కవులు వేలాది! నిలిచేది జాలాది!!

జాలాది (photo courtesy Itsvizag)

కంటి సూరట్టుకు జారతాంది
సితుక్కు సితుక్కు నీటి సుక్క…!

గుండెను చెమ్మ చేసి వెళ్ళి పోయాడు-జాలాది. చూడటానికి రైతులాగా, మాట్లాడటానికి మిత్రుడిలాగా, హత్తుకోవటానికి బంధువులాగే అనిపించే జాలాది-వినటానికి మాత్రం పసిపాపలాగా అనిపించేవాడు.

నలిగిపోయిన మనిషి, బతుకులో ఎత్తుపల్లాలు చూసి అలసిపోయిన మనిషి, అమ్మ వొడి నుంచి బతుకు బడి వరకూ అవమానాలకు అలవాటు పడిపోయిన మనిషి- ఒక మాట అంటేనే ఎవరో లోయలోంచి అరిచినట్లుంటుంది. అలాంటి మనిషిలో కవి వుంటే, ఇంకే ముంది గుండెలోతుల్లోనుంచి వచ్చినట్టు వుండేది.

ముసురు పట్టిన పగటి పూట, పల్లెటూరులోని ఒక తాటాకు ఇల్లు అరుగు మీద వుండి, చూరు నుంచి వేళ్ళాడే వాన బొట్లను ఎప్పుడు చూసినా జాలాది కవిత్వం జల్లుజల్లుగా వచ్చి తడిపి వెళ్ళిపోతుంది..
‘సూరట్టుకు జారతాది సితుక్కు సితుక్కు వానసుక్క
గుండెల్నే గుదిపేత్తాది..గతుక్కు గతుక్కు ఏందే అక్క’
వాన నీటి చప్పుడు విన్నప్పుడెల్లా ఈ పాట తప్ప మరొకటి గుర్తుకు రాదు.

ఇలాంటి కవిని ఎప్పడయినా కలవగలనని కూడా అనుకోలేదు. కలవాలని కూడా అనిపించలేదు.
అలాంటిది పదిహేనేళ్ళ క్రితం జగ్గయ్య పేటలో జర్నలిస్టుల సభలో మాట్లాడటానికి పిలిస్తే వెళ్ళాను. ఆ సభలో ఆయనకూడా మాట్లాడారు. నేను మాట్లాడుతున్నప్పుడు పసిపిల్లాడిలా పడిపడీ నవ్వేశారు.. చనువయిపోయారు. దగ్గరకి తీసుకున్నారు. ఏకవచనంలోకి కూడా దిగిపోయారు.
‘మీరందరూ రాస్తున్న కవిత్వం చదువుతున్నా. ఎందుకయ్యా, మన దేశం మీదా, దేశసంస్కృతి మీదా పడతారు? కులం మీద పడండి. దేశం ఎందుకు కోపం..?’ అన్నారు.
అప్పుడాయన మీద కించెత్తు కోపం వచ్చింది. జాలికూడా వేసింది. నేను నవ్వి ఊరుకొన్నాను.

ఆ సమయంలో నాకు గుర్తుకొచ్చింది. ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట. దేశ భక్తి గీతాలు తెలుగులో టన్నులకొద్దీ వుంటాయి. కానీ వింటున్నప్పుడు ‘ఒళ్ళంతా పిడికిలి’ అయితే, అదే నిజమైన దేశభక్తి గీతం. జాలాది రాసిన ఈ పాట వింటున్నప్పుడెల్లా ఇదే అనుభూతి కలిగేది. సీనియర్‌ పాత్రికేయులు ఎ.బి.కె. ప్రసాద్‌ స్వంతంగా ఒక పత్రిక నిర్మిద్దామని సంకల్పించినప్పుడు, ఆయనతో పాటు తిరుగుతున్నాను. నేనేకాదు, ఆయన కూడా ఈ పాటను పదేపదే వినటానికి ఇష్టపడేవారు. కారులో ఆ పాటనే ‘రీ ప్లే’ చేయిస్తుంటే, డ్రైవర్‌ తలపట్టుకునే వాడుకూడా. ఎన్ని సార్లు విన్నా, అదే భావావేశం..! ‘అల్లూరి సీతారామ రాజు’ సినిమా కోసం శ్రీశ్రీ రాసిన పాట ‘ఎవడు వాడు, ఎచటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు..?’ విన్నప్పుడు కూడా ఇలాగే అనిపించేదికానీ, ఆ పాటను ఎప్పుడూ వరసగా ఇన్ని సార్లు వినలేదు.

ఇంతటి దేశభక్తి రాయప్రోలుకో, శ్రీశ్రీకో ఉండటం విశేషం కాదు. వారూ, వారి పూర్వికులూ ఈ దేశంలోని సొంఘిక వ్యవస్థలోని వెచ్చదనాన్ని అనుభవించనవారే. కానీ ఈ దేశభక్తి ఒక జాషువాకీ, ఒక జాలాదికీ వుంటం విశేషం. ఈ దేశం వీరికి అవమానాల్నే మిగిల్చింది. ఈ అవమానం జాలాది రాజారావుకి తెలుసు. ఆయన తండ్రి ఇమ్మానుయేల్‌ కీ తెలుసు. ‘సొంత ఊరే’ లేకుండాచేసిన,( వాడ మాత్రమే మిగిల్చిన) విష సంస్కృతిని పక్కన పెట్టి, దేశాన్ని కీర్తించటమంటే, వద్దని వదిలేసిన అమ్మను పొగడటమంత కష్టమైన పని. ఈ పని జాషువా తర్వాత, జాలాది మాత్రమే చేయగలిగారు.

కఠినంగా, బింకంగా కనిపించే జాలాది మాట్లాడితే శాసించినట్లుండేది. చనువుతో కూడిన ఆయన పెద్దరికం ముందు అందరూ శిరస్సు వంచినట్టు కనిపించేవారు. కానీ నిజానికి ఆయన వినమ్రుడు. కాకుంటే, తాను తక్కువ వాడిని కానని, ఇంటా బయిటా నిరూపించుకోవటానికే జీవితం మొత్తాన్ని ఖర్చుచేశారు. ఫలితం పొందారు. కొన్ని సామాజిక వర్గాలకే ఆలవాలమయిన చిత్ర పరిశ్రమలో ఒక మోదుకూరి జాన్సన్‌, ఒక జాలాది కలం పట్టి అగ్రస్థానంలో నిలవగలవటం, మానవుడు చంద్రమండలం మీద కాలు మోపినదానికంటే పెద్ద విజయం.

వులు వేలాది… కానీ, నిలిచేది జాలాది…!
-సతీష్‌ చందర్‌
13 అక్టోబరు 2011

6 comments for “కవులు వేలాది! నిలిచేది జాలాది!!

 1. అద్భుతం అన్నగారు!చాలా కాలం తర్వాత ఇంత గొప్ప ఆప్తవాక్యం మీ నుంచి.అన్నట్టు జాలాది గారి ఫొటో ఉన్న ఇట్స్ వైజాగ్ నాదే.సద్వినియోగం అయ్యింది చాన్నాళ్లకి.

 2. చాలా గొప్ప నీరాజనం…నిజమే ఇప్పటికీ అంటిపెట్టుకున్న కులంపై జరగాల్సినంత పోరాటం జరగడం లేదు…ఏదో ఒక కక్కుర్తికి లోనైపోతూ పక్కకు నెట్టబడుతూ రాజకీయులకు అంటకాగుతున్న నాయకత్వం…జరగాల్సిన దానిని గుర్తెరగ చేసిన అనుభవజ్నులైన జాలాదికి జోహార్లర్పిస్తూ గుండె తడి చేసిన మీకు ధన్యవాదాలు సార్…

 3. “కవులు వేలాది …జాలాది ఒక్కరే !”
  యిదొక్క వాక్యం చాలు జాలాది గారిపై మీకున్న గౌరవం ప్రేమ ఎంతటిదో తెలుసుకోవడానికి . వారి గురించి వారితో మీకున్న సాన్నిహిత్యం గురించి మీరు తెలియజేసిన విధానం చాలా బాగుంది . దళిత మేధావుల్లో ఒక ప్రశస్థమైన తారకను దళిత లోకం పోగొట్టుకున్నట్టైంది.వారి ఆత్మకు శాంతి కలుగాలని ఆశిస్తున్నాను !!!

  REPLY

 4. మొన్న (శనివారం)జాలాది గారి అంత్యక్రియలకు హాజరయ్యాను.ఆయనకు ఇంటిదగ్గర నివాళులు
  అర్పించిన వాళ్ళ సంగతేమోగాని,నేను అంత్యక్రియల దగ్గర(వాల్టేర్ సిమెట్రీ)ఉన్న అయిదున్నరగంటల్లో
  అక్కడికి వచ్చిన వాళ్లలో బంధుమిత్రులు,అభిమానులు తప్ప ఒక్క ప్రముఖుడూ కనిపించలేదు,వస్తారని నేనూ ఊహించలేదు.
  నిన్న(ఆదివారం సాయంత్రం)జాలాదిగారి ఇంటిదగ్గర సంస్మరణ సభ జరిగింది.సభాప్రారంభానికి ముందర
  కొందరు ఎమ్మెల్యేలు తప్ప మరే ప్రసిధ్ధులూ కనిపించలేదు.ఇంట్లోకెళ్ళి కూర్చుని జాలాది గారి పిల్లలతో
  మాట్లాడుతూ ఉండిపోయాను తప్ప శ్రీమతిజాలాదిని చూసే ధైర్యం చేయలేకపోయాను.సంస్మరణసభలో
  పాల్గొన్న బంధుమిత్రులు నాకు తెలియని చాలా విషయాలు తెలియజేసారు.అవి మరొక్కసారి తీరిగ్గా
  నా బ్లాగులో.

Leave a Reply