కరుణానిధి కన్నుమూసిన కొన్ని రోజులకే వాజ్‌పేయీ తుదిశ్వాస విడిచారు. ఇద్దరి మధ్యా పోలికలే కాదు.., పోలికల్లో వ్యత్యాసాలూ,వ్యత్యాసాల్లో పోలికలూ వున్నాయి. ఇద్దరూ తొమ్మిది పదులు దాటి జీవించారు. ఇద్దరూ మంచి వక్తలే. కాకుంటే కరుణ తమిళలంలో దంచేస్తే, వాజ్ పేయీ హిందీలో ఊపేస్తారు. ‘ఏ రాష్ట్రమేగినా’ ఒకరు తమిళం తప్ప హిందీని ముట్టరొకరు. ‘ ఏ వేదికెక్కినా'( కడకు ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో కూడా) హిందీ నే ఆశ్రయిస్తారు ఇంకొకరు. ఇద్దరూ ఒకే పదవిని తిరిగి, తిరిగి అలంకరించారు. కరుణ ముఖ్యమంత్రి కుర్చీలో అయిదు సార్లు కూర్చుంటే, వాజ్ పేయీ ప్రధాని పదవిని ముమ్మారు స్వీకరించారు. ఇద్దరూ చట్టసభల్లో పీఠం వేశారు . కరుణా నిధి తమిళినాడు అసెంబ్లీకి వరుసగా 13 సార్లు ఎన్నికయితే, వాజ్‌పేయీ పార్లమెంటులో 12 సార్లు ప్రాతినిథ్యం వహించారు. కరుణది దక్షిణ భారతం; వాజ్‌పేయీది ఉత్తర భారతం. భావజాలల్లోనూ అంతే. ‘ఎడమ-కుడి’లే. బ్రాహ్మణాధిపత్యాన్నీ ఆర్యసంస్కృతినీ తూర్పారబెట్టే ద్రావిడ ఉద్యమం ఒకరికి పునాది అయితే, ఆర్య సంస్కృతే యావధ్భారత సంస్కృతి అని భావించే ‘అరెస్సెస్సే’ మరొకరికి ఆయువు పట్టు.
గళంతో పాటు ఇద్దరూ కలం పట్టిన వారే. అయితే కరుణకు కలమే తొలుత జీవనాధారం. కానీ వాజ్‌పేయీ కలం ఒక వ్యాపకం. ఒకరు కథలు రాస్తే, ఇంకొకరు కవితలల్లారు. కానీ వ్యక్తిగత జీవితంలో వ్యత్యాసమే తప్ప పోలిక మాత్రం లేదు. కరుణ జీవితంలో ముగ్గురు స్త్రీలు భాగస్వాములుగా వస్తే, వాజ్ పేయీ అవివాహితుడిగానే వుండిపోయారు.
పలు సారూప్యాలున్న ఈ రెండు భిన్నధృవాలూ ఎప్పుడయినా. ఏవిషయంలోనైనా కలిశాయా? ఎందుకు కలవలేదూ? శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న సూత్రాన్ని ఇద్దరూ ఒంటబట్టించుకున్నవారే. అందుకే, బీజేపీకి ఎఐఎడిఎంకె తో (జయలలితతో) వైరం వచ్చిందనగానే, కరుణ (డి.ఎం.కె) బీజేపీతో వియ్యమందేశారు. వాజ్పేయీతో స్నేహం మళ్ళీ సార్వత్రిక ఎన్నికలొచ్చేటంత వరకూ సాగించారు. అలా ఒక సందర్భంలో ‘ఉత్తర, దక్షిణాలు’ కలిశాయి. కారణం: సంకీర్ణ ధర్మం.
చరిత్రలో వాజ్‌పేయీ నిలిచిపోవటానికి ఆయనకు ‘సంఘ పరివార్’ భావజాలమో, లేదా వారిచ్చిన ఎజెండాను పాటించటమో కారణం కాదు. (అలాగని ఆయన భావజాలానికి చెందినవాడు కాడని- అర్థం కాదు.) ఏయే సందర్భాల్లో ఆయన ఆ రెంటినీ పక్కన పెట్టాడో, ఆయా సందర్బాల్లోనే ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్నాడు. వాజ్‌పేయీకి దేశపాలనలోనూ, విదేశాంగ నీతిలోనూ పేరు తెచ్చుకున్న సందర్భాలు కూడా అవే.
సంకీర్ణం; సంయమనం- ఈ రెంటికీ, సంఘ్ పరివార్ భావజాలానికి పొసగదు. వాజ్‌పేయీ తొలి ప్రభుత్వం 1996లో 13 నెలలకే కూలిపోయాక, తిరగి 1998లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, వాజ్ పేయీ సర్కారుకు 13 పక్షాలు కలిశాయి. ఇలా కలవటానికి ప్రధాన కారణం ‘సంఘ పరివార్ ‘ (హిందూత్వ) ఎజెండా( అయోధ్యలో రామమందిర నిర్మాణం, కామన్ సివిల్ కోడ్, కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు)ను కాస్సేపు పక్కన పెట్టటం. కాబట్టే, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని 13 నెలలయినా నడిపి చూపించగలిగారు. తర్వాత మళ్ళీ 1999లో మిత్రపక్షాలకు పూర్తిగా వాజ్‌పేయీ నాయకత్వం పై గురి ఏర్పడటం వల్ల కేవలం (హిందూత్వ ముద్ర బలంగా వున్న అద్వానీ కాకుండా) వాజ్‌పేయీ ప్రధానిగా వుండటం వల్లనే ముందుకొచ్చి, అయిదేళ్ల పాటు ఆయన వెంట నిలిచారు.
అలాగే విదేశాంగ నీతిలోనూ పాకిస్తాన్, చైనాలు కవ్వించినప్పుడు కూడా వాజ్‌పేయీ సంయమనాన్ని చూపి భారత్ మాటనే పై మాటగా నిలిపారు. పాకిస్తాన్ పొరుగుదేశమా? శత్రుదేశమా? అని ప్రశ్నిస్తే ‘సంఘ్ పరివార్’ భావజాలమున్న వారు ‘ముందు శత్రుదేశం; తర్వాతనే పొరుగుదేశం’ అనే రీతిలో స్పందిస్తారు. కానీ వాజ్ పేయీ ‘ముందు పొరుగు దేశం; తర్వాతనే శత్రుదేశం’ అన్న తీరులో వ్యవహరించారు . కార్గిల్ వివాద నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ కు చెందిన రెండు ఎం.ఐ.జి విమానాలను కూల్చి వేసినప్పుడు, ‘అదే రీతిలో సమాధానం చెప్పాలని’ ఆయన మీద తన స్వపక్షీయులనుంచే వత్తిడి వచ్చింది. అయనా ఆయన దౌత్యనీతి ముందు ఈ వత్తిళ్ళు పనిచెయ్యలేదు. ఆయన సంయమనానికి అంతర్జాతీయ ప్రశంసలు వచ్చాయి. అమెరికా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ తోక ముడిచింది. కార్గిల్ నుంచి తన సేనల్ని ఉపసంహరించుకుంది. చైనా విషయంలో ఆయనది ఇదే తంత్రం. ముందు సిక్కిం ను ‘స్వతంత్ర భూభాగం’గా తన అధికార పటాల్లో చిత్రించుకున్న చైనా, తర్వాత ‘భారత్‌లో అంతర్భాగం’గా మార్చి ముద్రించుకుంది.
తమ్ముడు తన( పరివారం) వాడయినా తగవు నిజమాడిన వాడే సమవర్తి. నేతకు ఈ లక్షణం వుండాలి. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ముఖ్యమంత్రిగా వున్నప్పుడే గోద్రా పేరు మీద మారణకాండ జరిగిన విషయం తెలిసింది. అప్పుడు వాజ్‌పేయీ మోడీ మీద చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఇవి స్వపక్షీయుడు చేసినవా? లేక విపక్షీయుడు చేసినవా? అనే అనుమానం కలుగుతుంది. ‘ ముఖ్యమంత్రికి నేనిచ్చే సందేశం ఇదే. ఆయన రాజ ధర్మాన్ని పాటించాలి. పాలకుడు తన పాలితులను కుల, జాతి,మత ప్రాతిపదికన వివక్ష చూపకూడదు'( ముస్లింల పై మారణ కాండ జరుగుతుంటే ముఖ్యమంత్రిగా మోడీ చోద్యం చూశారని పెద్ద యెత్తున విమర్శలు వచ్చాయి.)
అదే సంకీర్ణ నీతిని దేశ రాజకీయాల్లో బీజేపీ పాటిస్తుందా? పాటిస్తే, మిత్రపక్షాలు సైతం శత్రుపక్షాలుగా ఎందుకు మారుతున్నాయి? విదేశాంగనీతిలో సంయమనం బదులు ప్రతీకారం చొరబడిందా? ఆయనకు నివాళులర్పిస్తున్న బీజేపీ అగ్రనేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి.
-సతీష్ చందర్
17 ఆగస్టు 2018
(గ్రేట్ఆంధ్ర వారప్రతికలో ప్రచురితం)
చక్కటి విశ్లేషణ ఇచ్చారు.