తీర్పు ఒక్కటే. భాష్యాలు వంద.
కర్ణాటక 2013 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇదే తంతు నడుస్తోంది. అంకెలు ఎవర్నీ బాధించటం లేదు.(గెలిచిన కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది.) అర్థాలే అందరికీ ముఖ్యమయిపోయాయి. ఈ అర్థాల్లో ఎవరికి వారు, తమ తమ రీతుల్లో ఊరట పొందుతున్నారు.
కాంగ్రెస్: ఎన్నికలు జరిగిన 223 స్థానాల్లో 121 చోట్ల గెలుపొందింది. రాహుల్ గాంధీ పనిగట్టుకుని ప్రచారం చేసాక కూడా ప్రతిపక్షంలో వున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి రాష్ట్రం. దీనితో ఆయనకున్న ‘ఐరన్ లెగ్’ ఇమేజ్ పోయింది. కాబట్టి ‘రాహుల్ ప్రచారం చేసి గెలిపించారు’ అని వారు ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఇంకొక ఆనందం కూడా వుంది. బీజేపీ ‘అర్థప్రకటిత'( అప్రకటిత- అని అనలేం) ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో (రెండు మినహా) కూడా ‘కమలం’ వాడిపోయింది. ఈ వార్త కాంగ్రెస్ వారికి మరింత ఆనందాన్నిస్తుంది.
బిజెపి: కర్ణాటకలో ఏ పార్టీ గెలిస్తే, కేంద్రంలో ఆ పార్టీ ఓటమిని చవిచూస్తుంది. అంటే 2014 పార్లమెంటు ఎన్నికల్లో ‘యూపీయే’ ఓటమి తథ్యం- అని ఢిల్లీలోని ‘కమలనాథులు’ తమ ‘జాతక చక్రాల’ను ముందు పెట్టుకుని ఊరట పొందుతున్నారు. అదీ కాక ఇది ‘అవినీతికి వ్యతిరేకంగా వేసిన వోటు’ అంటే ‘యెడ్యూరప్ప’కు వ్యతిరేకంగా వేసిన వోటు. బీజేపీ ‘యెడ్యూరప్ప’ అనే ‘కంతి’ని తొలగించుకున్నది. పైపెచ్చు దేశ వ్యాపితంగా ఇదే తీర్పు ఇస్తే రానున్న పార్లమెంటులో వోటరు ‘అవినీతి మయమయిన యుపీయే’ సర్కారును తిప్పి కొడతాడు. ఈ ఒక్క పాయింటు తో బీజేపీ వారు ప్రశాంతవదనులుగా మారిపోయారు.
కెజెపి: యెడ్యూరప్ప కొత్తగా పెట్టుకున్న కుంపటి ఇది. అరడజను సీట్లతో కుప్ప కూలింది. అయితే మాత్రం యెడ్యూరప్ప బాధగా వున్నారనుకుంటున్నారా? ఎంతమాత్రమూ కాదు. 2008లో బీజేపీ గెలవటానికి తానే కారకుణ్ణని నెత్తీ నోరూ బాదుకుని చెప్పినా, బీజేపీ అధిష్ఠానం యెడ్యూరప్పను చిన్న బుచ్చుతూనే వచ్చింది. తొలిసారిగా అప్పట్లో బీజేపీ దక్షిణభారతాన అధికారంలోకి రావటానికి కారణం బీజేపీ అన్ని చోట్లా వాడిన ‘హిందూత్వ’ కార్డు కాదు. ‘యెడ్యూరప్ప’ వేసిన కులం(లింగాయత్) కార్డు. ‘గాలి’ సోదరుల ‘బళ్ళారి’ లాబీని తొలుత తాను వ్యతిరేకిస్తే, బీజేపీ జాతీయ నాయకత్వం వారికి ఆశీస్సులిచ్చింది. చివరికి తానే ‘గాలి’ని ఆవహించారు. అవినీతి కేసుల ఉచ్చుల్లో ఇరుక్కున్నారు. పార్టీతో గొడవ పడ్డారు. కడకు పార్టీ(బీజేపీ) అంతు చూడాలనుకున్నారు. బీజేపీ 40 సీట్లతో చతికిల పడింది కదా! అంటే యెడ్యూరప్పే రాజకీయంగా ‘మానవ బాంబు’లా మారి, తాను పేలి పోయి, బీజేపీని పేల్చేశారు. ఆనందంగా వుండడు మరీ!
జెడి(యస్): ఒకప్పుడు ‘హంగ్ అసెంబ్లీ’ ఏర్పడ్డప్పుడు ఎటు వీలు కనపడితే అటు వాలి పోయిన ‘తండ్రీ కొడుకులు’ దేవెగౌడ- కుమార స్వామిలు. వీరి అవకాశవాద రాజకీయాలకు 2008 ఎన్నికలలో తగిన మూల్యమే చెల్లించారు. కానీ అనూహ్యంగా కుమార స్వామి నేతృత్వంలోని జెడి(యస్) బీజేపీతో సమానంగా సంఖ్యాబలాన్ని పెంచుకున్నది. ఈ పార్టీ రావటానికి కూడా ప్రధాన కారణం కులం కార్డు. ఒక్కలింగ కులస్తులు అధికంగా వుండే పాత మైసూరు ప్రాంతంలోనే 28 సీట్లను ఈ పార్టీ కైవసం చేసుకున్నది. దేశ రాజకీయ చిత్రపటం నుంచి దాదాపు తొలగిపోయిందనుకున్న జెడి(ఎస్) హటాత్తుగా ఇలా ‘ముఖ్య’ ప్రతి పక్షంగా వుండటం ఆనందం కాదూ!( కాక పోతే గతంలో లాగా ‘కింగ్ మేకర్’ పాత్రను నిర్వహించ లేదు. అంతే.)
ఎవరికి హాయిగొలిపే విశ్లేషణలు వారు చేసుకుని అన్ని పార్టీల వారూ నిమ్మకున్నారు.
అయితే కొందరు అంటున్నట్లుగా ఈ తీర్పు అవినీతికి మాత్రమే వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు కాదు. ఇంకా ఇతర కారణాలున్నాయి:
-అధికార పక్షంలోని అంత:కలహాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు. (అంత:కలహాలను ఒక మేరకే వోటరు క్షమిస్తాడు. కానీ, ఈ అంత:కలహాలను పాలనను అస్తవ్యస్తం చేస్తే తప్పక వోటరు శిక్షిస్తాడు.
-‘హిందూత్వ’ రాజకీయాలకు దక్షిణ భారతం అనువయినది కాదు. ఇక్కడ 2008 లో ‘కులం కార్డు’తో గెలిచింది. ఇప్పుడు ‘మతం’ కార్డు ముందుకు తెచ్చి వోడింది.
-ప్రజలు నిత్యావసరాల కోసం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ‘ప్రభుత్వ వ్యతిరేక వోటు’ కీలకమవుతుంది.
ఇదే నేడు వోటరు ఆడిన ‘కర్ణాటకం’!
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 13- 19 మే 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)