పేరు : సీనియర్ విద్యార్థి
దరఖాస్తు చేయు ఉద్యోగం: కింగ్ ఆఫ్ ర్యాగింగ్ ( జూనియర్ కి ‘ర్యాంకింగ్’ ఎంత ముఖ్యమో, సీనియర్ కు ‘ర్యాగింగ్’ అంత ముఖ్యం. ర్యాంకింగ్ లేక పోతే సీటు రాదు. ‘ర్యాగింగ్’ లేక పోతే ‘రాటు’ దేలరు. ఇది మా సిధ్ధాంతం.)
వయసు : సీనియర్ అంటే సీనియర్. మరీ పెద్ద వయసుండాలా? ఎల్‌కేజీ వాడికి యూకేజీ వాడు సీనియర్, పాకే వాడికి, డేకే వాడు సీనియర్. ఫస్టియర్ ఇంజనీరింగ్ వాడికి సెకండ్ ఇయర్ సీనియర్ సీనియర్. చాయ్ తాగేవాడికి, బీరు తాగే వాడు సీనియర్.
ముద్దు పేర్లు : అవును మేం సీనియర్లం కదా.. మాకు ముద్దు పేర్లు వుండవచ్చు. కానీ జూనియర్లకు మాత్రం ‘నిక్ నేమ్’లు వుండాలి. అవి మేమే పెట్టాలి. నా ముద్దు పేరు: క్యాంపస్ ఉగ్రవాది.
‘విద్యార్హతలు :ఎం. ఆర్ ( మాస్టర్ ఆఫ్ ర్యాగింగ్). అవును ఇదికూడా శాస్త్రీయంగా నేర్చుకోవాలి. చాలా సబ్జెక్టులుంటాయి. ఉదాహరణకు ‘కీచకాలజీ’. ఇది మగ సీనియర్ విద్యార్థి, ఆడ జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది ‘దుశ్శాసనామిక్స్’. ఇది కూడా అందుకే ఉపయోగపడుతుంది కానీ, ‘ఆడపిల్లల్ని స్ట్రిప్పింగ్… అనగా వస్త్రాలు వలవటానికి ఉపయోగపడుతుంది’ ఈ మధ్య మా సీనియర్లు కొందరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలు ఈ టెక్నిక్ ఉపయోగించారు. అలాగే ఆర్కి ‘టార్చర్’. అని సాటి పురుషుల్ని కూడా వస్త్రాలూడదీయించి పెట్టే చిత్రహింస. ఈ సబ్జెక్టులు ‘నాజీ’లకూ, ‘టెర్రరిస్టులకు’ కూడా కొత్తే. మేం డెవలెప్ చేశాం.
గుర్తింపు చిహ్నాలు :ఒకటి: జూనియర్ కనబడితే ‘సంస్కృతం’ దానంతటదే వచ్చేస్తుంది. న’బూతో’ న భవిష్యత్తు అన్నారు కదా! ‘రిజర్వేషన్’ మీద వచ్చిన వాళ్ళు కనిపిస్తే, నా అగ్రకులం కనిపిస్తుంది. ఆడపిల్ల కనిపిస్తే, నాలో ‘ఈవ్ టీజర్’ నిద్ర లేస్తాడు.
రెండు: క్యాంపస్‌లో పులి; దాటితే పిల్లి.
సిధ్ధాంతం :అమాయకులు ఏడుస్తుంటే ఆనందం కలుగుతుంది. (లేక పోతే, మేమెందుకు మా జూనియర్లను వేధిస్తాం?) దీనిని కిట్టని వాళ్లు ‘శాడిజం’ అంటారు.
వృత్తి : ‘రాగా’లాపన. ( అనగా ర్యాగింగ్‌నే ఆలపింటం) తిట్టు తిట్టించు, లైఫ్ తప్పించు. ఇదీ మా స్లోగన్.
హాబీలు :1ఎప్పుడన్నా తీరిక దొరికితే చదవటం. ( అసలు తీరికే దొరకదు. ఒక్క జూనియర్‌ని తనివి తీరా ర్యాగ్ చెయ్యాలంటే, ఒక్క రోజు కూడా సరిపోదు. సరిగా ర్యాగింగ్ చేస్తే మళ్ళీ జీవితంలో కోలుకోకూడదు.)
2. హారర్, థ్రిల్లర్, దయ్యం సినిమాలు చూడటం. లేకుంటే పీడించటం తెలియదు కదా!
అనుభవం : కూల్ డ్రింక్ తాగే రోజుల్లో బీరు గొప్పగా వుండేది. బీరు తాగే టప్పుడు విస్కీ గొప్పగా వుండేది. విస్కీ తాగేటప్పుడు నాటు ఇంకా గొప్పగా వుండేది. ఇప్పుడు ‘డ్రగ్స్’ గొప్పగా వుంటాయంటున్నారు. చూడాలి.
మిత్రులు : ఆడపిల్లలకు దుస్తులు తీయిస్తుంటే, వీడియో తీసి సహకరించే వాడే అక్కరకు వచ్చే మిత్రుడు. మా సీనియర్లలో కోకొల్లలు.
శత్రువులు : జూనియర్ అన్న ప్రతీ అబ్బాయీ, ప్రతీ అమ్మాయి. ఈ శత్రువులను మిత్రులగా చేసుకోవటం కోసమే ఈ వయలెంట్ రాగింగ్
మిత్రశత్రువులు :సీనియర్లలో వుండి కూడా ర్యాగింగ్‌కు దూరంగా వుండేవాడు.
వేదాంతం : చదవేస్తే వున్న మతి పోతుంది. అందుకు మేమే ఉదాహరణ
జీవిత ధ్యేయం : నేడు ర్యాగింగ్ సమర్థవంతంగా చెయ్యగలిగిన వాడే, రేపు వరకట్న హింస కూడా గొప్ప గా చెయ్యగలుగుతాడు. మా జీవిత ధ్యేయం అర్థం అయ్యే వుంటుంది.
-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 9 ఆగస్టు 2015 సంచికలో ప్రచురితం)