‘కుంపటి’ మీద గుండెలు!

ఎప్పుడో కానీ ఎవరి పాత్రలో వారు జీవించరు. వెలుపలే వుండిపోతారు. వెలుపల వుండిపోయిన వాడి వాలకమే వేరు. వాడి ముఖంలో అన్ని కళలూ వుంటాయి- ఒక్క జీవ కళ తప్ప. ఎవడినో ఎందుకనుకోవాలి. ఎవరి మట్టుకు వారు, మీ మట్టుకు మీరు, నామట్టుకు నేను – ఎక్కువ కాలం వెలుపలే గడిపేస్తుంటాం. పొడి పలకరింపులతో, యాంత్రికాలింగనాలతో,కృత్రిమ కరచాలనాలతో జీవితాన్ని నటించి, నటించి సొమ్మసిల్లి పోతుంటారు. అలాంటప్పుడు నాలోకి నన్నూ, నీలోకీ నిన్నూ పంప గలిగే మాంత్రికుడు ఒకడుంటే బాగుండునని పిస్తుంది.
నాలోకి నేను వెళ్ళితేనే మళ్ళీ చిన్నప్పటి అమ్మ తన కొంగుతో నా నుదుటి చెమటను తుడుస్తుంది. నాన్నొచ్చి ‘తిండీ తిప్పల్లేకుండా ఆ తిరుగుళ్ళేమిట్రా’ అంటూ ఒ ముద్దు తిట్టు తిడతాడు.
అప్పుడు కదా నాలోనేను…. కాదు నాలా నేను వుంటాను.
మీకు దండం పెడతా! నాలోకి నన్ను పంపిచరూ!
ఇలా నేనే కాదు. ప్రతి వొక్కరూ అడిగే రోజులు వచ్చేశాయి.
అప్పుడొస్తాడు. అసలు మాయలోడు… అక్షర మాంత్రికుడు. వాడి పేరే కవి.

అలాంటి కవి వుంటాడా? వుంటే ఎలా వుంటాడు? ఎలాగయినా వుండొచ్చు. ఆ పూట గొడవ తప్ప వేరే ఏమీ పట్టని బుక్కా ఫకీరులా వుండొచ్చు. చేటలో చేరెడు బియ్యం పోస్తే, కడివెడు కన్నీళ్లు కార్చే సోదె చెప్పే ఆదెమ్మలా వుండొచ్చు. లేదా ఫ్యాంటూ షర్టూ వేసుకున్న బాణాల శ్రీనివాసరావులా వుండొచ్చు.
నన్ను నాలోకి పంప మనగానే బాణాల ‘కుంపటి’ నాముందు పెట్టాడు. చూడమన్నాడు.
అమ్మతోడు. కుంపట్లో నాకు అమ్మ కనిపించింది. అమ్మలాంటి నాన్న కనిపించాడు. (కష్టజీవుల కుటుంబాల్లో నాన్న కూడా అమ్మే. ఆయనకీ పిచ్చి ప్రేమ తప్ప, దర్పం వుండదు.)
‘కారేజీ రూపంలో నాయన/ ఆకలికి అమ్మలా/ అన్నం తినిపించి/ కదిలాడు ముందుకు కష్టాలతో.
మీరెవరయినా కావచ్చు. నాకనవసరం. మీరు పుట్టింది అగ్రహారం కావచ్చు. అంటరాని వాడ కావచ్చు.
కానీ ‘కుంపటి’ చూశాక అది ‘తురక గూడెం’ లాగే వుంటుంది. అక్కడ ‘కోంటోల్ల రంగమ్మ’ బావి, ‘సాతానోళ్ళ బాయి పక్క చింతలూ వుంటాయి. ఆడి, ఆడి అలసి పోయి, బాణాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే, పొద్దున్నే వాళ్ళ అమ్మనీ, నాన్ననీ చూడొచ్చు. కాదు ఎవరి అమ్మనీ,నాన్ననీ వారు చూడవచ్చు.
పొద్దున్నే వాళ్ళ నాన్న ‘బుగ్గలు బెలూన్ల’య్యే వరకూ వూది వూది కుంపటి రాజేస్తాడు.
‘కుంపటి’ లో ఉరుములుంటాయి, మెరుపులుంటాయి. కుంపటిలో విధ్వంసం వుంది. సృష్టి వుంది. కుంపట్లో విశ్వమంతా వుంది.
బాణాల ‘కుంపటి’ చూసేవరకూ ‘గుండెల మీదే కుంపటి’ వుంటుందనుకునే వాణ్ణి. ‘కుంపటి మీదనే గుండెలు’ వుంటాయని ఆలస్యంగా తెలుసుకున్నాను.
ఎన్ని పుస్తెలు? ఎన్ని మట్టెలు? ఎన్ని బతుకులు! ఎన్ని అతుకులు! ఊరి గుండెను ఊదుతున్నాడు బాణాల వాళ్ళ నాన్న.
కుంపటీ ఆరిపోవచ్చు. ఆయనా ఆరిపోవచ్చు. కానీ ఊళ్ళో ఆయన మెరుగు తీసిన బతుకులన్నీ మేలిమి బంగారంలా మెరుస్తూనే వుంటాయి.
ఆ పల్లెలో ఏ తల్లి ముక్కుపుడక తళుక్కు మన్నా, ఆ మెరుపులో బాణాల వాళ్ళ నాన్నను చూసుకోవచ్చు.
‘కుంపటి’ కావ్యం చివరి వాక్యం నాకు చదవాలనిపించటంలేదు. అది చదివితే పేజీ తిప్పెయ్యాలి. అలా చేస్తే… మళ్ళీ నాలోంచి నేను వెలుపలికి వచ్చేస్తాను.

ఆ తర్వాత మళ్ళీ మామూలే…! అవే నటనలు. అవే ‘హల్లో’ లు. అవే ‘బాగున్నారా’లు. పనుల కోసమే పలకరింపులు.
ఏ పనీ లేకుండా వచ్చే మిత్రులు మన ఇళ్ళకు వచ్చి ఎన్నాళ్ళయింది?
నిజంగా అలా ఎవరన్నా వచ్చినా ‘నమ్ముతామా?’ ‘ ఏదో పని మీదే వచ్చావ్‌. ఫర్వాలేదు చెప్పూ’ అని ప్రాణం తియ్యమూ?
పనిలేకుండా వచ్చి పలకరించే పిచ్చిమాలోకాలు అక్కడక్కడా, మార్కెట్టుకు దూరంగా వుండిపోయారు.
అలా ఎవరన్నా వస్తే, వాడు చిన్నప్పటి మిత్రుడన్నా అయి వుండాలి. లేదా అమాయకపు కవయినా అయి వుండాలి. కానీ వాళ్ళకే మన పాత్రల్లోకి మనల్ని పంపే శక్తి వుంటుంది.
తన శక్తి తనకు తెలియని పల్లెటూరి కవి బాణాల.
(బాణాల శ్రీనివాసరావు కవితా సంపుటి ‘కుంపటి’కి రాసిన ముందు మాట)

19-3-8 – సతీష్‌ చందర్‌

7 comments for “‘కుంపటి’ మీద గుండెలు!

Leave a Reply