‘కుటుంబ’ నిధి!

karuna1పేరు : కరుణా నిధి

ముద్దు పేర్లు : కుటుంబ నిధి.( నాకుటుంబానికి నిధి లాంటి వాడిని).రణ నిధి. విరమణ నిధి. రుణ నిధి. దారుణ నిధి

విద్యార్హతలు : కళలో పుట్టాను. రాజకీయాల్లో పెరిగాను.

హోదాలు : అప్పుడప్పుడూ జయలలిత ఇచ్చే ‘కమర్షియల్‌ బ్రేకు’లు మినహా ఎప్పుడూ తమిళనాడు ముఖ్యమంత్రినే. ఇప్పుడు ‘కమర్షియల్‌ బ్రేకు’ నడుస్తోంది కాబట్టి నన్ను ‘మాజీ’ అంటున్నారు. అంతే.

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ఎమ్‌.జి.ఆర్‌కు నెత్తిన టోపీ ఎలాగో, నాకు నల్ల కళ్ళ జోడు అలాగన్నమాట. ఇద్దరికీ ఎండ పడదు.

రెండు: నేను దేవుణ్ణి అమ్మను. నమ్మను. (అందుకే రాముడి కట్టిన రామ సేతు అద్వానీకి కనపడుతుంది. నాకు కనపడదు.)

అనుభవం : జీవితంలో ముడులు వేయగలను( మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను.) రాజకీయాల్లో ముడులు విప్పగలను.(నామీదా, నాకుటుంబ సభ్యుల మీదా ఎన్నో కేసులు పెట్టారు. వాటి నుంచి బయిట పడ్డాను.)

వేదాంతం :‘ఆర్యా!’ అని నన్నెవరయినా పిలిస్తే నాకు కోపం వస్తుంది. ‘ద్రావిడా’ అని మాత్రమే నన్ను పిలవాలి. నా నరనరానా ద్రావిడ రక్తమే వుంటుంది. నేను ద్రావిడోద్యమకారుణ్ని. అన్నాదొరై వారసుణ్ణి.

వృత్తి : ‘కుటుంబ నియంత్రణ’.(ఇద్దరు లే ముగ్గురు అన్నది పిల్లల విషయంలో కాకుండా, భార్యల విషయంలో అమలు జరిపాను. అది అప్రస్తుతం.) వారసత్వాన్ని కుటుంబానికి సంక్రమింప చేయటం లో కూడా ‘కుటుంబ న్యాయం'( అన్ని సామాజిక వర్గాలకూ సమన్యాయం పాటించటం ‘సామాజిక న్యాయం’ ఎలా అవుతుందో, అలాగే, నా అన్ని కుటుంబాల పిల్లలకీ సమన్యాయం పాటించటాన్ని నేను ‘కుటుంబ న్యాయం’ భావిస్తాను. ఈ న్యాయానికి సర్వావస్థలయందూ కట్టుబడి వుంటాను.)

హాబీలు :1.రాయటం. ముందు నాటకాలకూ, తర్వాత సినిమాలకూ విస్తారంగా రాశాను.(అందుకే సినిమాల్లో నేను రాసిందే రాత, రాజకీయాల్లో గీసిందే గీత.)

2. ఉపన్యాసాలు దంచటం. (ద్రవిడోద్యమంలో ఉపన్యాసకుడు కాలేని వాడు నేత కాలేడు.)

నచ్చని విషయం : నేను జాతీయగీతం అంతా ఇష్టంతో పాడతాను. చివరి పంక్తి పాడటానికే కష్టపడతాను. అందులో ‘జయ, జయ, జయహే!’ అని వాక్యం పలకటానికి ఇబ్బంది పడతాను.( మీకు తెలుసు కదా నాకు ‘జయ’ అన్న పదాన్ని ఉఛ్చరించటానికే ఇష్టపడను. అందులో ‘లలిత’ అని లేక పోయినా సరే.)

మిత్రులు :జీవితంలో మిత్రులే రాజకీయాల్లో శత్రువులుగా మారతారు. కావాలంటే మణిరత్నం తీసిన ‘ఇద్దరు’ సినిమా చూడండి.

శత్రువులు : శ్రీలంకలో తమిళులకు ఎవరు శత్రువులో, వారే నాకు శత్రువులు. అందుకే కదా- యుపీయే మద్దతును ఉపసంహరించుకున్నాను. అయితే వారిని ఊచకోత కోయటానికి సింహళ సైనికులు పూనుకున్నప్పుడు నేను నిరాహార దీక్ష చేసి, వెంటనే విరమించాను కూడా. అయినా అప్పడు అక్కడ కాల్పుల విరమణ జరగలేదు. ఆమేరకు కేంద్రం వత్తిడి చేయలేదు. అయినా కానీ, అప్పుడు ఊరుకున్నాను. కానీ ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు. అంటే సార్వత్రిక ఎన్నికలు ఏడాదిలోగా వస్తున్నాయని మాత్రం కాదు.

జపించే మంత్రం : మంత్రాలకు చింతకాయలూ, బూడిదలూ రాలవు. ఇలా ఏ నమ్మకాలు లేవు కాబట్టే, నేను ఏ బాబా దగ్గరకూ పోలేదు. కానీ సత్యసాయిబాబాయే వీల్‌ చైర్‌లో నా ఇంటికి వచ్చారు. నేను ఓ సాధారణ సందర్శకుడికిచ్చే గౌరవమిచ్చాను.

విలాసం : నా కూతురుకి జైలును విలాసంగా మార్చారు. బాధపడలేదు. ఇప్పుడు నాకు విలాసమంటూ లేదు. ఇటు కేంద్రంలోనూ, అటు రాష్ట్రంలోనూ అధికారంలోనూ మా పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు నేను మాత్రం యుపీయే ప్రభుత్వాన్ని యూ.పీ జైల్లో వేసాను. కాంగ్రెస్‌ ఇప్పుడు ములాయం నిర్బంధంలో కానీ, మాయావతి నిర్బంధంలో కానీ వుండాల్సి వచ్చింది.

గురువు : అన్నా దొరై

జీవిత ధ్యేయం : రుణ (నేను) కాక పోతే కరుణ కుటుంబ సభ్యుడే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉవుండాలి. ఇంతకు మించి ఆశలు లేవు.

-సతీష్ చందర్ 

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో 22-29 మార్చి2013 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply