కుచేలుడి ‘కుబేర’ భక్తి!

కోట్లకు పడగలెత్తిన వారే, వోట్లకూ పడగలెత్తగలరు.

కొన్ని దేశాల్లో వోటుకు విలువ వుంది. ఇక్కడ మాత్రం ధర వుంది.

అన్ని వస్తువులకూ సంపన్నులే ధరను నిర్ణయిస్తారు. కానీ వోటు ధరను కటిక దరిద్రుడు నిర్ణయిస్తాడు. తన దగ్గరున్న వన్నీ తెగనమ్ముకుంటాడు కానీ, ఒక్క వోటును మాత్రం సరసమైన ధరకు అమ్మగలుగుతాడు.

నేతలూ అంతే , వాడి దగ్గరనుంచి ఏదయినా తమ ఇష్టమైన ధరనిచ్చి తీసుకోగలరు. కానీ, వోటుకు మాత్రం అతడు అడిగింది ఇవ్వాల్సిందే. చారెడు నేలనో, గుడిసెనో, పెళ్ళాం మెడలో పుస్తెనో…. ఏది అమ్మాలనుకున్నా, ఎంత రేటు కడితే అంత పుచ్చుకుంటాడు. కానీ వోటుకు మాత్ర అలా కాదు. ‘బీరూ, బిర్యానీ, అయిదు వందల నోటూ’ అంటే, మారు మాట్లాడకుండా చేతిలో పెట్టాల్సిందే. అతడి ‘అవినీతి’లోనూ ఒక ‘నీతి’ వుంది. సొమ్ము ఎవరిదగ్గర పుచ్చుకుంటే వారికే వోటు వేస్తాడు. ఇంకా చెప్పాలంటే, ఎవరికి వోటు వేయాలనుకుంటారో, వారిదగ్గరే రేటు పుచ్చుకుంటాడు. తన కూలి రేటును తాను నిర్ణయించుకోలేని వాడు, తన వోటు రేటును తాను నిర్ణయించుకుంటున్నాడంటే గొప్ప విషయమే కదా! పూర్వం వ్యవసాయపు పనులు వస్తున్నాయంటే పేదలు ఉత్సాహంతో ఎదురు చూసేవారు. మరీ ముఖ్యం ‘నాట్లు’ (పంట) ‘కోతలు’ వస్తున్నాయంటే వారికి పండగే. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయంటే, వీరికి పండగయిపోతుంది. ఇదీ ‘కోతల’ కాలమే ననుకోండి. కాకుంటే ఈ కోతలు పేదలు కొయ్యరు. నేతలే కోస్తారు. ‘కిలో రూపాయి బియ్యం నుంచి, నేరుగా ఖాతాలోకి నగదు’ వరకూ రక రకాల ‘కోతలు’ వుంటాయి. (తర్వాత బియ్యం బదులు నూకలు ఇవ్వొచ్చు. లేదా నూకల్లాంటి బియ్యం ఇవ్వవచ్చు. అది వేరే విషయం.). లారీలెక్కి హైదరాబాద్‌ వచ్చి, జెండాలు పట్టుకుని, సభని జయప్రదం చేసి పెట్టే కూలి పనులు, ఎన్నికలు ఇంకా నెల వుందగానే మొదలవుతాయి. ఇవి కాకుండా అడపాదడపా, నిరసనలూ, ఊరేగింపులూ, ప్రదర్శనలూ వంటి ‘కూలిపనులు’ కూడా మధ్య మధ్యలో తగల వచ్చు. ఇవన్నీ ఎన్నికల పనులే. కానీ ఇవి అయదేళ్ళ కోసారి కానీ రావు. కానీ, ఈ పేదలు ఏ ‘పుణ్యం’ చేసుకున్నారో కానీ, ఈ ఎన్నికలు ఏటేటా వస్తున్నాయి. కొత్త రకం సంకర విత్తనాలు రావటం వల్ల, కాపు వేగవంతమై, ఏడాదికి మూడు పంటలు పండించినట్లు , కొత్త రకం రాజకీయాల వల్ల, మాటిమాటికీ ఉపఎన్నికలు వస్తున్నాయి. అందుకనే పేదవాడి ముంగిట పండగే పండగ. గంజిలేదనుకున్న కడుపుల్లోకి సారా వచ్చి పడుతుంటే పండగ కాదూ! అయితే వీరి పండగ ఖర్చును ఎవరు భరిస్తారు? సదరు అభ్యర్థులే కదా! కాబట్టి ఏ లాజిక్కు ప్రకారం చూసినా, పార్టీలు ఎన్నికలలో ఎవరికి టికెట్టు ఇవ్వాలి? మళ్ళీ దరిద్రుడికే ఇవ్వాలా? ఇస్తే, ఏమవుతుంది? ఏమవ్వటమేముంది? ‘జోగీ, జోగీ రాసుకుంటే, బూడిద రాలినట్లు’, దరిద్రుడి వోటును దరిద్రుడు ఎలా కొనగలడు చెప్పండి? అందుకే వెతికి వెతికి సంపన్నుడికే ఇవ్వాలి. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు. దాదాపు చాలా పార్టీలు- డబ్బున్న వాళ్ళకే ఇస్తారు. అలాగని డబ్బున్న ప్రతీ ఆశావహుడికీ టిక్కెట్టు వస్తుందనుకోవటానికి వీల్లేదు. ఇది కూడా పెళ్ళిలాంటిదే. కులం, గోత్రం, జాతకం కుదిరాకనే అమ్మాయిని కట్నం తీసుకుని ఖాయం చేసినట్లు, అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరుగుతుంది. ఫలానా నియోజక వర్గంలో ఎవరి కులానికి ఎక్కువ ఆధిపత్యం వుంటుందో ఆ కులంలోని సంపన్నుడికే ఖాయం చేస్తారు. అందుకే సంపన్నులను పార్టీలో చేర్చుకోవటానికి పార్టీలు ఉబలాట పడుతున్నాయి. అంతేకాదు, ఏళ్ళ తరపడి పార్టీకి సేవ చేస్తున్నవారిని పక్కన పెట్టిన కొత్తగా చేరిన ‘కుబేరుల’కే టిక్కెట్టు ఇస్తున్నారు.

కేవలం డబ్బు తీసుకుని వోట్లు వేసే వారి వల్లే సంపన్నులు రాజకీయాల్లోకి వస్తున్నారనుకోవటం కూడా పొరపాటే. ఇప్పుడు కొత్తగా వోటు హక్కు వచ్చిన విద్యావంతులైన మధ్యతరగతి యువతరం కూడా సంపన్నుల్నే తెలియకుండా ఆరాధిస్తోంది. పూర్వం ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ‘మీకు స్ఫూర్తి దాతలు’ ఎవరూ అంటే- ‘పుచ్చల పల్లి సుందరయ్య’ అనో, ‘లాల్‌ బహుదూర్‌ శాస్త్రి’ అనో, నిరాడంబరులన్నీ, నిస్వార్థపరుల్నీ, తమకంటూ నాలుగు పైసలు వెనకేసుకోలేని వాళ్ళ పేర్లనీ చెప్పే వారు. కానీ ఇప్పుడు మాత్రం అనతి కాలంలో కుబేరులైన వారి పేర్లను చెప్పటానికి ముచ్చట పడిపోతారు. పారిశ్రామిక వేత్తల్నో, టెక్నోక్రాట్‌లనో ఉదహరిస్తారు. పూర్వం ‘టాటానో, బిర్లానో’ అభిమానిస్తున్నాని చెప్పుకోవటానికి మధ్యతరగతి విద్యావంతులు ముఖమాట పడేవారు. నిజానికి వారు ఉన్న చట్టాలను గౌరవిస్తూ ఆర్జన చేసిన వారే. అయినా ఎందుకనో అల్లూరి సీతారామరాజు, సుభాష్‌ చంద్రబోస్‌ వంటి వారి పేర్ల సరసన వారి పేర్లను ఉంచటానికి ఇబ్బంది పడేవారు. ఇప్పుడలా కాదు. వావిలాల గోపాల కృష్ణయ్య పేరుతో పాటు వారెన్‌ బఫె పేరునూ తలవ వచ్చు. భగత్‌ సింగ్‌తో పాటు బిల్‌గేట్స్‌నూ గుర్తుకు తెచ్చుకోవచ్చు. కూటికి గతిలేని కోటానుకోట్ల జనం వున్న చోట, సంపన్నుల్ని కీర్తించటానికి పూర్వం ముఖమాట పడినట్లు ఇప్పుడు ముఖమాట పడనవసరం లేదు. ధర్మ బధ్ధంగానే సంపాదించేటప్పుడు తటపటాయింపు దేనికి? బాగా సంపాదించాక ఈ శ్రీమంతులు తిరిగి సమాజానికిచ్చినట్టు, మనమూ ఇవ్వొచ్చు కదా!- ఇదే ధోరణి నడచిపోతోంది. కానీ తీరా ఇచ్చే వాళ్ళెంతమందో తర్వాత విషయం. అందుకనే ‘కటిక దరిద్రుణ్ణి నుంచి శత కోటీశ్వరుడి గా ఎలా ఎదిగాడు?’ అన్న కథనాలు ఇచ్చిన కిక్కు, ‘ఉన్న భూమంతా ఉద్యమానికిచ్చేసి, సామాన్యుడిగా జీవించిన వ్యక్తుల’ గాధలు ఇవ్వలేకపోతున్నాయి. అందుకేనేమో, నిన్నటి మొన్నటి వరకూ, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్ని తమ ఆస్తుల్ని, ఉన్నవి ఉన్నట్లు ప్రకటించటానికి పడేవారు కాని, ఇప్పుడు పడటంలేదు. జి.దీపక్‌ రెడ్డి అనే అభ్యర్థి ఈ మధ్యనే తన ఆస్తి విలువను ఆరువేల కోట్లని అధికారికంగా ప్రకటించి మరీ నామినేషన్‌ వేశారు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలలో ఆయన రాయదుర్గం (అనంతపురం) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏం? ఎందుకు దాచుకోవాలి? ఎందుకు సిగ్గుపడాలి? ఈ రకమైన కితాబులు ఆయనకు ఇప్పటికే వస్తున్నాయి. అంతేకాదు, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి తెగువ అభ్యర్థులు చూప వచ్చు. పార్టీలూ సంపన్నుల్నే కోరుతున్నాయి. పేదలూ సంపన్నుల్నే కోరుతున్నారు. కడకు విద్యావంతులూ సంపన్నుల్నే కీర్తిస్తున్నారు. ఇంతకు మించిన ప్రజాస్వామ్యమేముంటుంది? ఇది కుచేలురు కోరుకుంటున్న కుబేర స్వామ్యం!

-సతీష్‌ చందర్‌

 

 

4 comments for “కుచేలుడి ‘కుబేర’ భక్తి!

  1. అతడి ‘అవినీతి’లోనూ ఒక ‘నీతి’ వుంది. సొమ్ము ఎవరిదగ్గర పుచ్చుకుంటే వారికే వోటు వేస్తాడు.
    Antha sukhamgaa ledani parteelavaalla uvaatcha!

  2. nijame kada..dhanam mulamidham jagath..dabuku lokam…daasoham…DABBU LENI NAYAKUDU…CHELLANI VOTU KI KUDA..KORAGADU…(DABBU LENI VADU.. DUBBU KYNA KORAGADU..)

Leave a Reply