‘గో’మిత్‌ షా!

caricature: balaram

caricature: balaram

పేరు : అమిత్‌ భాయ్‌ అనిల్‌ చంద్ర షా (చిన్నబుచ్చితే) అమిత్‌ షా

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘కవ్‌’ బాయ్‌ ( ఏం? సినిమాల్లోనే గానే రాజకీయాల్లో ‘కవ్‌ బాయ్స్‌’ వుండకూడదా? ‘గోవు’ పవిత్రమైన జంతువు అని కుర్రాళ్ళంతా ‘కవ్‌ బాయ్స్‌’ కారా?

వయసు : మేం బీజేపీలో ‘బాయ్స్‌’ మే. నేను యాభయిలలో వున్నా, మోడీ అరవయిలలో వున్నా మేం ‘బాలురం’ కిందే లెక్కే, ఎందుకంటే, అద్వానీజీ, మురళీ మనోహర్‌ జోషీజీలు ఎనభయిలల్లో వుంటూ ‘యవ్వనుల్లా’గా కుర్చీలకు పోటీ పడుతున్నారు కదా!

ముద్దు పేర్లు :‘గో’మిత్‌ షా( గోవు అంటే ఆవు. మిత్‌ అంటే కల్పన. రెండూ చేసింది నేనే. బీహార్‌ ప్రజలు గోవును పవిత్రంగానే స్వీకరించారు. బీజేపీ అంటే గోవు, గోవు అంటే బీజేపీ అని నమ్మారు. తదనుగుణంగానే మాకు తీర్పు ఇచ్చారు. 243 సీట్లకీ 58 సీట్లే ఇచ్చారు. ‘గంగి గోవు పాలు గరిటడయినను చాలు’ అంటారు. )

‘విద్యార్హతలు : బ్యాచిలర్‌ ఆఫ్‌ ‘లవ్‌’ (ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ ఎలక్ట్రోల్‌ కాలేజ్‌ నుంచి.) బ్యాచిలర్‌ ఆఫ్‌ ‘కవ్‌'( బీహార్‌లోని పాట్నా యూనివర్శిటీ నుంచి). మొదటి డిగ్రీ బాగా పనికి వచ్చింది. బీసీ అమ్మాయి, ముస్లిం అమ్మాయి ప్రేమ వ్యవహారం కాస్తా, హిందూ- ముస్లిం తగాదాలుగా మారిపోతే, మైనారిటీ వ్యతిరేకత పెరిగి, మెజారిటీ హిందువులు మాకే వేశారు. కానీ, ‘కవ్‌’ స్టోరీయే మరీ పవిత్రమయి పోయింది.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: మోడీ నీడను నేనే. అందుకే నన్ను ‘నరేంద్ర షా’ అనొచ్చు, ఆయన్ని ‘అమిత్‌ మోడీ’ అనవచ్చు. ఆయన వాక్కు, నేను అర్థం. కలిపితే ‘వాగర్థా’లం.

రెండు: ‘పద్మవ్యూహ’కర్తని. నా వ్యూహంలో ‘నితిష్‌, లాలూలు’ అభిమన్యుల్లా చిక్కుకుంటారనుకున్నాను. కానీ వారి ‘అర్జునులే’ అన్న సంగతి ఎన్నికలు ముగిసాక కానీ అర్థం కాలేదు.

సిధ్ధాంతం :‘జైనిజం’ . లెక్క ప్రకారం నేను చేరాక ‘బీజేపీ’, ‘భారతీయ ‘జైన’తా పార్టీ’ కావాలి. కానీ పార్టీ ప్రభావం గొప్పది. నన్నే ‘హిందూ షా’ గా మార్చింది. (జైన మతం ప్రకారం ‘జీవ హింస’ మొత్తం తగదు. నేను దానిని కుదించుకుని ‘గోహింస’ మాత్రమే తగదు- అని అంటున్నాను.)

వృత్తి : ‘గోద్రా’ నుంచి ‘దాద్రీ’ వరకూ ఒకటే వృత్తి, ఉద్రేకాలను వోట్లగా మార్చటం.

హాబీలు :1. నేను రాసిన పరీక్షా పత్రాన్ని నేనే మూల్యాంకనం చేసుకోవటం, అనగా దిద్ది మార్కులు వేసుకోవటం. ( బీహార్‌ అసెంబ్లీ వ్యూహాన్ని రచిచింది నేనే కదా! అక్కడ బీజేపీ వోటమిని విశ్లేషించేదీ, అందుకు బాధ్యుల్ని వెతికి పట్టేదీ నేనే.

2. ఒక్క మోడీలోనే అన్ని అవతారాలను చూసుకుంటాను. నాకు దేశ ప్రధాని అభ్యర్ధిగానూ ఆయనే కనిపిస్తాడు; బీహార్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగానూ ఆయనే కనిపిస్తాడు. అందుకే బీహార్‌లో వేరే ముఖ్యమంత్రి అభ్యర్థిని మేం ముందుకు తేలేదు.

అనుభవం : ఆ మాట అనకండి. మా పార్టీలో తాతయ్యలు పంచెలు విడిచి, జీన్స్‌ కట్టుకుని మరీ ముందుకు వచ్చేస్తారు. అనుభవం ఒక్కటే రాజకీయం కాదు.

మిత్రులు : ఒక్కడే. నరేంద్ర మోడీ. మిగిలిన వారందర్నీ అనుచరులుగా ఎప్పుడో మార్చేసుకున్నాను.

శత్రువులు : మా పార్టీ వాళ్ళే. పడక్కుర్చీల్లో వున్నారు. వాటిని వదలి కుర్చీలెక్కాలన్నది వారి ఉద్దేశం. ఇప్పుడు బీహార్‌ వోటమికి నేనూ, మోడీ యే కారణమంటూ స్టేట్‌ మెంట్లు ఇవ్వటం మొదలు పెట్టారు.

మిత్రశత్రువులు :మహారాష్ట్రలోనూ, జమ్మూ-కాశ్మీర్‌లోనూ వున్నారు. ఒకరు: ఉద్ధవ్‌ థాకరే, మరొకరు: ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌. మొదటి వ్యక్తి మా పార్టీ వారు కనిపిస్తే, ముఖానికి రంగులు పులుముతారు. రెండవ వ్యక్తి ముందుకాళ్ళకు బంధనాలు వేస్తారు.

వేదాంతం : మనం తీసుకునే అర్థాన్ని బట్టి వుంటుంది. ఇప్పుడు బీహార్‌ ప్రజలు ‘గో బ్యాక్‌’ అన్నారు. అంటే మమ్మల్ని వెళ్ళిపొమ్మని కాదు; ‘గో’ అంటే ‘గోవు’. ‘ఆవు’ను వెనక్కి పొమ్మని. ప్రతీ సారీ ‘ఆవు’తోనే వస్తామా? మరోసారి ఏ ‘మందిరం’తోనో వస్తాం.

జీవిత ధ్యేయం : ఉండండి, రెండో సారి నన్ను బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో లేదో ముందు చూసుకోవాలి.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 14-20 నవంబరు 2015 తేదీ సంచికలో ప్రచురితం.)

Leave a Reply