కిరణ్‌-పాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ!

కిరణ్‌-పాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ!
టాపు(లేని)స్టోరీ:
వెనకటికి, ఒక హాలీవుడ్‌ తార పనుల హడావిడిలో పడి, తన పెళ్ళికి తాను హాజరు కావటం మరచిపోయిందట. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి కూడా ఈ మధ్య తన సన్మాన సభకు తాను గైర్హాజరయ్యారు. ఆయనకూ పనుల హడావిడే నంటే నమ్ముతారా? నమ్మరు. ‘అంతా. గ్యాస్‌’ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నిండా ‘గ్యాసే’. పడని ఇద్దరి కాంగ్రెస్‌ నేతల మధ్య ‘గ్రాసే'(పచ్చగడ్డే) వేయ నవసరం లేదు. కొంచెం ‘గ్యాస్‌’ వేసినా చాలు. భగ్గు మంటుంది. అవును. నిన్న ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలకూ, మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకూ మధ్య ‘గ్యాస్‌’ మండింది. కానీ, నేడు రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖ నేతల మధ్య ‘గ్యాస్‌’ వేశారు. ఒక్కసారి భగ్గు మని, ఆరటం కాదు. అలా మండుతూనే వుంది. అందులో ఒకరు జైపాల్‌ రెడ్డి, మరొకరు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి. ‘గ్యాస్‌’ మహాత్మ్యం అంతా, ఇంతా కాదు. ‘గ్యాస్‌’ వదలాలే కానీ, ప్రేమ కూడా భగ్గు మంటుంది. పాపం కిరణ్‌ మాత్రం ఏం చేశారు. ప్రేమ లేఖ రాశారు. తెలంగాణలోని రెండు గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులకూ గ్యాస్‌ ఇమ్మన్నారు. ఏ లేఖలో అయినా వెటకారాలు చెల్లుతాయి కానీ, ప్రేమ లేఖల్లో చెల్లవు. పైపెచ్చు ప్రమాదం కూడాను.
‘నీకే కనుక నా మీద ప్రేముంటే, నీ పేరు మీదున్న ఆ రెండు ఫ్యాక్టరీలూ నా పేరు మీదే రాయిస్తావు’ అని షరతు పెడితే ఎలా వుంటుంది? ఉత్తరం అందుకున్న వారికి పిచ్చిపడుతుంది. ‘ఛీ.. నీదీ ఒక ప్రేమేనా?’ అని అనే అవకాశం వుంది.
కిరణ్‌ కు రాజకీయ ద్వేష లేఖలే రాయటం అలవాటున్నట్టుంది. రాజకీయప్రేమ లేఖలు ఎప్పుడూ రాసినట్టు లేరు. దాంతో, జైపాల్‌ రెడ్డికి రాసిన లేఖలో ఈ గ్యాస్‌ షరతులు పెట్టినట్టున్నారు.
దాంతో జైపాల్‌ రెడ్డి గ్యాస్‌ లాజిక్కులు తీసారు. చెట్టు ముందా? కాయ ముందా? అని అన్నారు. పిల్ల ముందా? గుడ్డు ముందా? అని అడిగారు. చర్చ తెగకుండా చేయాలనుకున్నప్పుడు అక్కరకు వచ్చే సామెతలు- ఇవి.
ఇందులోంచి వచ్చిందే ‘స్టౌ లేకుండా గ్యాస్‌ ఇస్తారా?’ అన్న ప్రశ్న. ‘గ్యాస్‌ ఇవ్వకుండా, స్టౌ ఏదయిన అంటారేమిటి?’ ఇది దానికి కౌంటర్‌.
ఆ రెండు ప్రాజెక్టులూ ఇంకా పూర్తి కాలేదు. గ్యాస్‌ ఎలా ఇవ్వం. పూర్తయిన ప్రాజెక్టులు చాలా వున్నాయి. వాటికే ఇవ్వనప్పుడు – వీటికి గ్యాస్‌ ఎలా ఇస్తాం- అన్నది జైపాల్‌ వాదన.
ఈ గ్యాస్‌ వల్ల రాష్ట్ర కాంగ్రెస్‌ నిలువునా చీలిపోయింది.
‘రాష్ట్రాన్ని చీల్చ మంటే పార్టీని చీల్చుకుంటారేమిట’ని ప్రత్యేక తెలంగాణ వాదులూ, ‘వీళ్ళు చీలితే చీలారు. రాష్ట్రాన్నయినా సమైక్యంగా వుంచుతారా?’ అని సమైక్యాంధ్ర వాదులూ ఎత్తి పొడుస్తున్నారు.
గ్యాస్‌ ఎక్కడనుంచి వస్తుంది? భూగర్భంనుంచో, సముద్ర గర్భం నుంచో వస్తుంది.
కానీ ఈ గ్యాస్‌ కుర్చీ కింద నుంచి వచ్చింది. కుర్చీ కిందనుంచి ఏదయినా పుట్టొచ్చు కానీ, గ్యాస్‌ పుట్ట కూడదు. అది అన్ని కుర్చీలకూ పాకుతుంది.
ముఖ్యమంత్రి స్థానం నుండి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని మారుస్తారని ఎప్పటినుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ మార్చటం లేదు. ‘ప్రతి దినమూ గండమే. కానీ నూరేళ్ళ ఆయుష్షు’ అన్నట్టు ఆయన కొనసాగుతూనే వున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రత్యర్థులయినా, అధిష్ఠానమయినా ఏం చేస్తుంది? పొమ్మనకుండానే పొగ పెడుతుంది. కానీ, ఆ అవసరం వారికి లేకుండా కిరణ్‌ తనకు తానుగా కుర్చీ కింద గ్యాస్‌ పెట్టుకున్నారు. తెలంగాణ మీద తనకు ప్రేమ వుందని చెప్పుకోవటంలో తప్పులేదు. కానీ నిజంగా తెలంగాణ వాసిఅయిన ‘జైపాల్‌ రెడ్డి’కి ప్రేమ లేదని చెప్పటంతో ఈ ‘గ్యాస్‌’ పెరిగి పెద్దదయింది. ‘గ్యాస్‌’ తో ‘పవర్‌’ రావాలి. కానీ రాజకీయ గ్యాస్‌ తో ‘పవర్‌’ కట్టయ్యే ప్రమాదం వుంది. కాంగ్రెస్‌ పరిస్థితి అలాగే వుంది. ఇప్పుడు నిజంగానే కేంద్రం నుంచి ‘అగ్నిమాపక దళం’ రావాల్సిన అవసరం వుంది. లేకపోతే ఇది కూడా ‘భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ’ గా మార గలదు. అయితే ఈ విషాదం కాంగ్రెస్‌కే పరిమితం. వెలుపల వున్న వారికి కాదు. కొన్ని రకాలయిన గ్యాస్‌లుంటాయి. వాటిని విడుదల చేస్తే ఎంతటి గంభీర వదనులయినా పగలబడి నవ్వాల్సిందే. ఇప్పుడు ఈ గ్యాస్‌ ప్రతిపక్షాల మీద అలా పనిచేస్తుంది. కాంగ్రెస్‌ ఇలా కుమ్ములాటల్తో కొట్టుకు చస్తుంటే, వారికి ‘కామెడీ’ గా వుండదు.
న్యూస్‌ బ్రేకులు:
‘పవర్‌’ జనరేషన్‌!
కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి ఒక వైపు సమైక్యాంధ్ర, మరొక వైపు ప్రత్యేక తెలంగాణ అంటూ ద్వంద్వనీతిని పాటిస్తున్నారు.
-తూర్పు జయప్రకాష్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌
గ్యాస్‌ సీమాంధ్రలో వుంది, బొగ్గు తెలంగాణలో వుంది. ‘పవర్‌’కు రెండూ కావాలి. ఈ రహస్యం జైపాల్‌కు తెలిసినట్టుంది.
ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, వైస్సార్‌సీపీ లు తమ వైఖరేమిటో చెప్పాలి.
ఎస్సీ అంటే మీరనేది ‘సేమ్‌ కేస్ట్‌’ వర్గీకరణా? అదే అయితే వర్గీకరణ పూర్తయినట్లే. ముఖ్యమంత్రి సామాజిక వర్గాన్నే తీసుకోండి. మీరు చెప్పిన మూడు పార్టీల్లో కాక పోయినా, రెండు పార్టీల్లో విస్తరించి వున్నారు.
-కొందరు తెలుగుదేశం ఎమ్మెల్యేలు.
ట్విట్టోరియల్‌:
సర్కారు ‘ప్యూజు’ కొట్టేసింది!
ఉండి, ఉండి సర్కారు ‘పీజు'(ఫ్యూజు) కొట్టేసింది. ‘ఉచిత’ సేవ బలికోరుతుంది. ‘ఫ్రీ’ అని ఒక్కసారి ప్రకటించాక, ‘రేటు’ పెడితే, ఎంతటి వారికయినా కోపం వస్తుంది. వైయస్‌ హయాంలో ‘ఇంజనీరింగ్‌ విద్య’ దాదాపు సకల జనులకూ ‘ఫ్రీ’ అయింది. అదెలా? ఎస్సీ,ఎస్టీ,బీసీలకు కాకుండా, ‘ఈబీసీ'(ఆర్థికంగా వెనుకబడిన కులాల)కు ఫ్రీ అన్నారు. నిజమే. పేదలకు చదువులు అందుబాటు లో వుండాలి. కానీ ఈ దేశంలో పేదవాడు సంపన్నుడిగానూ, సంపన్నుడు పేదవాడిగా చెలామణీ కావటం పెద్ద కష్టం కాదు. ఇంకా చెప్పాలంటే ‘వర్గ’ మార్పిడీ, ఇంకొంచెం కష్ట పడితే ‘లింగ’ మార్పిడీి( మగ, ఆడ కావటం) సాధ్యమే. వీలుకానిది ఒక్కటే. ‘కుల’ మార్పిడి. గొప్ప కోసం ‘అగ్రకులమ’ని చెప్పుకున్నా, రిజర్వేషన్‌ కోసం ‘అంటరాని’ కులమని చెప్పుకున్నా- ఇట్టే సమాజం పట్టించేస్తుంది. కానీ ‘బీఎండబ్ల్యూ’ కారులో మండల కార్యాలయానికి వచ్చిన తన వార్షికాదాయం ‘లక్ష లోపే’ అని ధ్రువీకరణ పత్రం తీసుకువెళ్ళితే ఇదే సమాజం చూసీ చూడనట్టు వచ్చేస్తుంది. అందుకే, ‘ఆర్థిక వెనుకబాటుతనం’ పేరు మీద సంపన్నులూ ‘ఫీజు రీయంబెర్స్‌ మెంట్‌’ కోరతారు. సర్కారు ‘ఫ్యూజు’ కొట్టేసి, ఇరకాటంలో పడటానికి ఇది కూడా కారణమే.
‘ట్వీట్‌’ ఫర్‌ టాట్‌
పడకు. పడకు వెనుకపడకు
పలు ట్వీట్స్‌: ఆరెస్సెస్‌ చీఫ్‌ భగవత్‌ మోడీ కన్నా నితిష్‌ రాష్ట్ర అభివృద్ధిలో ముందున్నారని పొగడటం బాగాలేదు.
కౌంటర్‌ ట్వీట్‌: ఎప్పుడూ అంతే. వెంటపడే నేతల కన్నా ‘వెనుకబడిన’ నేతలే అభివృధ్ధిలో ముందుంటారు.
ఈ-తవిక:
తాడో-‘బోడో’

అసోంలో
రెండే సమస్యలు
ఒకటి:నీరు
రెండు: పోరు
రెండూ ముంచేశాయి
కొంపలు.
కాపడటానికి
వేస్తే ‘తాడు’ వెయ్యాలి,
లేదా ‘బోడో’ విసరాలి.

బ్లాగ్‌(బ్లాక్‌) స్పాట్‌:
‘అన్నా వెళితే యోగాబాబా వస్తాడు. అవినీతిపై పోరు ఆగదు’
‘లాభంలేదు. వ్యవస్థ శవాసనం వేసింది.’
కొట్టేశాన్‌(కొటేషన్‌)
గ్యాస్‌ రాకడా, పదవి పోకడా చెప్పలేం.

Leave a Reply