పేరు :జయప్రకాష్ నారాయణ్
దరఖాస్తు చేయు ఉద్యోగం : తెలుగు ‘లోక్’ నాయక్ (నా పార్టీ ‘లోక్ సత్తా’లోనే ‘లోక్’ వుంది. ‘లోక్’ పాల్‌ను సమర్థించాను. ఇప్పుడు ‘లోకా’యుక్త కోసం ఉద్యమిస్తాను. కానీ నా ప్రయత్నాలను ప్రతీసారీ మీడియా గుర్తిస్తున్నట్లుగా ‘లోకం’ గుర్తించటం లేదు.)
ముద్దుపేర్లు :ఆంధ్రప్రదేశ్‌లో ‘జెపి’. మిగతా రాష్ట్రాల్లో జూనియర్ జెపి.(అక్కడ జయప్రకాశ్ నారాయణ్ అంటే, యమర్జన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించిన సీనియిర్ జయప్రకాశ్ నారాయణ్ గుర్తుకొస్తారు.
గురువు పేరు :రాజకీయాల్లో గురువులుండరు. ఉంటే ‘రాజగురువు’లుంటారు. వారినే ‘కింగ్ మేకర్’లంటారు. ఎప్పుడు ఏ ఎజెండా స్వీకరించాలన్న విషయంలో వారి సూచనలను పాటిస్తాను. రాజకీయ ప్రత్యర్థులకు ‘ప్యాక్షనిస్టు’ ముద్ర వున్నప్పుడు ‘నేర చరితులకు’ వ్యతిరేకంగానూ, ‘అవినీతి ఆరోపణలతో జెళ్ళలోవున్నప్పుడు’ ‘అవినీతికి వ్యతిరేకంగానూ ఉద్యమిస్తుంటాను.అనుకోకుండా నాప్రత్యర్థులూ, నా సామాజిక వర్గ శత్రువులూ ఒకరే అవుతారు.
జాతీయత : భారతీయుడయిన జయప్రకాష్ నారాయణ్ నే.( కుదిస్తే ‘బీజేపీ’ అయిపోతుందని రాయటం మానేశాను. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి. బీజేపీ భావజాలానికి దగ్గరగా వున్న నగర మధ్యతరగతి వర్గం, నా పట్ల కూడా శ్రధ్ధ చూపుతారు.)
మతం : సెక్యులరిస్టునే. కానీ ఎందుకనో, నా పట్ల హిందువులు ఆకర్షితులయినట్లుగా ముస్లింలూ, క్రైస్తవులూ- ఆకర్షితులు కారు.
వయస్సు :ఉద్యోగి గానే వుండి పోతే రిటయిరయ్యే వయసు. రాజకీయంగా అయితే ప్రారంభించే వయసు.(శేష జీవితాలనూ, అవశేష జీవితాలనే కదా- జాతికి అంకితం చేసేదీ? కానీ నేను చాలా ముందు రాజకీయాల్లోకి వచ్చేశాను. అందుకనేమో, ఎప్పటికప్పుడు మళ్ళీ ప్రారంభిస్తూ వచ్చాను. ఇప్పుడు ‘సురాజ్య’ కూడా అలాంటి ప్రారంభమే.
వృత్తి : పాఠాలు చెప్పటం. అసెంబ్లీలోనయినా, టీవీ స్టుడియోలోనయినా- ‘పబ్లిక్ అడ్మినిస్టేషన్’ పాఠాలు ఒప్పచెప్పగలను. పలురకాల ప్రజాస్వామ్యాలగురించీ, రాజ్యాంగాల గురించీ ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల’ కోసం చదువుకున్నాను లెండి!
హాబీలు :1) శ్రోతల సంఖ్యతో పనిలేకుండా గంభీరోపన్యాసాలు ఇవ్వటం.
2) నిర్మానుష్యప్రాంతాలలో కూడా రోడ్ షోలను నిర్విఘ్నంగా కొనసాగించటం.
విద్యార్హతలు : ప్రాక్టీసులేని ఎం.బి.బియస్, త్యాగం చేసిన ఐయ్యేఎస్.
గుర్తింపు చిహ్నాలు : 1) ఓటు హక్కురాని విద్యార్థులూ, బూత్‌లవరకూ నడవలేని వయోవృద్ధులూ ఎక్కడ వుంటారో, అక్కడ వుంటాను.
2)ఖ్యాతి ఖండాంతరంగా వుంటుంది. గెలుపు మాత్రం కుకట్ పల్లికే పరిమితం.
అనుభవం : 1) నేను అవినీతి వ్యతిరేకోద్యమం మొదలు పెట్టినప్పుడు అవినీతి వందల కోట్లలో వుండేది. ఇప్పుడు లక్షల కోట్లకు దాటింది. ఫలితం వచ్చిందా? లేదా? 2) నా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పెద్ద పీట వేశాను.. అయినా పార్టీలో నా పేరు తప్ప వేరే ఏ పేరూ జనానికి తెలియదు!
ఇష్ట పదాలు : ‘సురాజ్యం’ (‘సుర’ రాజ్యం అని చదవకండి. ఎందుకంటే ‘సురాపాన’ రాజ్యం ఇప్పటికే వుంది.)
బిరుదులు : ‘ఆంధ్ర’ హజారే, ‘లోకల్’ కలామ్
బ్లడ్ గ్రూప్ : చెప్పను. ఎందుకంటే రక్త బంధువులకు రాజకీయ వారసత్వాన్నివ్వటానికి నేను వ్యతిరేకం.( నా సామాజిక వర్గం వారే నన్ను గెలిపించటానికి ముందుకు వస్తే అది నా తప్పు కాదు.)
పడని వస్తువులు : సీజన్‌ను బట్టి వుంటుంది. ఒకప్పుడు ‘ఫ్యాక్షనిజం’ ఇప్పుడు అవినీతి.
ఎత్తు :‘ఎత్తు వేయటమే తెలిస్తే, అసెంబ్లీలో ‘ఏక్ నిరంజన్’లాగా ఒక్క స్థానంతోనే ఎందుకు సరిపెట్టుకుంటాను.
చిరునామా : కేరాఫ్ కుకట్ పల్లి.
ఆశిస్తున్న జీతం : ఇప్పుడు ఆశించినా ప్రయోజనం లేదు. ఉద్యోగాన్ని ఎప్పుడో వదలుకున్నాను.
జీవిత ధ్యేయం : ‘సురాజ్య’ స్థాపన.(‘సమ రాజ్యం’ కోసం కావాలంటే మీరు ప్రయత్నించుకోండి.)
– సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 8-16 డిశంబరు 2012 సంచిక లో ప్రచురితం)
సతీష్ చందర్ గారు… మీ వివరణాత్మక చమత్కార రచన చాలా బాగుంది..
ఇటీవల కాలం ఇంత మంచి వాస్తవ దృక్పదం వున్నా చమత్కార రచన చదవలేదు..
మిమ్మల్ని మేచ్చుకోవడమంటే.. దివిటీ పెట్టి సూర్యుని చూపినట్లవుతుందని నా అనుభవం. అద్భుతం. అని ఒక్క మాట అంటాను.పట్టువదలని విక్రమార్కులని పరీక్షరాయకున్దానే మార్కులు కొట్టేసే వర్గ ప్రాతినిధ్యం. మీరు చెప్పినట్లు ప్రతి అడుగు “రాజ గురువులను” అడిగేవేస్తారు. కొందరు మాత్రం కడిగేస్తుంటారు. సురాజ్య స్థాపనకు కూడా అవినీతి ప్రభువుల మద్దతు కోరగాలిగిన మహనీయులు..చిరంజీవిని, నారాయణను ఆలింగనం చేసుకున్న వారు దత్తన్న , బొత్సా, కె సి ఆర్ ను గాఢపరిష్వంగంలోకి తీసుకోగలరు. “సత్తా”కు సంబంధిచిన ఒక రాజకీయ వ్యాసాన్ని కొన్ని సంవత్సరాల కిందట రాస్తే ఆయన తోకతొక్కిన… లా లేచి.. సర్దుకున్నారు. అది త్వరలో పోస్ట్ చేస్తా సతీష్ చందర్ గారు.