కోడి పందాలు

COCK_FIGHT(నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాల హడావిడి నడుస్తోంది. ఈ కవిత ఎప్పుడో

20యేళ్ళ క్రితం రాసింది. నా ‘పంచమ వేదం’ కవితా సంపుటిలో వుంది. ఈ కోడిపందాలకు నేపథ్యం
పండుగ కాదు, ఒక విషాదం. ముంబయిలో హిందూ,ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగిన
నేపథ్యంలో, ఇరు వర్గాలలోని అమాయకపు ప్రజలు బలయ్యారు. నిజానికి ప్రజల మధ్య మత
సామరస్యం ఎప్పుడూ వుంటుంది. స్వార్థ రాజకీయ శక్తులే వారిని రెచ్చగొడతారు. వాళ్ళకాళ్ళకు
కత్తులు కట్టి బరిలోకి దించుతారు. అనుకోకుండా ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం రాష్టంలో
వుంది. చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి మందిర వివాదంతో పాటు, అక్బరుద్దీన్, తొగాడియాల
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్బంది కరవాతావరణం నెలకొని వుంది. దాని స్థానంలో స్నేహ
పూర్వక వాతావరణం తిరిగి నెలకొలాని కాంక్షిస్తూ, నా మిత్రుల కోసం మరో మారు ఈ కవిత.
చదవండి.)

 పందెగాడి పెరట్లో

రెండు కోడి పుంజులు

 

గెలిచి చచ్చిందీ

ఓడి బతికిందీ.

 

గెలుపు ఓటములు

కత్తికట్టిన దేవుళ్ళవి.

చావు బతుకులు

చప్పట్ల మధ్య కోళ్ళవి.

 

చచ్చిన కోడి- నెమలి

బతికిన కోడి- డేగ

అవి దేవుళ్ళు పెట్టిన పేర్లు.

 

ఒకే రకం పక్షులకు

ఈకల తేడాలు పీకి

జాతుల్ని నిర్థారించడం

పందెపు సంప్రదాయం.

 

అయోధ్యలో దేవుళ్ళు

చల్లగా వుండుగాక

అయ్యో! నా మతి మండా

దేవుళ్ళు అయోధ్యలో కాదు

అధికారపు గర్భగుడుల్లో వుంటారు

శూలాల మొనల్తో కోళ్ళ

తల రాతలు రాస్తుంటారు.

III

 

చచ్చిన నెమలికి బతికిన స్వప్నం

‘డేగా! నువ్వు నన్ను చంపలేదు డేగా’

 

బతికిన డేగకు చచ్చే పీడకల

‘నెమలీ! నన్ను చంపి పెట్టు నెమలీ’

 

రెండు జాతులూ గింజుకు చస్తున్నాయి

చావు బతుకుల సరిహద్దు వద్ద

రెండు కోళ్ళూ

ఇద్దరు సైనికుల్లాగ

దేవుళ్ళు చూడలేదు కద!

‘డేగా! నువ్వెవర్ని చంపావు?’

‘నా పిల్లల్ని. మరి నువ్వు?’

‘ నా తల్లుల్ని’

 

కోళ్ళు నవ్వుకున్నాయి

సరిహద్దు కోళ్ళు ఏడ్వకూడదు

వెక్కి,వెక్కి నవ్వుకోవాలి

కోళ్ళు రెండూ గాఢంగా కౌగలించుకున్నాయి

 

‘దేవుళ్ళు అనుమానించరు కద!’

నెమలికి భయం

‘మన కాళ్ళకు కత్తులున్నంత సేపూ

మన ప్రేమాలింగనాలకి సైతం నెత్తురే కారుతుంది.’

డేగకి ధైర్యం.

‘బాధగా లేదూ?’

‘హాయిగా వుంది. ఇది మన కోసం మనం ఓడ్చిన నెత్తురు.

దేవుళ్ళకి వాటా లేని నెత్తురు’

నెత్తురు మడుగయ్యింది

సరిహద్దు చెరిగిపోయింది

శరీరాలు తేలికయ్యాయి.

 

‘చెలీ! ఎగిరిపోదామా?’

అడిగిందెవరూ? నెమలా? డేగా?

దేవుళ్ళు లేనప్పుడు

డేగలూ లేవు. నెమళ్ళూ లేవు.

అన్నీ కోళ్ళే. చెలికాళ్ళే.

‘అవునూ మనకి రెక్కలుండాలి కదా?’

‘నిజమే చెలీ! మనకి కట్టిన కత్తులు తప్ప

పుట్టిన రెక్కలే గుర్తు లేవు.’

కోళ్ళు రెండూ పైపైకి ఎగిరాయి

గింగిరాలు కొట్టాయి

విన్యాసాలు చేశాయి

 

కిందకు చూడబోతే

అన్నీ మందిరాలూ మసీదులే

కిళ్ళీమరకలో, నెత్తుటిడాగులో తెలీదు కాని

గోడలన్నీ ఖరాబులే!

కోళ్ళెక్కడా కనపడలేదు

అయితేనేం?

చప్పుళ్ళు- చప్పట్లు- ఈలలు-గోలలు

అంతా కోడిపందాల హడావుడులే

 

గాలిలోని చెలులు రెండూ కలత చెందాయి

మరణిస్తున్న కోళ్ళ ఆర్తనాదాలకి తల్లడిల్లాయి

 

ఒకటి మందిరం మీదా

మరొకటి మసీదు మీదా వాలాయి

ఉగ్గబట్టి, ఉగ్గబట్టి వదిలిన రెట్టల్తో

గోడలన్నీ తెలుపు చేశాయి.

 

ఇప్పుడు

మందిరమో తెలీదు

మసీదో తెలీదు

అన్నీ ఉత్త కట్టడాలే.

-సతీష్ చందర్

3 comments for “కోడి పందాలు

  1. sir, mii sahaja vyangarthamlo kuda “mana kaallaku kattulunnanthasepu , mana premalinganalaku saitam netture karutundi” ane e kavitavakyalu ee dushta samajanni kadilinchaka manadu. – relavant poem, and great also. thankyou. —-dasaraju ramarao

  2. 20 ఏళ్లు కాదండి మరో 20 ఏళ్లు గడిచినా “దేవుళ్ల” తంతుకు అంతే వుండదండి. దెయ్యాలు పూనడమంటే ఇదే. దెయ్యపుదేవుళ్ల లీలలను చక్కగా అక్షరీకరించారు. మీకు నా నెనరులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *