పేరులాగా వుంది కదా! కానీ కాదు. ఎప్పటికీ తేలని తెలంగాణ సమస్య వచ్చినప్పుడెల్లా, అఖిల పక్ష సమావేశాలూ స్వపక్ష సమావేశాలూ ఎలాగూ తప్పవు. కాబట్టి సీమాంధ్ర ప్రాంతం నుంచి నన్ను శాశ్వత దూతగా కాంగ్రెస్‌ పార్టీ పెట్టుకోవటం నాకూ మంచిది. పార్టీకీ మంచిది. పీసీసీనేత, ముఖ్యమంత్రి వంటి పదవులు అశాశ్వతాలు.)

ముద్దు పేర్లు :’ఉమ్మడి’ గాదె( ఎవరయినా ధాన్యం దాచుకున్న గాదెను రెండు ముక్కలు చేస్తారా? ‘ఉమ్మడి’గా అనుభవిస్తారు. కాకుంటే నోరు గలవారు( నీరు గలవారని కొందరంటారు!) కాస్త ఎక్కువ అనుభవిస్తారు. అది వేరే విషయం.

విద్యార్హతలు : ‘లా’ ఒక్కింతయు గలదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎందుకి ‘లా’? అంటే చెప్పలేను.

హోదాలు : రెండు ‘మత్తు’ శాఖలకు మంత్రిగా చేశాను. (ఒకటి: దేవాదాయ శాఖ, రెండు: ఎక్సైజు శాఖ). నిజానికి జనం ఊగేది రెండు చోట్లే నని సినీ కవి ఏనాడో తేల్చాడు. ఒక పరిమితి దాటితే ‘భక్తీ’ మత్తే, ‘మద్యమూ’ మత్తే, ఈ శాఖల్ని వదిలేశాక ఆ ‘హేంగోవర్‌’ చాలాకాలం వుంటుంది. మరో శాఖ తీసుకోవాలంటే, వెంటనే మనస్కరించదు.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను అయిదు దఫాలు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గా చేశాను. కమిషన్లూ కొత్త కాదు, అఖిల పక్షాలూ కొత్త కాదు. జైంధ్రల వల్లా, సమైక్యాంధ్రల వల్లా కాంగ్రెస్‌లో అదనపు గుర్తింపు ఏదీ రాదు.

రెండు: స్థానికంగా (బాపట్లలో) నా శత్రవుల వల్లే నాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అందుకని రాజకీయాల్లో మంచి మిత్రులు లేక పోయినా ఫర్వాలేదు కానీ, మంచి శత్రువులు మాత్రం ముఖ్యం.

అనుభవం :కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయమనేది ఎప్పుడూ వుండదు. ఉంటే ‘ఏక వ్యక్తి ‘అభిప్రాయమే వుంటుంది. అందరం కలిసి నిర్ణయాధికారాన్ని అధిష్ఠానానికే కట్టబెడతాం. అందుకని అధిష్ఠానం కూడా భిన్నాభిప్రాయాన్ని గౌరవిస్తుంది, ప్రోత్సహిస్తుంది కూడా. (ఇటీవల షిండే గారి సమక్షంలో జరిగిన అఖిల పక్షంలో, సురేశ్‌ రెడ్డీ, నేనూ ఎవరి అభిప్రాయాలు ఒకరికొకరు పొంతన లేకుండా చెప్పగలిగామంటే, అది అధిష్ఠానం చలవే).

సిధ్ధాంతం : నా పట్లనేనూ, మీ పట్ల మీరూ, ఎవరి పట్ల వారూ నిజాయితీ గా వుండటమే ‘బాపట్ల సిధ్దాంతం’ (మావూరు బాపట్ల లెండి.)

వేదాంతం : ‘కలసి వుంటే’ కలదు సుఖమూ..(హైదరాబాదులో ఆస్తులుంటేనే సుమండీ!)

వృత్తి : ఇన్‌డోర్‌లో నలుపు. అవుట్‌ డోర్‌లో తెలుపు. కోర్టులో ‘నల్లకోటు’, బయిటకొస్తే ‘తెల్ల ఖద్దరు. కేవలంలో వృత్తిలోనే ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌’ సుమండీ.. సంపాదనలో కాదులెండి. అలాఅయితే ‘గాదె’ వెంకటరెడ్డిని ఎందుకవుతానూ…? ‘కోట్ల’ వెంకటరెడ్డినే అయ్యేవాడిని.

హాబీలు :1. గ్రంథాలు నడపటం కాదు, గ్రంథాలు చదవటం.

2. కొందరు హార్లిక్స్‌ తాగరు, తింటారు. నేను ఆ టైపే. వార్తలు చదవను, చూస్తాను. ఖాళీ దొరికితే చాలు టీవీకి అతుక్కుంటాను. మా రాజకీయాల్లో మేకప్‌ మహానటుల సజీవ నటన చూసి ముగ్ధుణ్ణవుతుంటాను.

మిత్రులు : మిత్రుడికీ, శత్రువుకీ తేడా ఒక్క గోడే. ఇటు నుంచి అటు దూకితే, మిత్రుడు శత్రువయి పోతాడు.

శత్రువులు : రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. నువ్వు ఎక్కే కారూ, నువ్వు కూర్చున్న కుర్చీ, నిన్ను ‘మోసే’ బ్యాండు మేళం- అన్నీ అశాశ్వతమే. పగను ప్రేమగా మార్చుకోవటానికి ఒక్క పదవి పడేస్తే చాలు.

జపించే మంత్రం : ‘ఓం సమైక్యాంధ్రాయన మ:’

విలాసం : మాకు ప్రజెంట్‌ అడ్రస్‌ ఏదయినా వుండవచ్చు. కానీ పర్మనెంట్‌ అడ్రస్‌ మాత్రం- ఢిల్లీయే.( ప్రతీ చిన్న పనికీ అక్కడికి పరుగెత్తాల్సిందే కదా!)

గురువు : ఎందుకూ నా చేత ‘పంగనామాలు’ పెట్టించటానికా? ఇప్పటికే నా శిష్యులు నాకు ఆ పని చేస్తున్నారు.

జీవిత ధ్యేయం : రాష్ట్రం కలిసి వుండగానే కనీసం ఒక్క రోజయినా… ఆ… పదవినలంకరించాలని!( అర్థంకాలేదా? అయదేళ్లు ఎమ్మెల్యే చేశాక, రెండు సార్లు మంత్రి పదవి చేశాక, ఏ నేతయినా ఆశించే ‘ముఖ్య’ పదవి అది!)

–సతీష్ చందర్

(గ్రేట్  ఆంధ్ర వారపత్రిక 5-12  జనవరి 2013 వతేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply