చదవేస్తే ఉన్న ‘నీతి’ పోతుందా?

ఒకడేమో కడుపు కోసేస్తానంటాడు; ఇంకొకడేమో గోతులు తీసేస్తానంటాడు; మరొకడేమో మక్కెలు విరగ్గొడతానంటాడు; అదీఇదీ కాక టోపీపెట్టేస్తానంటాడు ఓ తలకాయలేని వాడు. ఇవన్నీ పిచ్చి ప్రగల్బాలు కావు. కలలు. పిల్లకాయలు కనే కలలు. కలలు కనండీ, కలలు కనండీ… అనీ కలామ్‌ గారు పిలుపు నిచ్చారు కదా- అని, ఇలా మొదలు పెట్టేశారు. పనీ పాట లేక పక్క ఫ్లాట్లలో పిల్లల్ని పోగేసి, కలామ్‌ గారడిగినట్లే, మీరేం కావాలనుకుంటున్నార్రా అని అడిగాను. ఒక్క వెధవ తిన్నగా చెప్పలేదు. కడుపు కోత డాక్టర్‌దీ, గోతులు తీత సివిల్‌ ఇంజనీర్‌దీ, మక్కెలు ఇరగదీత పోలీసు ఆఫీసర్‌దీ, టోపీల పెట్టివేత రాజకీయ నాయకుడిదీ..! ఇంత తిరకాసుగా తమ కలల్ని చెప్పేశారు. ఈ కుర్రకుంకల్లో ఒక బండ కుంక వున్నాడు. వాడు మాత్రం పెదవి విప్పలేదు. ‘ఏరా! నిన్ను సెపరేట్‌ గా అడగాలా? నువ్వేమవుతావ్‌?’ అన్నాను. అంతే.. వాడు ఎదురుగ్గా వున్న బక్క పీనుగు లాంటి సన్నటి కుంక చెవులు పట్టుకుని వాడి తలకాయ గిరాగిరా తిప్పేశాడు. ‘ఒరేయ్‌. ఒరేయ్‌… బండనాన్నా…చేత్తో కాదు… నోటితో చెప్పరా…?’ అన్నాను. వాడు చెప్పలేదు కానీ, పక్కనున్న మరో తెలివయిన కుంక అనువాదం చేశాడు: ‘అంకుల్‌! వీడు చక్రం తిప్పుతానంటున్నాడు.’ దాని అర్థం నాకు కాస్త ఆలస్యంగా వెలిగింది. ‘ఓహో! డ్రైవర్‌ అవుదామనుకుంటున్నావా?’ అన్నాను. అందుకు ఆ బండ బాబు ఏంచేసాడో తెలుసా? అంత వరకూ చెవులు మెలిపెట్టిన వాడినే, కింద పడేసి వాడి మీద కూర్చుని, చెవులు పట్టుకున్నాడు.

photo by Rosh PR

‘ట్రక్కు డ్రైవర్‌ అవుదామనుకుంటున్నాడు అంకుల్‌’ అన్నాడు అనువాద కుంక. అయినా బండబాబు శాంతించ లేదు. సన్నటి కుంక చెవులు వదిలేసి, తన చేతుల్ని పిస్తోలు గా మలిచి, ‘డిషాం… డిషాం.. డిషాం…’ అన్నాడు. ‘అర్థమయింది అంకుల్‌! వీడు మిలట్రీ డ్రైవర్‌ గా అవుదామనుకుంటున్నాడు.’ చెప్పేశాడు మన అనువాద కుంక.పువ్వు పుట్టగానే చెవిలోకి చేరుతుంది. వీణ్ణి చూడగానే నాకీ సుభాషితం తట్టింది. వామ్మో! వీడు మాటల మనిషి కాదు. పూర్తి చేతల మనిషి- అని తేలిపోయింది. తమ తమ కలల్ని నిజం చేసుకోవటానికి, ఎవరెవరు ఎంత వరకూ చదవాలో ఒకరి తర్వాత ఒకరు చెప్పారు. ఎమ్మెస్‌,ఎంటెక్‌, ఐపిఎస్‌- ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. మన బండ బాబు ఈ ప్రశ్నకు మాత్రం నోటితో సమాధానం చెబుతాడా? అంత వరకూ సన్నకుంక మీద స్వారీ చేస్తున్నవాడు కాస్తా గబాల్న దూకేశాడు. నేను అనువాద కుంక వైపు చూశాను. ‘బడి మధ్యలో మానేస్తానని అర్థం సార్‌. మిలట్రీలో ట్రక్కు డ్రైవర్‌కు అంతకు మించి చదువు అనవసరం కదా అంకుల్‌ ‘ అనువాద కుంక, ఈ సారి తన భాష్యాన్ని కూడా జోడించాడు. ఏమయితేనేం? బండబాబు దేశభక్తికి మురిసి పోయాను. నిజమే కదా! ఇప్పుడు చదువులెక్కువయి పోయాయి. చదవేస్తే వున్న మతి కాదు… వున్న నీతి కాస్తా పోయింది. ప్రజాస్వామ్యపు అన్ని అంగాలలోనూ, చదువరులు చక్కబెట్టేస్తున్నారు. పూర్వం చట్టశాసన సభల్లో వేలి ముద్రగాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇంతటి అవినీతి లేదు. వాళ్ళు పుచ్చుకున్నదానికన్నా, ఇచ్చిందే ఎక్కువ. వెనకటికి గోదావరి జిల్లాలో పెద్దగా చదువుకోని శాసన సభ్యుడుండేవారు. అప్పటి చట్ట సభలో ఏదో ఒక తీర్మానాన్ని ప్రవేశ పెట్టి సభ్యుల సమ్మతిని కోరుతున్నారు. ఎవరికి వారు ‘ఐ కంకర్‌'(నేను సమ్మతిస్తున్నాను’) అని ఇంగ్లీషులో చెబుతున్నారు. అప్పుడు సదరు శాసన సభ్యుడు లేచి ‘దానిదేముంది? మంచి పని చేస్తుంటే నేను కాదంటానా? రోడ్డు వేస్తున్నట్టారు కాబోలు. నాది కూడా ఒక బండి కంకర’ అని తన దాన గుణాన్ని ప్రకటించాడు. ఇప్పుడు చదువుకున్న నేతల్లో కొండల్ని సైతం మింగేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. వాళ్ళ కన్నా ఆ నిరక్షరాస్యులే ఎంతో మేలనిపిస్తుంది. కడకు ఐయ్యేఎస్‌లు కూడా ‘జైలు గుమ్మాలు’ తొక్కేస్తున్నారు. న్యాయవ్యవస్థలో కూడా ఈ పంకిలం చేరిపోయింది. ఇలాంటప్పుడు. సమాజానికి చదువున్నా లేకున్నా, బుధ్దివుంటే చాలనిపిస్తోంది.

పెళ్ళప్పుడు వధూవరులకు బంధువులిచ్చే కానుకల్ని ‘చదివింపులు’ అంటారు. అధికార కేంద్రాలలో వున్న వారు ఇంతవరకూ చదివింది చాలక ఇంకా ‘చదివించ’ మంటున్నారు. ఎంతని చదివిస్తాం చెప్పండి. దాంతో సమాజానికి చదువు మీదే విసుగెత్తిపోయింది. ఫలితంగా చదువులేని వారికి అధికారమిచ్చేస్తే పోతుందని తెంపు చేసేసుకుంది.

‘డాక్టర్‌! తలనొప్పి!!’ అంటే, ‘బాధపడకు. తల తీసేస్తా కదా!’ అన్నట్టుంది నేటి మధ్యతరగతి సమాజం వరస కూడా. చదువేలేకుంటే, సమాజం మధ్యయుగాల్లోనే వుండిపోయేది. ఏదో రెండు ఔన్సుల మద్యం తాగినందుకు, చెట్టుకు కట్టేసి కొరడాలతో కొట్టడాన్ని ఇప్పటికీ హర్షిస్తూ వుండే వాళ్ళం. అలా కొట్టటం పౌర హక్కుల ఉల్లంఘన- అని బాధపడేవాళ్ళం కాదు. అందుకే అధికారం, అవినీతి పర్యాయ పదాలు కావచ్చు. కానీ చదువూ, నీతీ వ్యతిరేక పదాలు కావు. బాగా చదువుకున్న వాళ్ళే, జాతీయోద్యమానికీ, సంస్కరణోద్యమానికీ సారధులయ్యారు.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రికలో 1జనవరి 2011 నాడు ఫ్రచురితం)

2

3 comments for “చదవేస్తే ఉన్న ‘నీతి’ పోతుందా?

  1. ‘విద్యా విహీనః పసుహు’ అన్నది పాత మాట! ‘విద్యా సహితః పసుహు’ అన్నది కొత్త మాట! ‘విద్య లేనివాడు వింత పశువు!’విద్య వున్నవాడు పదవి పశువు’ అన్నది నేటి మాట. అధికారం అవినీతికి లైసెన్స్ గా మారింది. ఇందులో లింగ భేదం లేదు! Thanks for the nice piece! Yeh dil maange more! warm regards.

  2. చదువు మీద అంత దాడి చేసి, చివర, చదువుకోండి అంటే ఎట్టా సార్! నాకైతే, చివరి పేరా కాకుండా మిగిలిందే బాగుంది. ఎందుకొచ్చిన బూర్జువా చదువులు. చదువుకున్న వాళ్లను కూడేసి, బూర్జువా అయిపోవడం బెటరు. చదువుకుంటే ‘పని వాడు’ కావడమే కదా. ఏమంటారు సార్! (సారు వెనుక బెత్తం లేదు కదా?!):)

Leave a Reply