కలవని కనుపాపలు

రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు
ఒకటిః మాకు
రెండుః మా వాళ్ళకు
మధ్యలో ముక్కుమీద వేలేసుకున్న రోడ్డు

ఎవడో జల్సారాయుడు
వాడక్కూడా
అంటరాని రోగం తగిలించాడు
పుట్టుమచ్చల్లేని కవలల్ని
పచ్చబొట్లతో వేరు చేశాడు

మాదీ మా వాళ్ళదీ-
ఒకరినొకరు చూసుకోలేని
కనుపాపల సహజీవనం

కన్నీళ్లలా తోడే కొద్దీ ఉబికే బావి నీళ్ళు
రెంటికీ ఒకటే జల
అదే హృదయం కాబోలు
మధ్యలో ఎగనామం పెట్టుకున్న రోడ్డు

ఎవడో నిష్టాగరిష్టుడు
వాడచేత కూడా
మడికట్టించాడు
అయిన వాళ్ళకి ఆకుల్లో
పిండాలు పెట్టించాడు

మాదీ మావాళ్ళదీ –
ఉరిపడ్డ ఖైదీలు పెట్టుకున్న
ఉచ్ఛనీచాల వివాదం

పగిలిన కొబ్బరి చెక్కల్లా రెండు బావులు
అంతరంగమంతా ఒకటే తెలుపు
మధ్యలో తలంటుకున్న రోడ్డు

ఎవడో భక్తాగ్రేసరుడు
వాడక్కూడా
తిరునాళ్ళు రప్పించాడు
మేము శిరోజాలకు బదులు
ఒకరి శిరస్సుల్ని మరొకరు మొక్కుకున్నాం

మాదీ మా వాళ్ళదీ-
నపుంసకుణ్ణి కట్టుకున్న
తోబుట్టువుల సవతి పోరు.

తెగిన లంకె బిందెల్లా రెండు బావులు
ఎక్కడ తడిమినా ఒకటే శూన్యం
మధ్యలో ముడివిప్పుకున్న రోడ్డు

ఎవడో సర్వసంగ పరిత్యాగి
వాడక్కూడా సన్యాసాన్నిచ్చాడు
మేం నిండు యవ్వనంలో
వానప్రస్తాన్ని స్వీకరించాం

మాదీ మావాళ్ళదీ-
కందిన మద్దెల బుగ్గల
నిసర్గ సౌందర్యం

ఇద్దరి పంచముల కోసం రెండు బావులు
ఎందులో దూకినా ఒకటే చావు
మధ్యలో బుసలు కొడుతున్న రోడ్డు

ఎవడో మనువు తాత ముని మనవడు
వాడక్కూడా
వర్ణాశ్రమాన్ని బోధించాడు
తలకాయల్ని కోల్పోయిన మేం
తనువుల్తో స్వీకరించి
తలో బావిలో దూకాం

మాదీ మా వాళ్ళదీ-
గెలలు నరికిన
అరటి మొక్కల సహజ మరణం

ఎంత వెతికినా కనపడని రెండు బావులు
ఎటు చూసినా ఒక్కటే సరోవరం
మధ్యలో తోకముడిచిన రోడ్డు

ఎవరో ఇద్దరు అమర ప్రేమికులు
వాడకోసం
పడవను బహూకరించారు
నేనూ నా సహచరుడూ
నలుదిక్కులా ప్రయాణించి
ఒకే ఒక్క తామరపువ్వును కోసుకొచ్చాం
మేమిక –
ఎన్ని కిరణాలతో గుణించుకున్నా
మాచుట్టూ ఒకే ఒక్క సూర్యోదయం

(పశ్చిమగోదావరి జిల్లా కొమ్ముచిక్కాల గ్రామంలోని రెండు శాఖల దళితుల కోసం రెండు బావులు పక్క పక్కనే ఏర్పాటు చేశారు.)
(సతీష్ చందర్ ‘పంచమవేదం’ ప్రచురణకలం, జూన్ 1995, నవ్య ప్రచురణ, హైదరాబాద్)

Post navigation

4 comments for “కలవని కనుపాపలు

  1. sir mi poetry chala bagumdi inati dalitula madya vivadalani anade mi kavita chala spastamga ceppagaligaru. diniki karanam mi bhashalo manuvu gadi muni manavadu anna sutrikarana cala adbhutam
    siddardha maddirala
    hcu

  2. According to indian society “కలవని కనుపాపలు” కనపడని పాపాలు

Leave a Reply