కలవని కనుపాపలు

Photo By: Windell Oskay

రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు

ఒకటి: మాకు

రెండు: మా వాళ్ళకు

 

మధ్యలో ముక్కుమీద వేలేసుకున్న రోడ్డు

 

ఎవడో జల్సారాయుడు

వాడక్కూడా

అంటరాని రోగం తగిలించాడు

పుట్టుమచ్చల్లేని కవలల్ని

పచ్చబొట్లతో వేరు చేశాడు

 

మాదీ మావాళ్ళదీ-

ఒకరినొకరు చూసుకోలేని

కనుపాపల సహజీవనం

III

 

కన్నీళ్ళలా తోడేకొద్దీ ఉబికే బావి నీళ్ళు

రెంటికీ ఒకటే జల

అదే హృదయం కాబోలు

 

మధ్యలో ఎగనామం పెట్టుకున్న రోడ్డు

 

ఎవడో నిష్టాగరిష్టుడు

వాడచేత కూడా

మడికట్టించాడు

అయిన వాళ్ళకి ఆకుల్లో

పిండాలు పెట్టించాడు

 

మాదీ మావాళ్ళదీ-

ఉరిపడ్డ ఖైదీలు పెట్టుకున్న

ఉచ్ఛనీచాల వివాదం

III

 

పగిలిన కొబ్బరి చెక్కల్లా రెండు బావులు

అంతరంగమంతా ఒకటే తెలుపు

 

మధ్యలో తలంటుకున్న రోడ్డు

 

ఎవడో భక్తాగ్రేసరుడు

వాడక్కూడా

తిరునాళ్ళు రప్పించాడు

మేము శిరోజాలకు బదులు

ఒకరి శిరస్సుల్ని మరొకరు మొక్కుకున్నాం

 

మాదీ మావాళ్ళదీ-

నపుంసకుణ్ణి కట్టుకున్న

తోబుట్టువుల సవతి పోరు.

III

 

తెగిన లంకెబిందెల్లా రెండు బావులు

ఎక్కడ తడిమినా ఒకటే శూన్యం

 

మధ్యలో ముడివిప్పుకున్న రోడ్డు

 

ఎవడో సర్వసంగ పరిత్యాగి

వాడక్కూడా

సన్యాసాన్నిచ్చాడు

మేం నిండు యవ్వనంలో

వానప్రస్తాన్ని స్వీకరించాం

 

మాదీ మావాళ్ళదీ

కందిన మద్దెల బుగ్గల

నిసర్గ సౌందర్యం

III

 

ఇద్దరి పంచముల కోసం రెండు బావులు

ఎందులో దూకినా ఒకటే చావు

 

మధ్యలో బుసలు కొడుతున్న రోడ్డు

 

ఎవడో మనువుతాత మునిమనవడు

వాడక్కూడా

వర్ణాశ్రమాన్ని బోధించాడు

తలకాయల్ని కోల్పోయిన మేం

తనువుల్తో స్వీకరించి

తలోబావిలో దూకాం.

 

మాదీ మావాళ్ళదీ-

గెలలు నరికిన

అరటి మొక్కల సహజ మరణం

 

ఎంత వెతికినా కనపడని రెండు బావులు

ఎటు చూసినా ఒక్కటే సరోవరం

 

మధ్యలో తోకముడిచిన రోడ్డు

 

ఎవరో ఇద్దరు అమర ప్రేమికులు

వాడ కోసం

పడవను బహూకరించారు

 

నేనూ నా సహచరుడూ

నలుదిక్కులా ప్రయాణించి

ఒకే ఒక్క తామర పువ్వును కోసుకొచ్చాం.

 

మేమిక-

ఎన్ని కిరణాలతో గుణించుకున్నా

మా చుట్టూ ఒకే ఒక్క సూర్యోదయం

-సతీష్  చందర్

(పశ్చిమ గోదావరి జిల్లా కొమ్ముచిక్కాల గ్రామంలోని రెండు శాఖల దళితుల కోసం రెండు బావులు పక్కపక్కనే ఏర్పాటు చేశారు)

Leave a Reply