ఏనుగు లేదా? ఎలుకయినా, ఓకే!

shabbirటాపు(లేని) స్టోరీ:

ప్రేయసిని కోల్పోతే..? దేవదాసు అవుతాడు.

పదవిని కోల్పోతే..?! ఖాళీగ్లాసు అవుతాడు.

అతనికీ, ఇతనికీ ఒక్కటే తేడా. ఒకడికి గ్లాసు ఫుల్లుంటుంది. ఇంకొకడికి గ్లాసు నిల్లుంటుంది.

ద్రవాన్ని బట్టి గ్లాసుకు విలువ కానీ, గ్లాసును బట్టి ద్రవానికి కాదు.

పదవి పోయినా పాలిటిష్యనూ, పదవి వున్న నేతా చూడ్డానికి ఒకేలా కనిపిస్తారు.

అది గంజిపట్టించి ఇస్త్రీ చేయించిన ఖద్దరు చొక్కా, అదే రేబన్‌ కళ్ళజోడూ, అదే క్వాలిస్‌ బండీ, అదే సఫారీ వేసుకున్న ఉబ్బిన బుగ్గలూ, బండ మీసాలూ వున్న మనుషులు.

కానీ దేవదాసు అలా కాదే..! మాసిన గెడ్డం, నలిగిన దుస్తులూ, దువ్వని చుట్టూ, వెంట శుభ్రమైన తెల్లని బొచ్చుకుక్క స్థానంలో, ఓ మురికి వీధి కుక్క.

కాస్ట్యూమ్స్‌( వస్త్రాలకంరణ)ను బట్టి ఇతడు ‘మా.మ’ (మాజీ మంత్రి) అని చెప్పలేం. చూడటానికి మంత్రిలాగానే వుంటాడు. ఇక గన్‌ మెన్‌ అంటారా? ‘నాకు పగవాళ్ళున్నారూ… నన్ను చంపేవరకూ మందు కానీ, ముక్కగానీ ముట్టమని ఒట్టేసుకున్నారూ…!’ అని కాగితం ఓ దొంగ ఏడుపు ఏడిచేస్తే, సఫారీ డ్రస్సు వేసుకుని, ముప్పొద్దులా మూడు బిర్యానీలు తినటానికి దిగిపోతారు.

ఇలా మంత్రికీ, మా.మకీ తేడాలేనప్పుడు, ఏ పదవీ లేని మా.మను గుర్తించటమెలా?

మా.మ కళ్ళల్లో కాంతి వుండదు. మునుపు ‘కరెన్సీ’బల్బుల్లా (అచ్చుతప్పు కాదు. కరెంటు బల్బులు కావు.) వెలిగే కళ్ళు, ఇప్పుడు మాడిన బల్బుల్లా వున్నాయి.( ఆ వెలుగులు ఉత్తనే వస్తాయా? ఎవరయినా వెయ్యిరూపాయిల నోట్ల కట్టల్ని లెక్క పెడుతున్నపుడు వాళ్ళ కంటిపాపల్లోకి చూశారా? ఈ నోట్ల ప్రతిబింబాలు కనిపడి, అవి కరెన్సీ బల్బుల్లా మెరుస్తాయి) హఠాత్తుగా ‘వవరు’ కట్టయిపోతే… బల్బు డిమ్మయిపోదూ..? పదవే వవరు; పవరే పదవి.

పవరంటే పైసలేనా? అలాగయితే పదవిలోవున్న పాలిటిష్యన్‌ దగ్గర వున్న పైసలకు మించి స్మగ్లర్ల దగ్గరా, బ్రోకర్ల దగ్గరా వుంటాయి. అందుచేత పైసల్ని మించింది పైరవీ. పవరే పైరవీ; పైరవీయే పవరు.

పైరవీ కి పైన వున్న రవి(సూర్యుడు) కూడా దిగివస్తాడు. (అందుక్కూడా దానికా పేరు వచ్చి వుండవచ్చు.) పైన సూర్యుడే కాదు. అతడి పితృదేవుడు( బాబు- అంటే బావుండదు.) వున్నా పైరవీకి దిగివస్తాడు. అంతెందుకు? భగవంతుడు వున్నాడా!(ఉంటే సంగతి లెండి!) పైరవీ దెబ్బకు తట్టుకోలేక, తనకిష్టులైన క్యూల్లోని పేదభక్తులను పక్కకు నెట్టేసి, ‘బ్రేక్‌ దర్శనం’ ఇచ్చేస్తాడు.

పైరవి అంటే మరేమీ కాదు, ప్రాధన్యాతా క్రమాన్ని మార్చి వెయ్యటం. అర్హులైన కాంట్రాక్టర్లందరినీ అడుక్కుతినమని విసిరేసి. అనర్హుడయిన కాంట్రాక్టరుకి పనులు కేటాయించట ముందే…! అదీ పైరవీ అంటే.suresh-reddy(1)

వయసులో వున్న ఆడపిల్లలు వయసులో వున్న మగపిల్లలకే ఆకర్షితులవ్వాలి. కానీ ఒక నిండుయవ్వని చేత వృధ్ధుడికి కన్ను కొట్టించాలీ అంటే పైరవీ చెయ్యాలి. మంత్రిలాగే, మా.మ కనిపించినప్పటికీ ఈ ఒక్క పనీ మాత్రం చెయ్యలేడు. క్యూని దాటించెయ్యాలి, రూల్సును పక్కన పట్టాలి. క్రమాన్ని మార్చెయ్యాలి(అందుకే అక్రమం అంటారు మరి!) ఈ పైరవీ చెయ్యాలీ అంటే పవరుండాలి. పవరుండాలంటే పదవి వుండాలి.

అంటే ఖాళీ గ్లాసు నిండాలి. ఒకప్పుడు పెద్ద పెద్ద పదవులే చేసివుండవచ్చు. కానీ ఇప్పుడు మాజీగా వుండలేరు కదా! అందుకే అతి చిన్న పదవి ఇచ్చినా సరే పుచ్చేసుకుంటారు. ఎప్పుడో ఏనుగు మీద ఎక్కి వుండవచ్చు. ఇప్పుడే వాహనమూ లేదు. కాబట్టి ఎలుకనిచ్చినా స్వారీ చేయటానికి రెడీ అయిపోతారు. అందుకే ‘ఏ పదవీ లేకుంటే ఎమ్మెల్సీ పదవే గతి!’ అంటూ ఎగబడిపోతున్నారు. అరడజను పదవులకు రెండువందల మంది దరఖాస్తులా? మా.మలే కాదు మాజీ స్పీకర్లు కూడా పోటీయా? అప్పుడప్పుడూ వార్తల్లో చదువుతుంటాం-సెక్యురిటీ గార్డు ఉద్యోగానికి పోస్టుగ్రాడ్యుయేట్లు వస్తున్నారని. మన రాష్ట్రంలో నిరుద్యోగమే కాదు, రాజకీయ నిరుద్యోగం కూడా తీవ్రంగా వుంది సుమండీ..!!

న్యూస్‌ బ్రేకులు:

ముందు, వెనుకలు!

వైయస్సార్‌ కాంగ్రెస్‌ను కాంగ్రెస్‌లో కలుపుతున్నట్లు విజయమ్మ అంగీకరించారు.

-కేటీఆర్‌, టీఆర్‌ఎస్‌ నేత

ఇంతకీ కాంగ్రెస్‌లో కలిపేది- మీ కన్నా ముందా? మీ తర్వాతా?

సంఖ్యాబలం లేకపోవటం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో తటస్థంగా వుంటున్నాం.

-కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

ఇప్పుడయినా ‘మైనారిటీల'(అల్పసంఖ్యాకుల) కష్టాలు అర్థమయ్యాయా?

ట్విట్టోరియల్‌

బ్యాచిలర్‌ ఆఫ్‌ ‘పోస్ట్స్‌’

పెళ్ళంటే పద్మవ్యూహం. పాఠ్యపుస్తకాలు పూర్తిగా చదివిన అర్జునులే ప్రవేశించాలి. గైడ్లు కొనేసుకుని బట్టీ పట్టి అర్థజ్ఞానులుగా మిగిలిపోయిన అభిమన్యులు కాదు. విడాకుల విలువ తెలిసిన వాడే వివాహమాడటానికి అర్హుడు. ఈ పెళ్ళి నిజంగానే పోలీసు ఉద్యోగం లాంటిది. అందుకే, సామెత చెప్పినట్లు, వెలుపల వున్న వాళ్ళు లోపలికీ, లోపల వున్న వాళ్ళు వెలుపలకీ రావాలని ఆరాట పడుతుంటారు. అయితే ఈ మధ్య రాజకీయాభిమన్యులు వెలుపల వుండి పోయినా సరే, పెళ్ళి అనే వృత్తంలోకి వెళ్ళటానికి ఇష్ట పడటం లేదు. ఎందుకంటే, అవివాహితులు( బ్రహ్మచారులు అని అందర్నీ అనలేం లెండి!) గా వున్న వారే రాజకీయాల్లో తెగ రాణించేస్తున్నారట. వాజ్‌ పేయీ ప్రధాని అయిపోయారు. అబ్దుల్‌ కలాం రాష్ట్రపతి అయి పోయారు. జయలలితా, మయావతీ, మమతా బెనర్జీ, మోడీలు ముఖ్యమంత్రులయిపోయారు. ఈ పోస్టుల్లో ఏ పోస్టూ చెయ్యకూడదనుకున్న ‘యువరాజు’ రాహుల్‌ గాంధీ కూడా ‘అవివాహితుడు’గానే వుండిపోదామనుకుంటున్నారు. పోస్టే చెయ్యనప్పుడు ఈ కఠిన నిర్ణయం దేనికో..!? ఈ పోస్టులు చెయ్యనన్నారు కానీ, ఇంత కన్నా పెద్ద పోస్టులు చెయ్యనని ఆయన అనలేదే..? ప్రధాని, రాష్ట్రపతిని మించిన పోస్టులున్నాయా? ఉంటాయి. ‘నెహ్రూ- గాంధీ’ కుటుంబ సభ్యులు ఏ కుర్చీలో కూర్చుంటే ఆ కుర్చీయే పెద్ద కుర్చీ అవుతుందన్న మూఢనమ్మకం ఒకటి ఈ దేశప్రజల్ని పట్టి పీడిస్తోంది. అందాకా.. ఊరికే.. సోనియా గాంధీ యూపీయే ఛైర్‌ పర్సన్‌ కుర్చీలో కూర్చున్నారు. అది అత్యున్నతాసనం అయిపోయింది. రేపు రాహుల్‌ చేత గోడ కుర్చీ వేయించినా, అది గొప్ప సింహాసనం కాగలదు. అందుకోసమే ఈ పరిణయ త్యాగం!?

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

ఫ్లవర్‌ బాంబు!

పలు ట్వీట్స్‌: మళ్లీ హైదరాబాద్‌లో వరుస బాంబు ప్రేలుళ్ళు జరుగుతాయని విక్కీ అనే వ్యక్తి పోలీసుల చెవిలో బాంబంత పువ్వు పెట్టాడట!

కౌంటర్‌ ట్వీట్‌: పోలీసు వారి హెచ్చరిక: మీ ఏ పోలీసు ఉద్యోగి చెవిలోనయినా గులాబీ కానీ, మందారం కానీ, కాలిఫ్లవర్‌ కానీ కనిపించినచో, సున్నాసున్నాసున్నా నెంబరుకి ఫోన్‌ చెయ్యగలరు.

ఈ- తవిక

రేప్‌ అండ్‌ ఎస్కేప్‌

‘అత్యాచారాలకు

కేంద్రమయ్యిందట

ఢిల్లీనగరం!’

‘అయితే అత్యాచారం చెయ్యాలంటే

ఢిల్లీ వరకూ వెళ్ళాలా?’

‘కాదు. ఇక్కడా చెయ్యొచ్చు.

చేసి తప్పించుకోవాలంటే

అక్కడికి వెళ్ళాల్సిందే.’

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘తొందర్లో స్థానిక ఎన్నికలొచ్చేస్తున్నాయోచ్‌!’

‘ప్చ్‌! ఏం లాభం? ఎప్పట్లా నీళ్లు కొనుక్కోవాల్సిందే.. ఒక్క మందే కదా ఫ్రీగా పోసేదీ..!?’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

ఉద్యమం తల్లి వంటిది. రాజకీయం ప్రియురాలి వంటిది. ఉద్యమం రమ్మంటుంది. రాజకీయం తెమ్మంటుంది.

-సతీష్ చందర్

(సూర్య దినపత్రిక 12-3-13 వ తేదీ సంచికలో ప్రచురితం)

 

Leave a Reply