‘కాంగ్రేజీ’ వాల్‌!

caricature: balaram

caricature: balaram

పేరు :కేజ్రీవాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: అర్థాంతరపు ముఖ్యమంత్రి

ముద్దు పేర్లు : ‘కాంగ్రేజీ’ వాల్‌ (కాంగ్రెస్‌తో ‘చెయ్యి’ కలిపాను కదా!), ‘ముప్పావు కేజీ’ వాల్‌ (ఇంక్కొక్క పావు కేజీ (ఎనిమిది) సీట్లు వచ్చి వుంటే, నా అంతట నేనే, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవాడిని.

విద్యార్హతలు : మొన్నటి వరకూ ‘ఐఆర్‌ఎస్‌'( ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌), నేటి నుంచి ‘ఐ డబ్ల్యూ ఎస్‌’ (ఇండియన్‌ వాటర్‌ సర్వీస్‌), ప్రతీ ఇంట్లో ‘ఏడు వందల బాల్చీల(లీటర్ల) నీళ్ళు’ పోద్దామనుకుంటున్నాను. (ఇవ్వక పోతే ముఖ్యమంత్రిగా నేనే బాల్చీ తన్నాల్సి వుంటుంది.)

హోదాలు : సి.ఎం.( అంటే చీఫ్‌ మినిస్టర్‌ కాదండోయ్‌! కామన్‌ మేన్‌ అనగా ‘ఆమ్‌ ఆద్మీ’) అందుకే ‘సెక్యూరిటీ వద్దం’టున్నాను. ‘చీపురు కట్ట’ లు చేతిలో వుండగా వేరే ఆయుధాలున్న మనుషుల రక్షణ నాకెందుకు?

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఒకప్పుడు ‘అన్నా'(హజారే)కు తమ్ముణ్ణి. ఇప్పుడు అన్ననూ నేనే. తమ్ముణ్ణీ నేనే.

రెండు: అనుభవంలో ‘ఎల్‌ కేజీ’ వాల్‌ని. విజయంలో ‘పీజీ’ వాల్‌ని.

సిధ్ధాంతం : అవును కదా! అలాంటిది ఒకటి వుండాలి. అవినీతిని వ్యతిరేకించటమే పెద్ద సిధ్ధాంతమనుకున్నాను. అయినా సిధ్ధాంతం లేక పోవటం కూడా ఒకందుకు మంచిదే అయ్యింది. లేక పోతే ఏ కాంగ్రెస్‌ని తిట్టి ఇన్ని సీట్లు సాధించానో, అదే కాంగ్రెస్‌ మద్దతుతో ఢిల్లీ సర్కారును స్థాపించటం సాధ్యమయ్యేది కాదు.

వృత్తి : నిన్నటి వరకూ ‘తుడిచేయటం’. ఇప్పుడు ‘తుడిచేసుకోవటం'( అధికారంలోకి వస్తున్నాం కదా! ఆ మాత్రం నేర్చుకోవాలి) ఎన్నికల గుర్తు ‘చీపురు’ లెండి!

హబీలు :1. హామీలే. ఉన్నది ఢిల్లీలో అయినా, గల్లీ,గల్లీకో హామీ ఇచ్చాను. అధికారంలోకి వస్తామనీ, నిజంగా వాటిని తీర్చాల్సివస్తుందని కలగన్నానా? ఏమిటి?

2. షరతులు. మద్దతుకు ముందు చాలా షరతులు పెట్టాను. వాటికి కాంగ్రెస్‌ గానీ, బీజేపీ కానీ ఒప్పుకోవాలీ- అంటే, రాజ్యాంగాన్ని నూటొక్క సార్లు మార్చాలి. ఇప్పుడు షరతులు నాకు నేనే పెట్టుకోవాల్సి వస్తుందేమో! మా పార్టీ ప్రణాళికను కొంచెం మార్చుకుంటే సరిపోతుందేమో!

అనుభవం : ‘రామ్‌ లీలా’ మైదానం లో అన్నా హజారే పక్కన కూర్చున్న అనుభవం తప్ప, ఏ రాజకీయ పదవినీ అలంకరించిన అనుభవం లేదు.

మిత్రులు : ‘ఆమ్‌ ఆద్మీ’ లే నా మిత్రులు. కాంగ్రెస్‌కు వ్యతిరేకం గా నన్ను నిలబెట్టి గెలిపించిందీ వారే, మళ్ళీ అదే కాంగ్రెస్‌తో ‘దోస్తీ’ చెయ్యమని సలహా ఇచ్చిందీ( అభిప్రాయ సేకరణ చేసాను లెండి.) వారే. ఇలా ఎలా అంటారు? అదే ఆశ్చర్యం!

శత్రువులు : బధ్ధ శత్రువయిన కాంగ్రెస్‌ నే మిత్రుడిగా ప్రకటించాక, ఇంకా శత్రువులెవరుంటారు చెప్పండి!

మిత్రశత్రువులు : ‘కాషాయ దళం’ వారూ కాంగ్రెస్‌ ను వ్యతిరేకించారు. నేనూ కాంగ్రెస్‌ను వ్యతిరేకించాను. కానీ, నేనే పోటీలో లేకుంటే తాము గెలిచేవారిమని వారి దురాశ. అసలు రహస్యం వారికి తెలియదు. నాకు పడినవి ‘నోటా’ ( పైన ఇచ్చిన పేర్లేవీ కావు) వోట్లు. అంటే కాంగ్రెస్‌కీ, బీజేపీకీ వేయటానికి ఇష్టంలేని వారు నాకు వేశారు.

వేదాంతం : ఏ రోజు కా రోజు ‘ఏక్‌ దిన్‌ కా సుల్తాన్‌’ అని గడిపేయటానికి మించిన వేదాంతం లేదు. రేపు నేను ఢిల్లీ పీఠం ఎక్కాక ఇలాగే అనుకుంటాను.( ఎప్పుడు ఎవరు ‘చెయ్యి’స్తారో తెలియదు)

జీవిత ధ్యేయం : తీరిపోయింది. ‘చీపురు’ ‘చేతి’ కిచ్చెయ్యటమే కదా!

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 28 డిశంబరు2013- 3 జనవరి 2014 సంచికలోప్రచురితం)

4 comments for “‘కాంగ్రేజీ’ వాల్‌!

  1. ఆర్టికల్ చాలా బాగుంది.. సెటైరిక్ గా.. రేపటి ఆప్ ప్రయాణం.. కాంగ్రెస్ వారితో వచ్చే తిప్పలు.. చెప్పకనే చెప్పారు.. దట్ ఇస్ సతీష్ చందర్ సార్…

  2. గ్రేట్ ఆంద్ర లో కూడా చూశాను గురూ గారూ! భలే నవ్వించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు

Leave a Reply