‘కడగని’ పాత్రలు ఈ ‘నెగెటివ్‌’లు!

ఇలా రాసిందే రచన- అని ఏ రచయితనీ బెదరించలేం. ఇలా పెట్టిందే గుడ్డు- అని ఏ పిట్టనీ

వణికించలేం. అలా చేస్తే రాసింది రచనా కాదు. పెట్టింది గుడ్డూ కాదు. రచయితలంతా పుస్తకాలలోనుంచో,

విశ్వవిద్యాలయాల్లోంచో, పత్రికల్లోంచో పుట్టుకురావాలన్న షరతు కూడా లేదు. కల్లు కాంపౌండులోంచో, రెడ్‌ లైట్‌

ఏరియాలోంచో, వెలివాడలోంచో రచయిత పుట్టుకురావచ్చు. గుడ్లు పెట్టే వన్నీ ఫోరం కోళ్ళే కావాలని రూలు

లేదు. అడవిలోని కోడి కూడా గుడ్డు పెడుతుంది.
కెమెరా విజయకుమార్‌ రాయలని పథకం వేసుకుని రాయలేదు. రాయకుండా వుండలేక

రాసేశాడు. తాను వెనక్కి తిరిగి చూసుకునే సరికి రచయిత అయిపోయాడు. ఇంకేచేస్తాడు? తప్పించుకోలేడు.

ఊరందరి బెంగల్నీ మొయ్యాల్సిందే. అందుక్కూడా ఆయన సిధ్ధపడ్డాడు. కానీ ఊరువరకూ ఆయన్ని వెళ్ళనిస్తే

కదా! వాడ బెంగలే కాళ్ళకు చుట్టుకున్నాయి. ఇంక కదలితే వొట్టు.
అన్నీ ‘అంటరాని’ అనుభవాలే.
వాడలో అనుభవానికీ, అవమానానికీ తేడా వుండదు.
అక్కడో అందగత్తె పుడుతుంది. డయానాను ప్రిన్స్‌చార్లెస్‌ ఇష్టపడ్డట్టుగా ఏ ఊరప్రియుడో

ఇష్టపడతాడు. ఆమె పొంగిపోతుంది. కానీ ప్రిన్స్‌ఛార్లెస్‌ అయితే పెళ్ళాడతాడు. కానీ ఊర ప్రియుడు ఆ పని

చెయ్యడు. ఉంచుకుంటానంటాడు. ఆమె కుంచించుకు పోతుంది. ఆందమే అవమానమయ్యింది.
అక్కడో సరస్వతి పుడుతుంది. ఊరపిల్లలికి విద్యాబుద్ధులు చెబుతుంది. వాళ్ళుఎదిగిపోయి

తిరిగివస్తారు. ఆమెను దర్శించుకుంటామంటారు. ‘అది మాల పంతులమ్మ కదరా!’ అంటాడు తండ్రి. విద్య

అవమానమయ్యింది.
అక్కడో కుబేరుడు పుట్టడు కానీ, ఒకడు పుట్టి పొరపాటున సంపన్నుడవుతాడు. అతడి దగ్గర

పని చేసే సవర్ణ కూలీలు సైతం ‘ఒరేయ్‌ ఎంకా! మా కూలిడబ్బులిప్పించరా!’ అని నీచవాచకాలతో ‘గౌరవిస్తారు’

అక్కడ సంపద పేరు అవమానం.
సౌందర్యం, జ్ఞానం, సంపద- ఏవీ గౌరవ చిహ్నాలు కావు. అన్నీ అవమాన సూచికలే.
వీటికి విలువ ఊరి వరకే. వాడకు కాదు.
ఇదంతా బహిరంగ రహస్యమే.. కానీ ‘పురిటినొప్పుల్లా’గా ఏ కాన్పుకాన్పు కో కొత్త అనుభవం.
దేవుళ్ళూ, దయ్యాలూ వాడకు రారు
వీళ్ళందరూ చేసే పనిని ఒక కులం చూసుకుంటుంది.
భగవంతుణ్ణి ఎన్ని పేర్లతో పిలుస్తారో, కులాన్ని కూడా అన్ని పేర్లతోనూ పిలవ వచ్చు.
కులం సర్వాంతర్యామి, సర్వజ్ఞురాలు, సర్వశక్తిమంతురాలు.
కుష్టురోగిని తాకటానికి చాలా మంది భయపడతారు. కానీ ఆ కుష్టురోగి ‘అస్పృశ్యుణ్ణి’

తాకటానికి భయపడతాడు.. ఏది ‘పెద్ద రోగం’? కులమా? కుష్టా? కుష్టుకు మందుంది.
అస్పృశ్యులే కాదు. శూద్రులూ, స్త్రీలూ వేదం చదవకూడదు. కానీ సరస్వతి స్త్రీ మూర్తి.

ఆవిడకెవరు వేదం చెప్పారో? కులానికి సర్వజ్ఞత వుంది. ప్రశ్నించకూడదు.
ఒక బక్కపల్చని వాడు చితక బాదుతుంటే, బలాఢ్యుడు భరిస్తాడా? అస్పృశ్యుడికి ఎంత బలం

వున్నా లేనట్లే లెక్క, కులం శక్తి స్వరూపిణి.
‘ఇప్పుడు కులం పట్టింపులెవరికున్నాయి? రోజులు మారిపోయాయి.’
ఇలాంటి ప్రమాదకర నిర్థారణలు చేసే వాళ్ళు ఒక్క సారి కెమెరా విజయకుమార్‌ కథలు చదవాలి.
పరిమళాలను వెదజల్లే గంథపు చెట్ల తొర్రల్లోంచి విషనాగుని తీసినట్లుగా, సంస్కర్తలూ,

ప్రగతిశీలురూ, పౌరహక్కుల ఉద్యమ కారుల చేతల్లో విజయకుమార్‌ ‘కులాన్ని’ పట్టుకున్నాడు.
ఉక్కబోతగానే వుంటుంది. వెక్కిరింతగానే వుంటుంది.
అవమానమే అనుభవమయిన చోట, అధిక్షేపమే సాహిత్యమవుతుంది. ఉలికి పాటే ప్రతిస్పందన

అవుతుంది. తెలుగునాట రసజ్ఞులకు దళిత సాహిత్యం ఈ ‘రుచి’ చూపించింది.
కాకుంటే ఈ వెక్కిరింతకు ఎలాంటి అలంకారమూ జోడించకుండా, ఉన్నది వున్నట్లుగా,

పచ్చిగా, నగ్నంగా చూపిస్తున్నాడు విజయకుమార్‌.
ఈ కథలు జీవితాన్ని నగ్నంగా తీసిన చిత్రాలు. కడగని ‘నెగెటివ్‌’లు

ఈ కథల్లో శైలి వుందా? లేదా? ఏమిటా శిల్పం?
నెగిటివ్స్‌ లో రంగులు వెతకటం వృధా యత్నం.
నెగెటివ్‌ నెగెటివే.
ఈ డజను కథల్లో ఏ కథ చదివినా, ఎవరో తమ స్వీయ చరిత్ర చెబుతున్నట్లే వుంటుంది.
మానని గాయానికి కట్టు విప్పుతున్నట్లే వుంటుంది.
దళిత సాహిత్యంలోని కథకయినా, నవలకయినా, కవిత కయినా- స్వీయచరిత్రాత్మకాంశ

ఎక్కడో అక్కడ విధిగా వుంటుంది.
మరాఠీ దళిత రచయితలయతే తమ అవమానాలను చిత్రించటానికి ‘స్వీయచరిత్మ్రాత్మక

కథనాన్ని’ కథా రచనలో ఒక ముఖ్య స్రవంతిగా మార్చుకున్నారు.
ఈ ఎరుక లేకుండానే, కెమెరా విజయకుమార్‌ తన కథలకు ఆ రూపు నిచ్చారు.
అందుకే ఈ కథలు నిజంగానే నెగెటివ్‌లు.
కడక్కండి. రంగుల్ని అద్దకండి. నలుపూ ఒక రంగే. చీకటీ ఒక బతుకే.
నిజం విశ్వరూపం చీకటే. దర్శించి తరించండి.
(కెమెరా విజయకుమార్‌ కథలకు ముందుమాట)

-సతీష్‌ చందర్‌
2 డిసెంబరు 2008.

Leave a Reply