‘కలతా’ బెనర్జీ

Caricature: Balaram

పేరు : మమతా బెనర్జీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: యావజ్జీవ ముఖ్యమంత్రి వైభవం (పశ్చిమ బెంగాల్‌ జ్యోతిబసు రికార్డును కొట్టాలి కదా!)

ముద్దు పేర్లు : కోల్‌కొతా కాళిక, యుపీయే చండిక,

విద్యార్హతలు : సంకీర్ణ రాజకీయాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంటిపోరులో డాక్టరేట్‌. ‘దీదీ’గిరిలో డిప్లమా.

హోదాలు : యుపీయే ‘సింహభాగ’స్వామి( ఏ బడ్జెట్‌ లో నైనా ఎక్కువ భాగం అడుగుతాను),

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కుడివైపునకే వుంటాను.(లెఫ్ట్‌ ను బహిష్కరించాను)

రెండు: ‘రెడ్‌’ సిగ్నల్‌ పడ్డా ఆగను( ‘ఎరుపు’ ఎక్కడున్నా గుర్తించను)

చాలా? నా కమ్యూనిస్టు వ్యతిరేకతను చాటే ఇతర చిహ్నాలు కూడా చెప్పాలా?

సిధ్ధాంతం : సింపుల్‌ లివింగ్‌, హై బార్గయినింగ్‌. (సామాన్య జీవితం, భారీ బేరసారం) కాబట్టే కదా- కేంద్రంలో కాంగ్రెస్‌ వణికి చస్తోంది.

వృత్తి : ఏరివేత. (ఎక్కడయినా కమ్యూనిస్టు వ్యతిరేక నేతలు మార్క్సిస్టులనీ, మావోయిస్టులనీ ఏరి వేస్తారు. నేను ఏకంగా మార్క్స్‌నే ఏరి వేస్తాను- పుస్తకాల నుంచీ, పాఠ్యపుస్తకాల నుంచీ.)

హబీలు :1. కార్టూన్లు. గీయను. చూస్తాను. నాపై కార్టూన్లు వేసిన వారిని ఒక చూపు చూస్తాను

2. ‘నోనో’ అనటానికి బదులు ‘నానో’ అంటుంటాను. పారిశ్రామికాభివృద్ధి అంటే పెద్దగా పడదు.

అనుభవం : ముల్లును ముల్లుతోనే తీయాలనుకుని ‘ముల్లా’యంను ఆశ్రయించాను. కానీ తర్వాత తెలిసింది- ముల్లు పట్టుకున్న వారికే గుచ్చుకుంటుందని.(రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ముందు నాతో వంత పాడి తర్వాత ములాయం మాట మార్చాడు కదా!)

మిత్రులు : రాజకీయంలో శాశ్వత మిత్రులూ, శాశ్వత శత్రువులూ వుండరంటారు. సంకీర్ణ రాజకీయంలో మాత్రం తక్షణ మిత్రులు, తక్షణ శత్రువులు కూడా వుండరు.

శత్రువులు : బెంగాల్‌ మహిళకు బెంగాల్‌ పురుషుడే శత్రువు. ‘దీదీ’కి ‘దాదా’యే శత్రువు. అందుకే ప్రణబ్‌ కు మద్దతు ఇవ్వనన్నాను.

మిత్రశత్రువులు : కాంగ్రెస్‌ వారే. వారిదీ నాదీ ఇంజను, బోగీ సంబంధం. వాళ్ళు ఎన్ని బోగీలు తగిలించుకున్నా, రైలునూ, రైలు మంత్రినీ బెంగాల్‌కే తెచ్చుకుంటాను.

జీవిత ధ్యేయం : పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు తేవటం. మా పార్టీ ఎంపీల సంఖ్య పెంచుకుని సంకీర్ణ రాజకీయాల్లో మరింత కీలకం కావటం. అంతిమంగా బెంగాల్‌ ముఖ్యమంత్రీ, యుపీయే చైర్‌పర్సన్‌- జోడు పదవులూ నిర్వహించటం.

-సతీష్ చందర్

 

 

 

 

1 comment for “‘కలతా’ బెనర్జీ

Leave a Reply